BCCI Future Plan in T20Is: టీ20లకు సీనియర్ ప్లేయర్లు రిటైర్మెంట్ చెబుతారా? బీసీసీఐ ప్రణాళిక ఏంటి?
BCCI Future Plan in T20Is: వచ్చే ఏడాది నుంచి సీనియర్ ప్లేయర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి వారిని చూసే అవకాశం ఉండకపోవచ్చు. బీసీసీఐ వర్గాల సమచారం ప్రకారం ఎక్కువ మంది సీనియర్ ఆటగాళ్లు టీ20లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
BCCI Future Plan in T20Is: ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిదే. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా జట్టు కూర్పుపై అసంతృప్తి వ్యక్తమయ్యాయి. ఈ ఓటమితో సీనియర్ ఆటగాళ్లయిన రోహిత్, విరాట్ కోహ్లీ తదితరులను టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తారా? అనే ప్రశ్నకు కోచ్ ద్రవిడ్ సైతం ఇప్పుడే చెబితే తొందరపాటే అవుతుందని సమాధానమిచ్చారు. అయితే తాజా నివేదికలను చూస్తుంటే త్వరలోనే రోహిత్ శర్మ, విరాట్, అశ్విన్ లాంటి సీనియర్ ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
బీసీసీఐ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం 2024 టీ20 ప్రపంచకప్ సమయానికి సరికొత్త జట్టును సిద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకునే హార్దిక్ పాండ్యాను టీ20లకు కెప్టెన్‌గా చేయాలని నిర్ణయించారట.
"బీసీసీఐ ఎవ్వరినీ రిటైర్మెంట్ అవ్వమని బలవంతం చేయదు. అది వ్యక్తిగత నిర్ణయం. కానీ 2023లో టీ20ల్లో సరికొత్తగా ముందుకు వెళ్లనున్నాం. సీనియర్ ఆటగాళ్లను వన్డేలు, టెస్టులకే పరిమితం కానున్నారు. ఆటగాళ్లు వద్దనుకుంటే రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కువ మంది సీనియర్ ప్లేయర్లను వచ్చే ఏడాది నుంచి టీ20ల్లో మాత్రం చూడలేరు." అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ప్రస్తుతం టీమిండియా దృష్టి వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ 50 ఓవర్ల ప్రపంచకప్‌పైనే పెట్టింది. భారత్ క్యాలెండర్ ప్రకారం ఈ టోర్నీ కంటే ముందు టీమిండియా 25 వన్డేలు, 12 టీ20లు ఆడనుంది. ఇందులో ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ న్యూజిలాండ్‌తో జరుగుతోంది.
సంబంధిత కథనం