IND vs NZ 2nd Test Highlights: భారత్ గడ్డపై టీమిండియాకి ఘోర పరాభవం, 69 ఏళ్లలో ఫస్ట్ టైమ్ సిరీస్ గెలిచిన న్యూజిలాండ్-new zealand make history win first ever cricket test series in india ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Nz 2nd Test Highlights: భారత్ గడ్డపై టీమిండియాకి ఘోర పరాభవం, 69 ఏళ్లలో ఫస్ట్ టైమ్ సిరీస్ గెలిచిన న్యూజిలాండ్

IND vs NZ 2nd Test Highlights: భారత్ గడ్డపై టీమిండియాకి ఘోర పరాభవం, 69 ఏళ్లలో ఫస్ట్ టైమ్ సిరీస్ గెలిచిన న్యూజిలాండ్

Galeti Rajendra HT Telugu
Oct 26, 2024 04:07 PM IST

IND vs NZ 2nd Test Match Result: భారత్ గడ్డపై టెస్టుల్లో గత 12 ఏళ్లుగా సాగిన టీమిండియా జైత్రయాత్రకి ఈరోజు తెరపడింది. ఆరు దశాబ్దాలుగా భారత్‌లో టెస్టు సిరీస్ గెలుపు కోసం నిరీక్షిస్తున్న న్యూజిలాండ్ ఎట్టకేలకి తన కలని సాకారం చేసుకుంది.

పుణె టెస్టులో ఓడిన భారత్
పుణె టెస్టులో ఓడిన భారత్ (AP)

భారత్ జట్టు టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి సొంతగడ్డపై అత్యంత చెత్త ప్రదర్శనతో పర్యాటక జట్టు ముందు అవమానకరంగా తలొంచింది. పుణె వేదికగా శనివారం ముగిసిన రెండో టెస్టులో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో తేలిపోయిన టీమిండియా 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో చిత్తయ్యింది. 
 

చరిత్రలో తొలిసారి

ఈ పుణె టెస్టు విజయంతో ఒక టెస్టు మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ని చేజిక్కించుకున్న కివీస్.. భారత్ గడ్డపై 69 ఏళ్ల టెస్టు సిరీస్ కలని నెరవేర్చుకుంది. 1955-56 నుంచి భారత్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ ఇలా టెస్టు సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. ఇక సిరీస్‌లో మిగిలిన ఆఖరి టెస్టు మ్యాచ్ ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా నవంబరు 1 నుంచి జరగనుంది.

మ్యాచ్‌లో మూడో రోజైన శనివారం 359 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టు ఆరంభం నుంచి తడబడుతూ ఓటమి దిశగా పయనించింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (77: 65 బంతుల్లో 9x4, 3x6) ఒక ఎండ్‌లో నిలకడగా ఆడినా.. అతనికి సపోర్ట్ ఇచ్చేవారు టీమ్‌లో కరవయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ (8), శుభమన్ గిల్ (23), విరాట్ కోహ్లీ (17)తో పాటు రిషబ్ పంత్ (0) తక్కువ స్కోరుకే ఔటైపోవడంతో భారత్ ఓటమి ఖాయమైపోయింది.

జడేజా ఒంటరి పోరాటం

బెంగళూరు టెస్టులో సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్ ఈరోజు 9 పరుగులకే ఔటైపోగా.. వాషింగ్టన్ సుందర్ 47 బంతులాడినా పేలవ షాట్ ఆడి 21 పరుగుల వద్ద వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో 167/7తో నిలిచిన భారత్ జట్టు పరువు నిలిపేందుకు రవీంద్ర జడేజా (42: 84 బంతుల్లో 2x4), రవిచంద్రన్ అశ్విన్ (18: 34 బంతుల్లో 2x4) చాలా ప్రయత్నించారు. 

కానీ.. న్యూజిలాండ్ బౌలర్లు పట్టువీడలేదు. క్రమశిక్షణతో బౌలింగ్‌లో చేసి భారత్‌ మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చే అవకాశం ఇవ్వలేదు.  దాంతో భారత్ జట్టు ఛేదనలో 245 పరుగులకే ఆలౌటైంది. ఆఖర్లో ఆకాశ్ (1) నిరాశపరిచినా.. జస్‌ప్రీత్ బుమ్రా (10 నాటౌట్)  ఒక ఫోర్, సిక్స్‌తో అభిమానుల్ని అలరించాడు. 

2012-13 తర్వాత భారత్ జట్టు సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను ఇలా చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఆ 12 ఏళ్లలో భారత్ జట్టు వరుసగా 18 టెస్టు సిరీస్‌లను గెలిచింది. 

మ్యాచ్‌లో టీమ్ స్కోర్లు ఇలా

ఓవరాల్‌గా మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసింది. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన భారత్ జట్టు 156 పరుగులకే ఆలౌటవడంతో.. కివీస్‌కి 103 పరుగుల ఆధిక్యం లభించింది. 

అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 103 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ఓవరాల్‌గా 359 పరుగుల టార్గెట్‌ని నిలిపింది. అయితే.. మ్యాచ్‌లో ఇంకా రెండన్నర రోజుల ఆట మిగిలి ఉన్నా.. టీమిండియా 245 పరుగులకే చేతులెత్తేసింది.

Whats_app_banner