Kane Williamson: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విలియమ్సన్.. న్యూజిలాండ్ దారుణ ఓటమితో సెంట్రల్ కాంట్రాక్టూ వద్దంటూ..
Kane Williamson: న్యూజిలాండ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు కేన్ విలియమ్సన్. అంతేకాదు అక్కడి క్రికెట్ బోర్డు అందించే సెంట్రల్ కాంట్రాక్టును కూడా అతడు వదులుకున్నాడు.
Kane Williamson: టీ20 వరల్డ్ కప్ లీగ్ స్టేజ్ నుంచే న్యూజిలాండ్ ఇంటిదారి పట్టడంతో దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీని వదులుకున్నాడు కేన్ విలియమ్సన్. అంతేకాదు 2024-25 సీజన్ సెంట్రల్ కాంట్రాక్టును కూడా అతడు వదులుకున్నాడు. అయితే అతడు అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం మూడు ఫార్మాట్లలోనూ కొనసాగనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ స్పష్టం చేసింది.
తప్పుకున్న విలియమ్సన్
టీ20 వరల్డ్ కప్ 2024 నుంచి న్యూజిలాండ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేసింది. తొలి మ్యాచ్ లోనే ఆఫ్ఘనిస్థాన్ తో ఓటమి, తర్వాత వెస్టిండీస్ చేతుల్లోనూ పరాజయంతో కివీస్ లీగ్ స్టేజ్ లోనే తప్పుకోవాల్సి వచ్చింది. దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ బుధవారం (జూన్ 19) కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు కేన్ విలియమ్సన్.
ఇప్పటికీ అతడు మూడు ఫార్మాట్ల సెలెక్షన్ కూ అందుబాటులో ఉన్నా.. ప్రస్తుతం తన దృష్టంతా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పైనే అని ఈమధ్యే అతడు చెప్పాడు. అటు న్యూజిలాండ్ క్రికెట్ కూడా స్పందిస్తూ.. విలియమ్సన్ డబ్ల్యూటీసీ 8 మ్యాచ్ లకు అందుబాటులో ఉండటంతోపాటు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్ లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడతాడని స్పష్టం చేసింది.
విలియమ్సన్ ఏమన్నాడంటే..
తాను కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై కేన్ విలియమ్సన్ స్పందిస్తూ.. ఇది తన అంతర్జాతీయ క్రికెట్ కు ముగింపు కాదని అన్నాడు. అంతేకాదు భవిష్యత్తులో మరోసారి సెంట్రల్ కాంట్రాక్టు అంగీకరిస్తానని కూడా చెప్పాడు. "అన్ని ఫార్మాట్లలోనూ న్యూజిలాండ్ ను ముందుకు తీసుకెళ్లడం నాకు ఇష్టం. ఆ పని కొనసాగిస్తూనే ఉంటాను" అని విలియమ్సన్ అన్నాడు.
"న్యూజిలాండ్ సమ్మర్ సమయంలో విదేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసమే సెంట్రల్ కాంట్రాక్టును వదులుకున్నాను. న్యూజిలాండ్ కు ఆడటాన్ని గౌరవంగా భావిస్తాను. క్రికెట్ బయట నా ప్రాధాన్యతలు మారిపోయాయి. కుటుంబానికి ఎక్కువ సమయం ఇస్తున్నాను" అని అతడు చెప్పాడు. న్యూజిలాండ్ క్రికెట్ గొప్ప ప్లేయర్ విలియమ్సన్ అని, అతడు కాస్త సమయం మిగతా విషయాల్లో గడిపే హక్కును సొంతం చేసుకున్నాడని ఆ బోర్డు సీఈవో స్కాట్ వీనింక్ అన్నారు.
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా గ్రూప్ సిలో న్యూజిలాండ్ ఆడింది. అయితే తొలి మ్యాచ్ లోనే ఆఫ్ఘనిస్థాన్ చేతుల్లో దారుణమైన ఓటమితో సూపర్ 8 అవకాశాన్ని సంక్లిష్టంగా మార్చుకుంది. ఆ మ్యాచ్ లో కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. తర్వాత వెస్టిండీస్ చేతుల్లోనూ ఓటమితో ఇంటిదారి పట్టక తప్పలేదు. దీంతో మరోసారి ఐసీసీ టోర్నీ గెలవకుండా కివీస్ టీమ్ నిరాశపరిచింది.