తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus 2024: మళ్లీ గాయపడిన టీమిండియా ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియా టూర్ ఆశలకి పూర్తిగా తెర!

IND vs AUS 2024: మళ్లీ గాయపడిన టీమిండియా ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియా టూర్ ఆశలకి పూర్తిగా తెర!

Galeti Rajendra HT Telugu

06 November 2024, 12:35 IST

google News
  • Shami Injury: ఆస్ట్రేలియా టూర్‌‌లో కనీసం ఒక్క టెస్టులోనైనా మహ్మద్ షమీ ఆడతాడని ఆశించిన భారత్ అభిమానులకి నిరాశే ఎదురైంది. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న క్రమంలో షమీకి మళ్లీ గాయమైంది. 

మహ్మద్ షమీ
మహ్మద్ షమీ (Getty)

మహ్మద్ షమీ

ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లి అక్కడ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడాలని ఆశించిన భారత్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి మళ్లీ నిరాశే ఎదురైంది. త్వరలో అక్కడికి వెళ్లనున్న టీమిండియా.. నవంబరు 22 నుంచి ఐదు టెస్టుల సిరీస్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ మేరకు ఇప్పటికే జట్టుని కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించేసింది.

షమీ ఇంకెన్ని రోజులు?

కానీ.. మహ్మద్ షమీ ఒకవేళ ఫిట్‌నెస్ సాధిస్తే.. సిరీస్ మధ్యలోనే అక్కడికి పంపాలని బీసీసీఐ ఆశించింది. ఆస్ట్రేలియా పిచ్‌లపై అనుభవం ఉన్న షమీ టీమ్‌లో ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందని ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా గడ్డపై చివరిగా జరిగిన రెండు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోను భారత్ జట్టు గెలిచిన విషయం తెలిసిందే. ఇందులో షమీ పాత్ర కీలకంగా ఉంది.

వన్డే ప్రపంచకప్-2023లో గాయపడిన మహ్మద్ షమీ.. అప్పటి నుంచి భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. కానీ.. వరుస గాయాలు అతనికి ఆ అవకాశం ఇవ్వడం లేదు. రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు తొలుత బెంగాల్ సెలెక్టర్లు పేసర్ మహ్మద్ షమీ‌ని ఎంపిక చేశారు. కానీ.. గాయం కారణంగా అతని పేరును తప్పించక తప్పలేదు. దాంతో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో మళ్లీ ఆడాలనే షమీ ఆశలకు పూర్తిగా తెరపడింది.

ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపికైన భారత్ టెస్టు జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, ప్రసీద్ కృష్ణ

మళ్లీ గాయపడిన షమీ

తొలుత చీలమండ గాయంతో భారత్ జట్టుకి గత ఏడాది దూరమైన షమీ.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉండి ఫిట్‌నెస్ సాధించే ప్రయత్నం చేశాడు. అయితే.. ఈ క్రమంలో అతని మోకాలికి గాయమైంది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ముంగిట షమీ గాయం గురించి మాట్లాడిన రోహిత్ శర్మ.. గాయం కారణంగా షమీ మోకాలికి వాపు వచ్చినట్లు వెల్లడించాడు.

మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న షమీకి ఇప్పుడు కొత్తగా పక్కటెముకల గాయమైనట్లు తెలుస్తోంది. దాంతో షమీ రీఎంట్రీ మరింత ఆలసమయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ టైమ్‌కి షమీ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

షమీ రికార్డులిలా

2013 నుంచి భారత్ జట్టుకి ఆడుతున్న మహ్మద్ షమీ.. ఇప్పటి వరకు 64 టెస్టులు, 101 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లను ఈ క్రమంలో మొత్తం 448 వికెట్లు షమీ పడగొట్టాడు. టీ20ల్లో అంచనాల్ని అందుకోలేకపోయినా.. వన్డే, టెస్టుల్లో మాత్రం షమీ గణాంకాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. భారత్ గడ్డపైనే కాదు.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పిచ్‌లపై కూడా షమీకి అరుదైన రికార్డులు ఉన్నాయి. అయితే.. గాయం ఈ 34 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ కెరీర్‌ని దారుణంగా దెబ్బతీస్తోంది.

తదుపరి వ్యాసం