SA vs AFG Semifinal: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. తొలిసారి ఓ వరల్డ్ కప్ ఫైనల్లోకి.. చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్థాన్-south africa in t20 world cup final beat afghanistan in first semi final ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sa Vs Afg Semifinal: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. తొలిసారి ఓ వరల్డ్ కప్ ఫైనల్లోకి.. చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్థాన్

SA vs AFG Semifinal: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. తొలిసారి ఓ వరల్డ్ కప్ ఫైనల్లోకి.. చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్థాన్

Hari Prasad S HT Telugu
Jun 27, 2024 08:16 AM IST

SA vs AFG Semifinal: సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఓ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో ఓడే తమ సాంప్రదాయానికి చెక్ పెడుతూ ఏకపక్షంగా సాగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్ ను చిత్తు చిత్తుగా ఓడించింది.

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. తొలిసారి ఓ వరల్డ్ కప్ ఫైనల్లోకి.. చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్థాన్
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. తొలిసారి ఓ వరల్డ్ కప్ ఫైనల్లోకి.. చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్థాన్ (REUTERS)

SA vs AFG Semifinal: సౌతాఫ్రికా ఇక ఏమాత్రం చోకర్స్ కాదు. వరల్డ్ కప్ లలో సెమీఫైనల్ గండాన్ని ఆ టీమ్ గట్టెక్కింది. గురువారం (జూన్ 27) ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన తొలి సెమీఫైనల్లో 9 వికెట్లతో ఘన విజయం సాధించి తొలిసారి ఓ వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. మొదట ఆఫ్ఘన్ జట్టును కేవలం 56 పరుగులకే కుప్పకూల్చి.. టార్గెట్ ను 8.5 ఓవర్లలోనే చేజ్ ఘనంగా టీ20 వరల్డ్ కప్ 2024 ఫైరల్ చేరింది.

ఫైనల్లో సౌతాఫ్రికా

ఆఫ్ఘనిస్థాన్ విధించిన 57 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం సౌతాఫ్రికాకు పెద్ద కష్టమేమీ కాలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్ డికాక్ (5) వికెట్ కోల్పోయినా.. తర్వాత మరో వికెట్ పడకుండానే తమ జట్టును విజయం వైపు నడిపించారు రీజా హెండ్రిక్స్ (29), ఏడెన్ మార్‌క్రమ్ (23). ఇద్దరూ అజేయంగా నిలిచారు. దీంతో కేవలం 8.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని చేజ్ చేసింది సౌతాఫ్రికా.

అటు వన్డే, ఇటు టీ20 వరల్డ్ కప్ లలో గతంలో ఎప్పుడూ ఫైనల్ చేరని సౌతాఫ్రికా.. మొత్తానికి తొలిసారి ఇప్పుడు ఆ గండాన్ని అధిగమించింది. అది కూడా ఎలాంటి తడబాటు లేకుండా. ఈ వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా అసలు ఓటమెరగని జట్టుగా దూసుకెళ్లింది. లీగ్ స్టేజ్ లో నాలుగు, సూపర్ 8లో మూడు గెలిచిన ఆ టీమ్.. సెమీఫైనల్ కూడా గెలిచి ఓటమెరగని జట్టుగా ఫైనల్ చేరింది. ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగబోయే రెండో సెమీఫైనల్ విజేతతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడనుంది.

ఎక్స్‌ట్రాలే అత్యధిక స్కోరు

అంతకుముందు లీగ్ స్టేజ్ లో న్యూజిలాండ్, సూపర్ 8లో ఆస్ట్రేలియాలాంటి జట్లను ఓడించి సంచలనం సృష్టించిన ఆఫ్ఘనిస్థాన్.. సెమీఫైనల్లో సౌతాఫ్రికా బౌలర్ల ముందు నిలవలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసి కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

అయితే తొలి ఓవర్లో మొదలైన వాళ్ల వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. సఫారీ పేసర్లు యాన్సెన్, రబాడా, నోక్యా, స్పిన్నర్ షంసిల నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఆఫ్ఘన్ బ్యాటర్లకు చుక్కలు కనిపించాయి. దీంతో కేవలం 11.5 ఓవర్లలోనే 56 పరుగులకు చేతులెత్తేసింది.

సఫారీ బౌలర్ల జోరు

సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ 3, షంసి 3, రబాడా, నోక్యా చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ల ఇన్నింగ్స్ లో ఎక్స్‌ట్రాలే అత్యధిక స్కోరు కావడం విశేషం. సౌతాఫ్రికా బౌలర్లు 13 అదనపు పరుగులు ఇచ్చారు. ఇక అబ్దుల్లా ఒమర్జాయ్ మాత్రమే రెండంకెల స్కోరు అంటే 10 పరుగులు చేశాడు. మిగతా ఏ బ్యాటర్ కూడా 9 పరుగులు దాటలేకపోయారు.

గుర్బాజ్ (0), ఇబ్రహీం జద్రాన్ (2), గుల్బదీన్ నాయిబ్ (9), మహ్మద్ నబీ (0), ఖరోటే (2), కరీం జానత్ (8), రషీద్ ఖాన్ (8).. ఇలా అందరూ చేతులెత్తేశారు. తొలి ఓవర్లో 4 పరుగుల దగ్గర మొదలైన వికెట్ల పతనం.. మూడో ఓవర్ నుంచి దాదాపు ప్రతి ఓవర్ కొనసాగింది. నాలుగో ఓవర్లో, పదో ఓవర్లో రెండేసి వికెట్లు కోల్పోయింది. యాన్సెన్ 3 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.

ఇక స్పిన్నర్ షంసి కూడా 1.5 ఓవర్లలోనే కేవలం 6 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. రబాడా 3 ఓవర్లలో 14 పరుగులకే 2 వికెట్లు, నోక్యా 3 ఓవర్లలో 7 పరుగులకే 2 వికెట్లు తీశారు.

Whats_app_banner