Pakistan Cricketer: టీమిండియా బౌలర్లపై మళ్లీ ఏడుపు మొదలుపెట్టిన పాకిస్థాన్ మాజీలు.. రివర్స్ స్వింగ్ ఎలా అవుతుందంటూ..
Pakistan Cricketer: టీమిండియా బౌలర్లపై మరోసారి ఏడుపు మొదలుపెట్టారు పలువురు పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు. 15వ ఓవర్లోనే బంతి ఎలా రివర్స్ స్వింగ్ అవుతుందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
Pakistan Cricketer: ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన ప్రతీకార విజయాన్ని షోయబ్ అక్తర్ లాంటి పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కొనియాడుతుంటే.. మరోవైపు ఇంజమామ్, సలీమ్ మాలిక్ లాంటి వాళ్లు మాత్రం ఏడుపు మొదలుపెట్టారు. అర్ష్‌దీప్ సింగ్ 15వ ఓవర్లోనే ఎలా రివర్స్ స్వింగ్ చేస్తాడంటూ పరోక్షంగా ఇండియన్ టీమ్ పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు చేయడం గమనార్హం.
అర్ష్‌దీప్‌పై ఇంజీ ఏడుపు
ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో 15వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ రివర్స్ స్వింగ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ ఇండియన్ బౌలర్లు మ్యాచ్ బాల్ రూపాన్ని మారుస్తున్నారని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ పరోక్షంగా ఆరోపించాడు. ఓ టీవీ చర్చలో మరో మాజీ క్రికెటర్ సలీమ్ మాలిక్ తో కలిసి అతడు ఈ చర్చలో పాల్గొన్నాడు. అదే ఎవరైనా పాకిస్థాన్ క్రికెటర్ చేసి ఉంటే ఎంతో హంగామా చేసేవారని అతడు అన్నాడు.
"అర్ష్‌దీప్ సింగ్ 15వ ఓవర్ వేసే సమయంలో బాల్ రివర్స్ స్వింగ్ అవుతోంది. కొత్త బంతితో ఇది చాలా త్వరగా రివర్స్ అయినట్లుగా లేదా? అంటే బాల్ రివర్స్ స్వింగ్ కోసం 12 లేదా 13వ ఓవర్లోనే రెడీ అయింది. అంపైర్లు ఈ విషయాలను కాస్త కళ్లు తెరిచి చూడాలి. ఒకవేళ పాకిస్థాన్ క్రికెటర్లు ఇలా చేస్తే పెద్ద సమస్య అయ్యేది. మాకు రివర్స్ స్వింగ్ గురించి బాగా తెలుసు. అర్ష్‌దీప్ 15వ ఓవర్లోనే వచ్చి బంతిని రివర్స్ చేస్తున్నాడంటే ఏదో పెద్ద పనే జరిగి ఉండాలి" అని ఇంజమామ్ అనడం గమనార్హం.
ఆ టీమ్స్ విషయంలో అంతే..
ఇదే సమయంలో చర్చలో పాల్గొన్న మరో మాజీ సలీమ్ మాలిక్ కూడా ఇంజీకి వంతపాడాడు. "ఇంజీ నేనెప్పుడూ ఇదే చెబుతాను. కొన్ని టీమ్స్ ఆడే సమయంలో అంపైర్ల కళ్లు మూసుకుపోతాయి. ఇండియా అందులో ఒకటి. జింబాబ్వేలో వసీం అక్రమ్ బౌలింగ్ చేసే సమయంలో అతడు బంతిని తడి చేశాడు. మేము అది చూసి ఆశ్చర్యపోయాం. బంతికి ఓ వైపు మాత్రం ఎలా తడి అయ్యిందంటూ నేను వెళ్లి అడిగితే నాకు జరిమానా విధించారు" అని చెప్పొకొచ్చాడు.
బుమ్రాలాంటి బౌలర్ తన యాక్షన్ తో బంతిని రివర్స్ స్వింగ్ చేయడంలో ఆశ్చర్యం లేదు కానీ.. అర్ష్‌దీప్ చేశాడంటేనే ఆశ్చర్యం కలుగుతోందని కూడా ఇంజమామ్ అన్నాడు. అయితే ఇండియా బౌలర్లపై పాకిస్థాన్ మాజీలు ఇలా బాల్ టాంపరింగ్ ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ షమి బౌలింగ్ చూసి మరో మాజీ హసన్ రజా కూడా ఇవే ఆరోపణలు చేశాడు.
అయితే ఆ సమయంలో వసీం అక్రమ్ లాంటి పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ క్రికెట్ పరువు తీయొద్దంటూ తమ క్రికెటర్లకే అతడు హితవు పలికాడు. ఇప్పుడు అతడితో కలిసి ఆడిన ఇంజమామ్, సలీం మాలిక్ లాంటి వాళ్లు కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.