Team India: టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే ఇలా చేయండి: టీమిండియాకు లెజెండరీ ప్లేయర్ సలహా
27 June 2024, 16:15 IST
Team India: టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే ఓ జట్టుగా ఆడాలని, ఒక ప్లేయర్ పై ఆధారపడకూడదని టీమిండియాకు సూచించాడు లెజెండరీ ప్లేయర్ కపిల్ దేవ్. ఏ టీమ్ ఒకే ప్లేయర్ పై ఆధారపడి కప్పు గెలవదని స్పష్టం చేశాడు.
టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే ఇలా చేయండి: టీమిండియాకు లెజెండరీ ప్లేయర్ సలహా
Team India: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా సెమీఫైనల్ ఆడబోతోంది. ఇంగ్లండ్ తో జరగబోయే ఈ రెండో సెమీఫైనల్లో గెలిచి 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్ కు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న టీమ్ కు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఓ కీలకమైన సూచన చేశాడు. వరల్డ్ కప్ గెలవాలంటే వ్యక్తులుగా కాదు.. జట్టుగా ఆడండని అతడు సలహా ఇవ్వడం గమనార్హం.
ఒక్కరిపై ఆధారపడితే గెలవలేరు
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ మాట్లాడాడు. "రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ గురించే ఎందుకు మాట్లాడాలి? ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది. వాళ్ల పని టోర్నమెంట్ గెలవడమే. ఓ మ్యాచ్ గెలవాలంటే ఎవరో ఒకరు ఆడితే సరిపోతుంది.కానీ టోర్నమెంట్ గెలవాలంటే ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలి. బుమ్రా లేదంటే అర్ష్‌దీప్ పై ఆధారపడితే మనం ఓడిపోతాం" అని కపిల్ స్పష్టం చేశాడు.
"మనం జట్టు గురించి మాట్లాడుకుందాం. ఓ ప్లేయర్ కంటే జట్టు గురించి మాట్లాడితే మనకు అసలు పరిస్థితి తెలుస్తుంది. ఓ ప్రధాన ప్లేయర్ ఉన్నాడు. మనం అతని చుట్టూ తిరగొచ్చు. కానీ వరల్డ్ కప్ గెలవాలంటే మాత్రం ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలి" అని కపిల్ అన్నాడు.
అలాగే 1983 వరల్డ్ కప్ గెలిచాం
ఈ సందర్భంగా తాము 1983లో గెలిచిన వరల్డ్ కప్ గురించి కూడా కపిల్ దేవ్ ప్రస్తావించాడు. "రోజర్ బిన్నీ, మొహిందర్ అమర్‌నాథ్, కీర్తి ఆజాద్, యశ్‌పాల్ శర్మ అందరూ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశారు. ఒకే ప్లేయర్ పై ఆధారపడితే టోర్నమెంట్లు గెలవలేరు" అని కపిల్ దేవ్ తేల్చి చెప్పాడు. ఇంగ్లండ్ తో సెమీఫైనల్ ఆడబోయే టీమిండియాకు కపిల్ ఆల్ ద బెస్ట్ చెప్పాడు.
"ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఇండియన్ ప్లేయర్స్ ఎలా ఆడుతున్నారో అదే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఒక్క రోజు సరిగా ఆడకుండా టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్లిపోకూడదు. గతేడాది 50 ఓవర్ల వరల్డ్ కప్ లో ఏం జరిగిందో అలా జరగకూడదు. వాళ్లు బాగా ఆడుతున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లకు హ్యాట్సాఫ్" అని కపిల్ దేవ్ అన్నాడు.
ప్రతిసారీ ఓ గ్లోబల్ టోర్నమెంట్లో ఆడినప్పుడు ఫేవరెట్ ట్యాగ్ టీమిండియాకు ఉండటం తనకు చాలా గర్వంగా ఉందని కపిల్ చెప్పాడు. "మనం గెలవగలం అన్న ఆలోచన ఉందంటే మనం చాలా సంతోషించాలి. 20 ఏళ్ల కిందట అలా ఆలోచించలేదు. ప్రతి టోర్నమెంట్లో ఇండియా ఫేవరెట్ గా వెళ్లడం అనేది చాలా ముఖ్యం.
దీని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. క్రికెట్ ను కెరీర్ గా తీసుకునేందుకు ప్రతి యువకుడికి ఇదొక స్ఫూర్తిగా పని చేస్తుంది. ఇండియన్ క్రికెట్ ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది" అని కపిల్ అన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2024 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ తో ఇండియా తలపడబోతోంది. ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్ చేరింది.