Ben Stokes on ICC: ఇదేం షెడ్యూల్.. ఐసీసీపై బెన్ స్టోక్స్ సీరియస్
Ben Stokes on ICC: ఇదేం షెడ్యూల్ అంటూ ఐసీసీపై ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సీరియస్ అయ్యాడు. షెడ్యూల్‌పై ఐసీసీ తగినంత దృష్టి సారించడం లేదని అతడు అభిప్రాయపడ్డాడు.
Ben Stokes on ICC: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సిరీస్‌లను షెడ్యూల్ చేస్తున్న విధానంపై ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. షెడ్యూల్‌పై ఐసీసీ తగినంత దృష్టి సారించడం లేదని అన్నాడు. డొమెస్టిక్ టీ20 లీగ్స్‌కు పెరిగిపోతున్న ఆదరణ చూస్తుంటే.. టెస్ట్ క్రికెట్‌కు ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డాడు.
"షెడ్యూలింగ్‌పై పెట్టాల్సినంత దృష్టి పెట్టడం లేదని స్పష్టమవుతోంది. దీనికి టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే సిరీసే నిదర్శనం. అది కేవలం మూడు వన్డేల సిరీస్. అసలు అవసరం లేని ఈ సిరీస్‌ను ఎందుకు షెడ్యూల్ చేశారో అర్థం కాదు" అని స్టోక్స్ అన్నాడు.
"టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడుతున్న తీరు నాకు అసలు నచ్చడం లేదు. ఇప్పుడు వస్తున్న కొత్త ఫార్మాట్లు, ఫ్రాంఛైజీ కాంపిటీషన్లతో టెస్ట్ క్రికెట్ ఆకర్షణ కోల్పోతోంది. టెస్ట్ క్రికెట్ కాకుండా ప్లేయర్స్‌కు చాలా అవకాశాలు ఉన్నాయన్న విషయం తెలుసు. కానీ ఆటకు టెస్ట్ క్రికెట్ ఎంతో అవసరం" అని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు.
టెస్టులు ఎక్కువ కాలం పాటు ఆదరణ కోల్పోకుండా ఉండాలంటే మిగతా టీమ్స్ కూడా ఇంగ్లండ్‌లాగే ఆడాలని, ఫలితం కంటే వినోదం అందించడం ముఖ్యమని స్టోక్స్ అనడం గమనార్హం. "మన మైండ్‌సెట్ నుంచి ఫలితాన్ని పక్కన పెట్టడం అనేది గొప్ప ప్రారంభం. టెస్టుల్లో ప్రతి రోజును వినోదాత్మకంగా మార్చడంపై దృష్టి సారించాలి. అసలు ఏం జరుగుతుందో ఫ్యాన్స్ అంచనా వేయకుండా ఆడాలి. ఏం జరుగుతుందో అన్న ఉత్సుకతతో ఫ్యాన్స్ వస్తున్నారంటే ఆట ఆడకముందే మనం విజయం సాధించినట్లు అవుతుంది" అని స్టోక్స్ అన్నాడు.
టెస్ట్ క్రికెట్ ఆదరణ సంపాదించడానికి ఏదైనా భిన్నంగా చేయాలని ఐసీసీని స్టోక్స్ కోరాడు. తనకు టెస్ట్ క్రికెట్ ఆడటమంటే ఇష్టమని, ఏదైనా కాస్త భిన్నంగా చేయాలన్న ఆలోచన తనకు ఉందని చెప్పాడు. స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 10 టెస్టుల్లో 9 గెలవడం విశేషం. ఇక తరచూ ప్లేయర్స్‌కు విశ్రాంతి ఇస్తుండటంపై కూడా స్టోక్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌తోపాటు ఫ్రాంఛైజీ క్రికెట్ కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అతనన్నాడు.