IND vs NZ 2nd Test Live: పుణె టెస్టులో భారత్ ఎక్కడ తప్పు చేసిందో చెప్పిన బౌలింగ్ కోచ్, ఇక మిగిలింది ఒకటే దారి!
India vs New Zealand 2nd Test Updates: భారత్ జట్టు గత 12 ఏళ్లుగా సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ని చేజార్చుకోలేదు. కానీ.. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి పర్యాటక జట్టుకి సిరీస్‌ను చేజార్చుకునే పరిస్థితి వచ్చింది. ఒకవేళ న్యూజిలాండ్‌కి సిరీస్‌ను చేజార్చుకుంటే సొంతగడ్డపై టీమిండియాకి ఇంతకంటే అవమానం ఉండదు.
న్యూజిలాండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జట్టు ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉంది. మ్యాచ్‌లో కేవలం 2 రోజుల ఆట మాత్రమే ముగియగా.. ఇప్పటికే పర్యాటక జట్టుకి ఏకంగా 301 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకుంది. ఈ స్థితిలో భారత్ జట్టు ఓటమిని తప్పించుకోవాలంటే అసాధారణమైన ప్రదర్శన కనబర్చాలి. లేదంటే 2012-13 తర్వాత తొలిసారి భారత్ గడ్డపై టెస్టు సిరీస్‌ని టీమిండియా చేజార్చుకునే దుస్థితి.
తొలి ఇన్నింగ్స్‌లో బలహీనత
న్యూజిలాండ్‌తో ఈ టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా పరుగులు చేయకపోవడం తీవ్రంగా నష్టపరుస్తోందని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అంగీకరించాడు. ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైన భారత్ జట్టు.. పుణెలో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌటైంది. దాంతో పర్యాటక న్యూజిలాండ్‌కి భారీ ఆధిక్యం దక్కుతోంది.
పుణె టెస్టులో శుక్రవారం ఆట అనంతరం మోర్కెల్ మీడియాతో మాట్లాడుతూ ‘‘బ్యాటర్, బౌలర్ల మధ్య పోటీని నేనెప్పుడూ ఇష్టపడను. కానీ టెస్టు క్రికెట్‌లో మాత్రం గెలవాలంటే తొలి ఇన్నింగ్స్‌లో జట్టు తగినన్ని పరుగులు చేయాలి’’ అని అభిప్రాయపడ్డాడు.
భారత్ ఆటగాళ్లకి తెలుసు
‘‘వాస్తవానికి సొంతగడ్డపై టెస్టుల్లో పర్యాటక జట్టుపై మేం ఆధిపత్యం చెలాయిస్తే మంచిదే. కానీ మేం ఆ పని చేయలేకపోయాం. మా బ్యాటింగ్ లైనప్‌లో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. వ్యక్తిగతంగా వారు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు. ఒకవేళ విఫలమైనా మళ్లీ ఎలా పుంజుకోవాలో కూడా వారికి అవగాహన ఉంది. కానీ పుణె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యారు’’ అని మోర్నీ మోర్కెల్ ఒప్పుకున్నాడు.
ఎక్కడ తప్పు చేశారంటే?
‘‘పుణె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు స్ట్రైక్ రొటేట్ చేయడం విఫలమయ్యారు. అయితే ఆ తప్పులను రెండో ఇన్నింగ్స్‌లో సరిదిద్దుకోగలమని ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఓటమిని తప్పించుకోవాలంటే బలంగా పుంజుకోవడం తప్ప వేరే మార్గం లేదు. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో ఎలా ఆడతారో చూడటానికి నేను ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను’’ అని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.
కష్టమే.. కానీ తప్పదు
‘‘వాస్తవానికి పుణె టెస్టులో ఇప్పుడు మేమున్న పరిస్థితిలో పుంజుకోవడం చాలా కష్టమైన పనే. కానీ ఇది ఆటగాళ్లు పోరాట స్ఫూర్తిని ప్రదర్శించడానికి, వరల్డ్ టెస్టు ఛాంపియన్స్‌షిప్ ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానాన్ని కాపాడుకోవడానికి ఒక మంచి అవకాశంగా టీమ్‌లోని ప్లేయర్లు భావించాలి’’ అని టీమిండియాలో మోర్నీ మోర్కెల్ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు.
భారత్ ముందు భారీ టార్గెట్
శుక్రవారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ టీమ్ 198/5తో నిలవగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకి లభించిన 103 పరుగుల ఆధిక్యంతో కలిపి ప్రస్తుతం 301 పరుగుల లీడ్‌లో కివీస్ ఉంది. మూడో రోజైన శనివారం మొదటి సెషన్‌లోనే ఒకవేళ భారత్ జట్టు న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేసినా.. కనీసం 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి మానసికంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. అయితే.. స్పిన్‌కి అతిగా సహకరిస్తున్న పుణె పిచ్‌పై 300పైచిలుకు లక్ష్యం ఛేదించడం అంత సులువైన విషయం కాదు.