Marnus Labuschagne Test Record: ఆస్ట్రేలియా బ్యాటర్‌ లబుషేన్‌ రికార్డు.. బ్రాడ్‌మన్‌ తర్వాత అతడే-marnus labuschagne test record as he became joint fastest to 3000 test runs after bradman ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Marnus Labuschagne Test Record: ఆస్ట్రేలియా బ్యాటర్‌ లబుషేన్‌ రికార్డు.. బ్రాడ్‌మన్‌ తర్వాత అతడే

Marnus Labuschagne Test Record: ఆస్ట్రేలియా బ్యాటర్‌ లబుషేన్‌ రికార్డు.. బ్రాడ్‌మన్‌ తర్వాత అతడే

Hari Prasad S HT Telugu
Dec 09, 2022 12:57 PM IST

Marnus Labuschagne Test Record: ఆస్ట్రేలియా బ్యాటర్‌ లబుషేన్‌ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో బ్రాడ్‌మన్‌ తర్వాత అత్యంత వేగంగా 3 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

మార్నస్ లబుషేన్
మార్నస్ లబుషేన్ (AP)

Marnus Labuschagne Test Record: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. టెస్టుల్లో టాప్‌ ఫామ్‌లో ఉన్న లబుషేన్‌.. ఈ డేనైట్‌ టెస్ట్‌లో 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు.

ఈ క్రమంలో వెస్టిండీస్‌ గ్రేట్‌ ఎవర్టన్‌ వీక్స్‌ సరసన నిలిచాడు. లబుషేన్‌ తన 30వ టెస్ట్‌ 51వ ఇన్నింగ్స్‌లో 3 వేల రన్స్‌ మైల్‌స్టోన్‌ను అందుకున్నాడు. ఎవర్టన్‌ వీక్స్‌ కూడా 51వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు. అయితే బ్రాడ్‌మన్‌ మాత్రం 33వ ఇన్నింగ్స్‌లోనే 3 వేల రన్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. వెస్టిండీస్‌తో డేనైట్‌ టెస్ట్‌కు ముందు లబుషేన్ ఈ రికార్డుకు 153 పరుగుల దూరంలో ఉన్నాడు.

అయితే తొలి ఇన్నింగ్స్‌లో అతడు 163 రన్స్‌ చేసి ఈ రికార్డును అందుకున్నాడు. అడిలైడ్‌లో జరుగుతున్న ఈ డేనైట్‌ టెస్ట్‌లో లబుషేన్‌తోపాటు మరో బ్యాటర్‌ ట్రెవిస్‌ హెడ్‌ కూడా 175 రన్స్‌ చేశాడు. లబుషేన్‌ ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా తరఫున 30 టెస్టులు ఆడి 3010 రన్స్‌ చేశాడు. అందులో 10 సెంచరీలు, 13 హాఫ్‌ సెంచరీలు ఉండటం విశేషం.

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో రోజు ఈ మూడు వేల పరుగుల రికార్డును లబుషేన్‌ అందుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా లెజెండరీ ప్లేయర్స్‌ నీల్ హార్వీ (54 ఇన్నింగ్స్‌), మాథ్యూ హేడెన్‌ (61), గిల్‌క్రిస్ట్‌, మైక్‌ హస్సీ, స్టీవ్‌ స్మిత్‌ (అందరూ 63 ఇన్నింగ్స్‌)లను మించిపోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటి వరకూ ఈ రెండు టెస్ట్‌ల సిరీస్‌లో లబుషేన్‌ మొత్తం 471 రన్స్‌ చేశాడు. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో అతడు మరోసారి బ్యాటింగ్ చేస్తే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో అత్యధిక రన్స్‌ చేసిన ఆస్ట్రేలియన్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ ఈ రికార్డు మాథ్యూ హేడెన్‌ పేరిట ఉంది. అతడు 2003-04 సిరీస్‌లో జింబాబ్వేపై 501 రన్స్‌ చేశాడు. ఇక 2019-20లో పాకిస్థాన్‌పై వార్నర్‌ 489 రన్స్‌ చేశాడు.

Whats_app_banner