Pak vs Eng 1st test: తొలి టెస్ట్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
Pak vs Eng 1st test: తొలి టెస్ట్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది ఇంగ్లండ్. చివరి రోజు మూడో సెషన్ వరకూ ఎంతో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో చివరికి ఇంగ్లండ్ 74 రన్స్ తేడాతో విజయం సాధించింది.
Pak vs Eng 1st test: టెస్ట్ మ్యాచ్‌లోని అసలు సిసలు మజాను రుచి చూపించింది పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్. రావల్పిండిలోని పూర్తి బ్యాటింగ్ పిచ్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 74 రన్స్ తేడాతో ఎవరూ ఊహించని విజయం సాధించింది. పాకిస్థాన్ గడ్డపై ఇంగ్లండ్ ఓ టెస్ట్ మ్యాచ్‌లో గెలవడం ఇది కేవలం మూడోసారి మాత్రమే.
343 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 268 రన్స్‌కు ఆలౌటైంది. ఒక దశలో పాక్ టార్గెట్ దిశగా దూసుకెళ్లి ఇంగ్లండ్‌ను భయపెట్టింది. ఇమాముల్ హక్ (48), అజర్ అలీ (40), సాద్ షకీల్ (76), మహ్మద్ రిజ్వాన్ (46), అఘా సల్మాన్ (30)లాంటి వాళ్లు పోరాడినా ఫలితం లేకపోయింది. పాకిస్థాన్ చివరి జోడీ నసీమ్ షా, మహ్మద్ అలీ పదో వికెట్ పడకుండా చాలాసేపు అడ్డుకున్నారు.
8.5 ఓవర్ల పాటు పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించడానికి ప్రయత్నించారు. ఓవైపు ఓవర్లు కరిగిపోతుండటంతో ఇంగ్లండ్ అన్ని విధాలుగా చివరి వికెట్ తీయడానికి ప్రయత్నించింది. చివరికి స్పిన్నర్ లీచ్.. నసీమ్ షా (6)ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయడంతో ఇంగ్లండ్ గెలుపు సంబరాలు చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 579 రన్స్ చేసింది. ఇంత భారీ స్కోరు చేసినా.. ఆ టీమ్ ఓడిపోవడం ఇదే తొలిసారి.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 657 రన్స్ చేసిన విషయం తెలిసిందే. 78 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతోపాటు రెండో ఇన్నింగ్స్‌ను 7 వికెట్లకు 264 రన్స్ దగ్గర డిక్లేర్ చేసి పాకిస్థాన్‌కు సవాలు విసిరింది. ఫ్లాట్ వికెట్ కావడంతో చివరి ఇన్నింగ్స్‌లోనూ పాకిస్థాన్ ఆ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. అయితే కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ పాక్‌పై ఒత్తిడి పెంచిన ఇంగ్లండ్.. చివరికి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది.
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లు ఓలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్ నాలుగేసి వికెట్లు తీసుకున్నారు. రావల్పిండిలాంటి బ్యాటింగ్ పిచ్‌పై 20 వికెట్లు తీసి మ్యాచ్‌ను గెలిపించడం ఇంగ్లండ్ బౌలర్లకే చెల్లింది. అయితే ఈ మ్యాచ్ మలుపులు తిరుగుతూ.. చివరి సెషన్‌లో ఇలాంటి ఫలితం ఇవ్వడం ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచింది.