Team India Records: భారత్ గడ్డపై 24 ఏళ్ల తర్వాత మళ్లీ టీమిండియాకి వైట్‌వాష్ గండం.. కనీసం పరువైనా దక్కేనా?
IND vs NZ 3rd Test: భారత్ గడ్డపై పరువు కోసం టీమిండియా పాకులాడుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయి.. వైట్ వాష్ ముంగిట నిల్చొంది. ఒకవేళ ఆఖరి టెస్టులో కూడా ఓడిపోతే..?
భారత్ గడ్డపై చాలా ఏళ్ల తర్వాత టెస్టుల్లో టీమిండియా ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. న్యూజిలాండ్‌తో వరుసగా బెంగళూరు, పుణె టెస్టులో ఓడిపోయిన భారత్ జట్టు.. మూడు టెస్టుల సిరీస్‌ని 0-2తో చేజార్చుకుంది. ఇక మిగిలిన ఆఖరి టెస్టు మ్యాచ్ నవంబరు 1 నుంచి ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోతే? సొంతగడ్డపై టీమిండియా పరువు గంగపాలే!
రెండు వారాల వ్యవధిలో మారిన సీన్
బెంగళూరు టెస్టులో కేవలం 46 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటై ఇప్పటికే నవ్వులపాలైన భారత్ టెస్టు జట్టు.. పుణె టెస్టులోనూ చేతులెత్తేసి సిరీస్‌ను చేజార్చుకుంది. కనీసం నామమాత్రమైన ఆఖరి టెస్టులోనైనా గెలవలేకపోలే 24 ఏళ్ల తర్వాత వైట్‌వాష్ చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
వాస్తవానికి గత 69 ఏళ్లుగా భారత్ గడ్డపై టెస్టులు ఆడుతున్న న్యూజిలాండ్ టీమ్ ఇప్పటి వరకు గెలిచింది 4 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే. ఇందులో రెండు మ్యాచ్‌లను దాదాపు 36 ఏళ్ల తర్వాత.. అది కూడా 15 రోజుల వ్యవధిలోనే గెలవడం గమనార్హం.
లాస్ట్ వైట్ వాష్ ఎప్పుడంటే?
భారత్ గడ్డపై టీమిండియా టెస్టుల్లో చివరిగా 2000 సంవత్సరంలో వైట్‌వాష్‌ను చవిచూసింది. అప్పట్లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని భారత్ జట్టు 0-2తో దక్షిణాఫ్రికాకి సిరీస్‌ను చేజార్చుకుంది. తొలి టెస్టులో సచిన్ టెండూల్కర్ 97 పరుగులు, రెండో టెస్టులో మహ్మద్ అజహరుద్దీన్ సెంచరీ చేసినా మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించలేకపోయారు. అయితే.. ఆ వైట్‌వాష్ తర్వాత ఈ 24 ఏళ్లలో టీమిండియా ఈ గండం రాలేదు. కానీ ఇప్పుడు న్యూజిలాండ్ రూపంలో పొంచి ఉంది.
భారత్ గడ్డపై చేజారిన సిరీస్‌లు
భారత్ గడ్డపై ఇప్పటి వరకు 17 సార్లు మాత్రమే టీమిండియా టెస్టు సిరీస్‌ను చేజార్చుకుంది. 1933లో తొలిసారి ఇంగ్లాండ్‌కి టెస్టు సిరీస్‌ను చేజార్చుకున్న భారత్.. ఆ తర్వాత ఆ దేశానికే మరో 4 సార్లు, వెస్టిండీస్‌కి ఐదు సార్లు, ఆస్ట్రేలియాకి 4 సార్లు, పాకిస్థాన్, దక్షిణాఫ్రికాకి ఒక్కోసారి టెస్టు సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ ఏడాది న్యూజిలాండ్‌కి చేజార్చుకుంది
ఇంగ్లాండ్‌కి 2012-13లో ఆఖరిగా భారత్ గడ్డపై టెస్టు సిరీస్‌ను చేజార్చుకున్న భారత్ జట్టు..ఆ తర్వాత ఈ 12 ఏళ్లలో వరుసగా 18 టెస్టు సిరీస్ గెలిచింది. కానీ.. న్యూజిలాండ్‌తో తాజాగా టెస్టు సిరీస్‌ను చేజార్చుకోవడంతో ఆ జైత్రయాత్రకి బ్రేక్ పడింది. ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత వైట్‌వాష్ గండం వెంటాడుతోంది. మరి వాంఖడేలో ఏం చేస్తుందో చూడాలి.