IND vs NZ Test Series: న్యూజిలాండ్‌కి ఉచ్చుని బిగిస్తున్న టీమిండియా, పుణె టెస్టు కోసం మాస్టర్ ప్లాన్ తెరపైకి!-spinning track expected in pune test as india look to level series vs new zealand ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Nz Test Series: న్యూజిలాండ్‌కి ఉచ్చుని బిగిస్తున్న టీమిండియా, పుణె టెస్టు కోసం మాస్టర్ ప్లాన్ తెరపైకి!

IND vs NZ Test Series: న్యూజిలాండ్‌కి ఉచ్చుని బిగిస్తున్న టీమిండియా, పుణె టెస్టు కోసం మాస్టర్ ప్లాన్ తెరపైకి!

Galeti Rajendra HT Telugu

IND vs NZ Pune Test: బెంగళూరు టెస్టులో ప్రయోగానికి వెళ్లి బోల్తాకొట్టిన భారత్ జట్టు, పుణె టెస్టులో జాగ్రత్తపడుతోంది. టీమిండియా ప్లాన్‌ను పసిగట్టిన న్యూజిలాండ్ కూడా కౌంటర్‌కి ప్రిపేర్ అవుతోంది.

గురువారం నుంచి పుణె టెస్టు (AP)

న్యూజిలాండ్ చేతిలో తొలి టెస్టులో ఓడిపోయిన భారత్ జట్టు ఎలాగైనా రెండో టెస్టులో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. బెంగళూరు వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి టెస్టులో భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో పేలవంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.

రెండో టెస్టు మ్యాచ్ పుణె వేదికగా గురువాం (అక్టోబరు 24) నుంచి స్టార్ట్‌కానుంది. ఈ నేపథ్యంలో భారత్ జట్టు మేనేజ్‌మెంట్ ఓ మాస్టర్‌ప్లాన్‌ను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే పుణెకి చేరుకున్న భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.

వాస్తవానికి బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ టీమ్‌ను భారత్ జట్టు తక్కువ అంచనా వేసి బోల్తా కొట్టింది. తొలి టెస్టుకి ముందు శ్రీలంకతో సిరీస్‌లో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్.. అంతకముందు ఆస్ట్రేలియా చేతిలోనూ చిత్తయ్యింది. మరోవైపు భారత్ జట్టు బంగ్లాదేశ్‌పై రెండు టెస్టుల్లో తిరుగులేని విజయాలతో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా అతి విశ్వాసం కొంపముంచి ఘోర అవమానాన్ని చవిచూసింది.

బెడిసికొట్టిన పిచ్ ప్రయోగం

భారత్ జట్టు ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనుంది. అక్కడ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుండటంతో.. పేస్ పిచ్‌లకి భారత్ ఆటగాళ్లు అలవాటుపడేలా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బలవంతంగా బెంగళూరు పిచ్‌ను సిద్ధం చేయించాడు. సాధారణంగా బెంగళూరు పిచ్ స్పిన్‌కి అనుకూలం. కానీ మొన్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. దానికి తోడు వర్షం పరిస్థితులు న్యూజిలాండ్‌ బౌలర్లకి స్వర్గధామంగా మారడంతో.. భారత్ జట్టుని కేవలం 46 పరుగులకే కుప్పకూల్చేశారు.

ఆత్మరక్షణలో పడిన టీమిండియా

భారత్ జట్టు తొలి టెస్టులో ఓడిపోవడంతో ఇప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్ ఆత్మరక్షణలో పడిపోయింది. పుణె టెస్టులో ఒకవేళ ఓడిపోతే సిరీస్ చేజారడంతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించే అవకాశాలకీ దెబ్బపడనుంది. దాంతో స్పిన్‌కి సహకరించే పుణె పిచ్‌ను మార్చకుండా సహజ సిద్ధంగా ఉంచేయాలని క్యూరేటర్‌కి చెప్పినట్లు తెలుస్తోంది. భారత్ జట్టులో ఇప్పటికే రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ ఉండటంతో.. స్పిన్ ట్రాక్‌లపై ఈ స్పిన్ త్రయాన్ని ఎదుర్కోవడం కివీస్ బ్యాటర్లకి కత్తిమీ సామే.

పుణె పిచ్ పరిస్థితి ఏంటి?

సాధారణంగా పుణె పిచ్‌ నుంచి మొదటి రెండు రోజులు తొలి సెషన్‌లో ఫాస్ట్ బౌలర్లకి సహకారం లభిస్తుంది. కానీ.. ఆ తర్వాత రెండు సెషన్లు బంతి తిరుగుతుంది. అయితే.. మూడో రోజు నుంచి మాత్రం బంతి గింగిరాలు మొదలవుతుంది. ఇక ఐదో రోజుకి వచ్చే సరికి బంతి గమనాన్ని అంచనా వేయడం బ్యాటర్లకి ఛాలెంజ్ అవుతుంది. సరదాగా చెప్పాలంటే.. క్రీజులో బ్యాటర్‌ని స్పిన్నర్లు డ్యాన్స్ వేయిస్తుంటారు.

ఛాలెంజ్‌కి రెడీ అంటున్న న్యూజిలాండ్

తొలి టెస్టులో ఓటమి తర్వాత స్పిన్‌ పిచ్‌తో తమకి భారత్ ఛాలెంజ్ విసురుతుందని తాము ఊహిస్తున్నట్లు న్యూజిలాండ్ సీనియర్ ప్లేయర్ డార్లీ మిచెల్ చెప్పుకొచ్చాడు. పిచ్‌కి తగినట్లుగా తాము వ్యూహాలు మార్చుకుంటూ పరిస్థితులకి అనుకూలంగా సర్దుబాట్లు చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.