Team India: భారత్ జట్టులో వివాదం.. రోహిత్ శర్మ వద్దన్న పనినే చేసిన గౌతమ్ గంభీర్, ఆస్ట్రేలియా టూర్ ముంగిట విభేదాలు
Rohit Sharma vs Gautam Gambhir: ఆస్ట్రేలియా టూర్‌కి భారత్ జట్టు ఎంపికలో రోహిత్ శర్మ ఒక ప్లేయర్ పేరుని సూచిస్తే.. గంభీర్ మరో ప్లేయర్‌ని ఎంపిక చేశాడు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భారత్ జట్టులో వివాదం రాజుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 0-3 తేడాతో వైట్‌వాష్‌కి గురైంది. 24 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై భారత్ జట్టు ఇలా సిరీస్ ఓడిపోవడం ఇదే తొలిసారి.
కెప్టెన్‌కి స్వేచ్ఛనివ్వని గంభీర్
భారత్ జట్టు సిరీస్ ఓటమి తర్వాత భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (భీసీసీఐ) జరిపిన విచారణతో భారత్ జట్టులో విభేదాలు తెరపైకి వచ్చాయి. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక రకమైన పిచ్‌ను ఆశిస్తే.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరో రకమైన పిచ్‌ను సిద్ధం చేయించినట్లు తెలుస్తోంది. అలా జట్టు ఎంపికలోనూ రోహిత్ శర్మకి స్వేచ్ఛని ఇవ్వలేదనే విషయం వెలుగులోకి వచ్చింది.
అప్పట్లో కుంబ్లే.. ఇప్పుడు గంభీర్
సాధారణంగా హెడ్ కోచ్, కెప్టెన్ ఒకే పేజీలో ఉండరు. గతంలో విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే మధ్య ఇలాంటి విభేదాలు వచ్చాయి. కానీ.. ఆ తర్వాత రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ మధ్య సఖ్యత బాగా కుదిరింది. అనంతరం వచ్చిన రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ మధ్య కూడా ఎలాంటి విభేదాలు రాలేదు. అయితే.. గంభీర్, రోహిత్ శర్మ మధ్య మాత్రం పొంతన కుదురడం లేదు.
జట్టు ఎంపికలో రోహిత్‌కి నిరాశ
శ్రీలంకతో ఇటీవల వన్డే సిరీస్, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ సమయంలో తుది జట్టుని గంభీర్ ఏకపక్షంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు సిరీస్‌ల్లోనూ భారత్ జట్టు చిత్తుగా ఓడిపోగా.. రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూములో సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో నవంబరు 22 నుంచి ప్రారంభంకానున్న టెస్టు సిరీస్‌కి జట్టు ఎంపికలోనూ గంభీర్ ఎక్కువ చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా ఇద్దరు ప్లేయర్లని జట్టులోకి తీసుకున్నాడట. ఇందులో తెలుగు ప్లేయర్ సతీశ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు.
శార్ధూల్ కావాలంటే.. సతీశ్ రెడ్డిని ఎంపిక
వాస్తవానికి ఆస్ట్రేలియా గడ్డపై గతంలో సత్తాచాటిన శార్ధూల్ ఠాకూర్‌ని ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకోవాలని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రతిపాదిస్తే.. గంభీర్ మాత్రం రోహిత్ శర్మ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా నితీశ్ కుమార్ రెడ్డిని తీసుకున్నాడట. అలానే కొత్త బౌలర్ హర్షిత్ రాణా ఎంపికలోనూ గంభీర్ పాత్ర ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
రోహిత్ ఒకలా.. గంభీర్ మరోలా
టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ సాధారణంగా దూకుడుగా ఆడటానికి ఇష్టపడతాడు. టీమ్‌కి కూడా అదే చెప్తుంటాడు. కానీ.. గంభీర్ మాత్రం.. సంప్రదాయ పద్ధతిలో టెస్టు క్రికెట్‌ను రక్షణాత్మక ధోరణిలోనే ఆడాలని టీమ్‌కి ఆదేశించినట్లు తెలుస్తోంది. అలానే న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కి పుణె, వాంఖడే పిచ్‌లను 2-3 రోజు బంతి తిరిగేలా తయారు చేయమని రోహిత్ శర్మ సూచిస్తే.. గంభీర్ మాత్రం మొదటి రోజు నుంచే బంతి తిరిగేలా తయారు చేయమని క్యూరేటర్లకి సూచించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇది భారత్ జట్టుకి శాపంగా మారింది.
రిటైర్మెంట్‌కి దగ్గరగా రోహిత్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకి రోహిత్ శర్మ దూరంగా ఉండనున్నాడు. వ్యక్తిగత కారణాలు అని చెప్తున్నాడు.. కానీ రీజన్ ఏంటో మాత్రం తెలియరావడం లేదు. ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనలో గంభీర్‌తో ఇలానే విభేదాలు కొనసాగితే.. అతను టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే టీ20లకి గుడ్ బై చెప్పేసిన రోహిత్.. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు.