Ramiz Raja on Ind vs Pak: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్‌కు.. అమెరికా, ఇరాన్ ఫుట్‌బాల్‌కు లింకు పెట్టిన రమీజ్ రాజా
Ramiz Raja on Ind vs Pak: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్‌కు.. అమెరికా, ఇరాన్ ఫుట్‌బాల్‌కు లింకు పెట్టారు పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా. వచ్చే ఏడాది ఇండియాలో జరగబోయే వరల్డ్‌కప్ నుంచి పాకిస్థాన్ తప్పుకుంటుందన్న వార్తల నేపథ్యంలో రమీజ్ దీనిపై స్పందించారు.
Ramiz Raja on Ind vs Pak: క్రికెట్‌లో ప్రస్తుతం బీసీసీఐ, పాక్ క్రికెట్ బోర్డు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలుసు కదా. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్‌ను మరో చోటికి తరలించే ఆలోచనలో ఉన్నట్లు బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా చెప్పడం ఈ వివాదానికి కారణమైంది. అలా చేస్తే ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్‌కప్ నుంచి పాకిస్థాన్ తప్పుకుంటుందని ఆ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా హెచ్చరించారు. అయితే అలా చేస్తే ఐసీసీ నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఇబ్బందులు తప్పవు.
తాజాగా బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్ షోలో రమీజ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ ప్రశ్న అడగగా.. రమీజ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. "సెక్యూరిటీ సమస్యను సాకుగా చూపుతూ పాకిస్థాన్ టీమ్‌ను అక్కడి ప్రభుత్వం ఇండియాకు పంపించడానికి నిరాకరిస్తే ఏం జరుగుతుంది?" అని రమీజ్‌ను ప్రశ్నించారు.
దీనికి రమీజ్ స్పందిస్తూ.. "ఇది చాలా ఎమోషనల్ సబ్జెక్ట్. నిజానికి ఒక రకంగా దీనిని బీసీసీఐ మొదలుపెట్టింది. మేము దీనిపై స్పందించాల్సి వచ్చింది. టెస్ట్ క్రికెట్‌కు ఇండియా vs పాకిస్థాన్ అవసరం ఎంతైనా ఉంది" అని రమీజ్ స్పష్టం చేశారు.
రెండు దేశాల మధ్య ఉన్న వైరాన్ని క్రికెట్‌తో ముడిపెట్టవద్దని, ఆసియా కప్ కోసం వచ్చే ఏడాది పాకిస్థాన్‌కు రావాలని రమీజ్ కోరారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇరాన్‌తో అమెరికా ఆడటాన్ని ప్రస్తావించారు.
"టీ20 వరల్డ్‌కప్‌లో ఏం జరిగిందో మనం చూశాం. ఎంసీజీలో 90 వేల మంది మ్యాచ్ చూడటానికి వచ్చారు. ఐసీసీ వ్యవహారం నాకు కాస్త అసంతృప్తి కలిగించింది. మహిళల హక్కుల విషయంలో ఇరాన్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయి అయినా ఇరాన్‌తో అమెరికా ఎందుకు ఆడుతుంది అని ఫిఫా అధ్యక్షుడిని ప్రశ్నిస్తే.. ఆయన ఫుట్‌బాల్‌ను చేతుల్లోకి తీసుకుంటూ ఇది చాలా సమస్యలను పరిష్కరిస్తుంది అని సమాధానమిచ్చారు. స్పోర్ట్స్ ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అందుకే బ్యాట్, బాల్‌నే మాట్లాడనివ్వండి" అని రమీజ్ అనడం గమనార్హం.