IPL 2025 Auction Pool: ఐపీఎల్ 2025 వేలానికి దూరంగా స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్, లిస్ట్‌లోకి అనూహ్యంగా 42 ఏళ్ల బౌలర్
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలానికి 1,574 మంది ప్లేయర్లు తమ పేర్లని రిజిస్టర్ చేసుకున్నారు. కానీ.. చెన్నై సూపర్ కింగ్స్‌కి 2023లో ఆడిన బెన్‌స్టోక్స్ మాత్రం ఈసారి తన పేరుని రిజిస్టర్ చేసుకోలేదు.
క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న బెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకడిగా ఉన్న ఇంగ్లాండ్ స్టార్ బెన్‌స్టోక్స్ ఐపీఎల్ 2025 సీజన్‌కి దూరంగా ఉండనున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబరు 24, 25 తేదీల్లో జరగనుండగా.. ఈ వేలం కోసం తన పేరుని బెన్‌స్టోక్స్ కనీసం రిజిస్టర్ కూడా చేసుకోలేదు. దాంతో ఐపీఎల్ 2025లో బెన్‌స్టోక్స్ ఆడటం లేదని తేలిపోయింది.
బెన్‌స్టోక్స్ తప్పుకోవడానికి కారణం ఏంటంటే
ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం 1,574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 1,165 మంది భారత్ ఆటగాళ్లు ఉండగా.. మిగిలిన 409 మంది విదేశీ ప్లేయర్లే. అయితే.. ఈ జాబితాలో బెన్‌స్టోక్స్ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా ఉన్న బెన్‌స్టోక్స్ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఐపీఎల్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నాట. ఐపీఎల్ 2022 సీజన్ వేలంలో రూ.16.25 కోట్లకి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ బెన్‌స్టోక్స్‌ని కొనుగోలు చేసింది.
బెన్‌స్టోక్స్ ఐపీఎల్ గణాంకాలు
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చివరిగా ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడిన బెన్‌స్టోక్స్.. గాయం కారణంగా కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 15 పరుగులు చేశాడు. ఆ తర్వాత 12 మ్యాచ్‌లకి డగౌట్‌లోనే కూర్చుండిపోయాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఓవరాల్‌గా 2017 నుంచి ఐపీఎల్‌లో ఆడిన బెన్‌స్టోక్స్ ఇప్పటి వరకు 45 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 935 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ కూడా ఉండటం గమనార్హం.
42 ఏళ్ల మాజీ పేసర్ కొత్తగా వేలానికి
ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ ఉన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ వేలంలో స్టార్క్‌ని రూ.24.50 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. కానీ ఐపీఎల్ 2025 కోసం కేకేఆర్ అతన్ని రిటైన్ చేసుకోలేదు. దాంతో రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో స్టార్క్ తన పేరుని రిజిస్టర్ చేసుకున్నాడు.
మిచెల్ స్టార్క్, జోస్ బట్లర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, జానీ బెయిర్‌స్టో, కగిసో రబాడ, మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్ల తదితర విదేశీ ప్లేయర్లు రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో తమ పేర్లని వేలం కోసం నమోదు చేసుకున్నారు. అనూహ్యంగా ఈసారి ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మెగా వేలంలో తన పేరుని రిజిస్టర్ చేసుకున్నాడు. 42 ఏళ్ల అండర్సన్ రూ.1.25 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలానికి రానున్నాడు.
ఎంత మందిని కొనుగోలు
వేలం కోసం 1,574 మంది ప్లేయర్లు తమ పేర్లని రిజిస్టర్ చేసుకున్నా.. ఇందులో నుంచి కేవలం 204-220 మంది ప్లేయర్లని మాత్రమే కొనుగోలు చేసే వెసులబాటు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి.. ఫ్రాంఛైజీలు బిడ్ వేయడానికి సిద్ధంగా ఉన్న ఆటగాళ్ల జాబితాతో బీసీసీఐ లిస్ట్‌ని భారీగా కుదించనుంది. దాంతో ఓవరాల్‌గా 450-500 మంది ప్లేయర్లు మాత్రమే తుది వేలంలో నిలిచే అవకాశం ఉంటుంది.
భారత్ స్టార్‌లపైనే అందరి దృష్టి
భారత్ ఆటగాళ్లు కూడా ఈసారి చాలా మంది వేలంలో ఉన్నారు. రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ వేలానికి వదిలేయగా.. శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్, కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ వేలంలోకి వదిలేసింది. దాంతో ఈ ముగ్గురిలో ఒక్కరిని చెన్నై సూపర్ కింగ్స్ చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. పంత్ కోసం చెన్నై, బెంగళూరు మధ్య గట్టి పోటీ నడిచే అవకాశం ఉంది.