Australia T20 World Cup Team: స్టీవ్ స్మిత్‌కు షాక్.. కెప్టెన్‌గా మిచెల్ మార్ష్.. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ టీమ్ ఇదే
Australia T20 World Cup Team: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఆస్ట్రేలియా తమ జట్టును అనౌన్స్ చేసింది. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కు జట్టులో చోటు దక్కకపోగా.. మిచెల్ మార్ష్ కు పూర్తిస్థాయిలో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
Australia T20 World Cup Team: మాజీ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా తమ టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది. అయితే పదేళ్ల తర్వాత తొలిసారి వరల్డ్ కప్ జట్టులో స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ 15 మంది సభ్యుల జట్టును మిచెల్ మార్ష్ లీడ్ చేయనున్నాడు. అటు ఐపీఎల్ 2024లో రాణిస్తున్న ఫ్రేజర్ మెక్‌గర్క్ కు కూడా చోటు దక్కలేదు.
స్టీవ్ స్మిత్ ఔట్
టీ20 వరల్డ్ కప్ 2024 కోసం జట్టును అనౌన్స్ చేయడానికి మే 1న డెడ్‌లైన్ కాగా.. చివరి రోజు మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా తమ టీమ్ ను ప్రకటించింది. మిచెల్ మార్ష్ కెప్టెన్సీలోని 15 మంది సభ్యుల బృందం వెస్టిండీస్, అమెరికాల్లో జరిగే ఈ మెగా టోర్నీ కోసం వెళ్లనుంది. ఈ జట్టు ఎంపికలో అక్కడి సెలక్టర్లు కొన్ని ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకున్నారు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి 18 నెలలుగా దూరంగా ఉన్న ఆష్టన్ అగార్, కామెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్స్ ను కూడా ఎంపిక చేశారు. అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024లో చెలరేగిపోతున్న జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ ను కూడా జట్టులోకి తీసుకోలేదు. ఏడాది కాలంగా తాత్కాలికంగా ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కెప్టెన్ గా ఉన్న మిచెల్ మార్ష్ కు ఇప్పుడు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు.
అయితే స్టీవ్ స్మిత్ ను ఎంపిక చేయకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించింది. 2014 తర్వాత ఓ వరల్డ్ కప్ జట్టులోకి స్మిత్ ను తీసుకోకపోవడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా టీమ్ 2015, 2023 వన్డే వరల్డ్ కప్ లతోపాటు 2021లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్లలో స్మిత్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు 2010లో కరీబియన్ దీవుల్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ అతడు ఆడాడు.
చివరిసారి 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ జట్టులోనూ స్మిత్ ఉన్నాడు. 2015, 2019, 2023 వన్డే వరల్డ్ కప్ లతోపాటు 2016, 2018, 2021, 2022 టీ20 వరల్డ్ కప్ జట్టలో రెగ్యులర్ గా స్మిత్ కు చోటు దక్కింది. ఈసారి మాత్రం అతనికి ఛాన్స్ దక్కకపోవడం అభిమానులను షాక్ కు గురి చేస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో టీ20ల నుంచి అతడు మెల్లగా కనుమరుగవుతున్నాడు.
అటు తనను కెప్టెన్ గా నియమించడంపై మిచెల్ మార్ష్ స్పందించాడు. "దేశానికి ఆడటం అనేది గొప్ప గౌరవం. ఇప్పుడు వరల్డ్ కప్ లో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం మరింత గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ మధ్య కాలంలో మేము బాగా రాణించాం. ఇప్పుడు రాబోయే టోర్నీలో రాణిస్తామన్న నమ్మకం ఉంది" అని మార్ష్ అన్నాడు.
ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆష్టన్ అగార్, ప్యాట్ కమిన్స్, టిమ డేవిడ్, నేథన్ ఎలిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా