Jofra Archer Returns: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జోఫ్రా ఆర్చర్ వచ్చేశాడు.. ఇంగ్లండ్ టీమ్‌లో చోటు
Jofra Archer Returns: చాలా రోజుల తర్వాత పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి వచ్చాడు. అతనికి సౌతాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం ఇంగ్లండ్ టీమ్‌లో చోటు కల్పించారు.
Jofra Archer Returns: ఇంగ్లండ్ పేస్ సెన్సేషన్ జోఫ్రా ఆర్చర్ తిరిగి టీమ్‌లోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో వచ్చే నెలలో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన 14 మంది సభ్యుల ఇంగ్లండ్ టీమ్‌లో ఆర్చర్‌కు చోటు కల్పించారు. అటు తొలిసారి హ్యారీ బ్రూక్‌కు కూడా వన్డే టీమ్‌లో చోటు దక్కింది. ఈ టీమ్‌ను గురువారం (డిసెంబర్ 22) ప్రకటించారు.
"జోఫ్రా ఆర్చర్ మోచేతి గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడు వచ్చే నెలలో సౌతాఫ్రికాతో సిరీస్‌తో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వస్తాడు" అని ఇంగ్లండ్ క్రికెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. జోఫ్రా ఆర్చర్ చివరిసారి 2021, మార్చిలో ఓ వన్డే మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచీ ఫిట్‌నెస్ సమస్యలతో ఆర్చర్ టీమ్‌కు దూరంగానే ఉంటున్నాడు. మోచేతి గాయం నుంచి పూర్తిగా కోలుకొని వచ్చే ఏడాది జూన్‌లో జరగబోయే యాషెస్‌కు అందుబాటులో ఉండాలని భావిస్తున్నాడు.
ఇక సౌతాఫ్రికా20 లీగ్‌లో ఆర్చర్‌ను కేప్‌టౌన్ ఇండియన్స్ కొనుగోలు చేసింది. అతడు వచ్చే నెలలో జరగబోయే తొలి సౌతాఫ్రికా20 లీగ్‌లో ఆడబోతున్నాడు. ఐపీఎల్‌లోనూ ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ వేలంలో దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో జరిగిన వేలంలో అతన్ని ముంబై కొనుగోలు చేసింది. 2022 సీజన్‌కు అందుబాటులో ఉండడని తెలిసి కూడా వచ్చే సీజన్ కోసం ముందుగానే భారీ ధర చెల్లించి ఆర్చర్‌ను దక్కించుకున్నారు.
తన స్పీడ్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తించే జోఫ్రా ఆర్చర్‌పై ఇంగ్లండ్ భారీ ఆశలే పెట్టుకుంది. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకూ జరగనుంది. ఈ సిరీస్ కోసం తొలి సౌతాఫ్రికా20 లీగ్ మధ్యలో కాస్త గ్యాప్ ఇవ్వడం విశేషం.
ఇంగ్లండ్ టీమ్ ఇదే: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, ఫిల్ సాల్ట్, ఓలీ స్టోన్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్