Ramiz Raja on ICC: ఇండియాను అనేంత దమ్ము ఐసీసీకి లేదు.. డబ్బంతా వాళ్ల నుంచే వస్తోంది కదా: రమీజ్ రాజా
Ramiz Raja on ICC: ఇండియాను అనేంత దమ్ము ఐసీసీకి లేదు.. డబ్బంతా వాళ్ల నుంచే వస్తోంది కదా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా. వచ్చే ఏడాది ఆసియాకప్ వేదికపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో రమీజ్ ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.
Ramiz Raja on ICC: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై తీవ్ర విమర్శలు చేశారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ రమీజ్ రాజా. ఐసీసీకి ఆదాయం మొత్తం ఇండియా నుంచే వస్తుందని, అందుకే ఐసీసీ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నదని ఆరోపించారు. వచ్చే ఏడాది ఆసియాకప్ వేదిక విషయంలో బీసీసీఐ, పీసీబీ మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రమీజ్ ఈ కామెంట్స్ చేశారు.
గత పదేళ్లుగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఆసియా కప్, ఐసీసీ ఈవెంట్లలోనే ఈ రెండు టీమ్స్ తలపడుతున్నాయి. ఈ దాయాదుల మధ్య సిరీస్ కోసం ఐసీసీ ఎలాంటి చొరవ తీసుకోవడం లేదని తరచూ రమీజ్ రాజా విమర్శిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో అడుగు ముందుకు వేసి తీవ్ర ఆరోపణలు చేశారు.
"వాళ్లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఈ విషయంలో ముందడుగు వేయడం లేదు. ఎందుకంటే ఐసీసీ ఆదాయం మొత్తం ఇండియా నుంచే వస్తోంది. ఫలితంగా ఐసీసీ ఏం చేయలేకపోతోంది. ప్రతి క్రికెట్ బోర్డు కదిలి, నిబద్ధతతో దీనికో పరిష్కారం చూపే వరకూ ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని అనుకోవడం లేదు" అని రమీజ్ రాజా అన్నారు.
2008లో చివరిసారి ఆసియాకప్ కోసం పాకిస్థాన్ వెళ్లిన టీమిండియా.. ఇప్పటి వరకూ మళ్లీ అక్కడ అడుగుపెట్టలేదు. అయితే వచ్చే ఏడాది ఆసియాకప్‌ను పాకిస్థానే నిర్వహించనుంది. దీంతో ఈ టోర్నీలో ఆడేందుకు ఇండియా అక్కడికి వెళ్తుందా లేదా అన్న చర్చ జరిగింది. దీనిపై స్పందించిన బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ జై షా.. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ వెళ్లే ప్రసక్తే లేదని, ఆసియా కప్ వేదికను మారుస్తామని చెప్పారు.
దీనిపై పాక్ బోర్డు ఛైర్మన్ రమీజ్ తీవ్రంగా స్పందించారు. అలా చేస్తే తాము ఇండియాలో జరిగే వన్డే వరల్డ్‌కప్ నుంచి తప్పుకుంటామనీ హెచ్చరించారు. "ప్రతి టీమ్ మరొకరితో ఆడాలి. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ చూడాలని అనుకోని వారు ఎవరుంటారు? ఇండియాలో ఆడటానికి పాకిస్థాన్, పాకిస్థాన్‌లో ఆడటానికి ఇండియా ఎలాంటి సాకులు చెప్పకూడదు" అని రమీజ్ స్పష్టం చేశారు.