ICC on Rawalpindi pitch: పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఐసీసీ.. రావల్పిండి పిచ్‌పై సీరియస్‌-icc on rawalpindi pitch says it is below average and gave a demerit point ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Icc On Rawalpindi Pitch: పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఐసీసీ.. రావల్పిండి పిచ్‌పై సీరియస్‌

ICC on Rawalpindi pitch: పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఐసీసీ.. రావల్పిండి పిచ్‌పై సీరియస్‌

Hari Prasad S HT Telugu
Dec 13, 2022 02:11 PM IST

ICC on Rawalpindi pitch: పాకిస్థాన్‌కు షాకిచ్చింది ఐసీసీ. రావల్పిండి పిచ్‌పై సీరియస్‌ అయింది. ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ మధ్య తొలి టెస్ట్‌కు ఆతిథ్యమిచ్చిన ఈ పిచ్‌పై ఎన్నో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్
రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్ (AFP)

ICC on Rawalpindi pitch: పాకిస్థాన్‌లోని రావల్పిండి క్రికెట్‌ స్టేడియం డేంజర్‌లో పడింది. ఇక్కడ మరో అంతర్జాతీయ మ్యాచ్‌ నిర్వహించకుండా సస్పెండ్‌ చేసే ప్రమాదం కనిపిస్తోంది. పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్ట్‌కు ఆతిథ్యమిచ్చిన ఈ స్టేడియం పిచ్‌ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించడంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ పిచ్‌కు సగటు కంటే తక్కువ రేటింగ్‌ ఇచ్చింది. ఈ పిచ్‌కు వరుసగా రెండోసారి ఈ రేటింగ్‌ దక్కింది. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా బ్యాటింగ్‌కు అనుకూలించిన ఈ పిచ్‌కు సగటు కంటే తక్కువ రేటింగ్ ఇచ్చింది. తాజాగా మరో రెండు డీమెరిట్‌ పాయింట్లు ఈ స్టేడియం ఖాతాలో చేరాయి. దీనికి మరొక్కసారి డీమెరిట్‌ పాయింట్స్ వస్తే చాలు.. 12 నెలల పాటు ఇక్కడ మరో మ్యాచ్‌ నిర్వహించకుండా సస్పెండ్‌ చేస్తారు.

"రెండు వరుస టెస్ట్‌ల ద్వారా ఈ వేదిక రెండు డీమెరిట్‌ పాయింట్లు పొందింది. ఐసీసీ పిచ్‌ అండ్‌ ఔట్‌ఫీల్డ్‌ మానిటరింగ్‌ ప్రాసెస్‌ ద్వారా ఈ డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చాం. ఈ స్టేడియం మరోసారి డీమెరిట్‌ పాయింట్లు పొందితే అంత్జాతీయ మ్యాచ్‌ నిర్వహించే అవకాశం కోల్పోతుంది. ఐదేళ్ల పాటు ఈ డీమెరిట్‌ పాయింట్లు అలాగే ఉంటాయి. ఈ ఐదేళ్ల కాలంలో ఓ వేదిక ఐదు డీమెరిట్ పాయింట్లు పొందితే 12 నెలల పాటు మరో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించే అవకాశం కోల్పోతుంది" అని ఐసీసీ తన ప్రకటనలో వెల్లడించింది.

ఈ రావల్పిండిలో జరిగిన తొలి టెస్ట్‌ చివరి రోజు ఇంగ్లండ్‌ 74 రన్స్‌ తేడాతో విజయం సాధించింది. అన్ని రంగాల్లోనూ పాకిస్థాన్‌ను డామినేట్‌ చేయడంతోపాటు కీలకమైన సమయంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఫలితం రాబట్టింది. అయితే ఈ పిచ్‌ చాలా ఫ్లాట్‌గా ఉన్నదని, ఏ రకమైన బౌలర్‌కు కూడా ఎలాంటి సహకారం అందించలేదని మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ తన రిపోర్ట్‌లో వెల్లడించాడు.

ఈ కారణంగా రెండు జట్లు బ్యాటర్లు చాలా వేగంగా పరుగులు సాధించారని, రెండు టీమ్స్‌ భారీ స్కోర్లు చేశాయని చెప్పాడు. మ్యాచ్‌ కొనసాగుతున్నా కూడా పిచ్‌ అసలు క్షీణించలేదని, అందుకే ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం ఈ పిచ్‌కు సగటు కంటే తక్కువ రేటింగ్‌ ఇస్తున్నట్లు పైక్రాఫ్ట్‌ స్పష్టం చేశాడు.

WhatsApp channel