IND vs NZ: విరాట్ కోహ్లీకి ఏమైంది? పుణె టెస్టు తర్వాత తెరపైకి కొత్త సందేహాలు
Virat Kohli Out: స్పిన్ ఆడటంలో తిరుగులేని బ్యాటర్‌గా పేరొందిన విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో పుల్ టాస్ బంతి ఆడలేక క్లీన్ బౌల్డ్ అవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
మిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శుక్రవారం పుణె టెస్టులో ఔటైన తీరు కొత్త సందేహాలను తెరపైకి తెచ్చింది. క్రికెట్ చరిత్రలోనే ఆల్ టైమ్ బెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా ఉన్న విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ విసిరిన పుల్ టాస్ బంతిని ఆడలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గత కొంతకాలంగా సెంచరీ కోసం నిరీక్షిస్తున్న విరాట్ కోహ్లీ ఒత్తిడిలో ఉన్నాడు అనేదానికి ఇదే నిదర్శనమని కొంత మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ఆసియాలో మూడేళ్లుగా ఫెయిల్
2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ దాదాపు క్రికెట్ దేశాలన్నింటిపైనా పరుగుల వరద పారించాడు. ఒకప్పుడు స్పిన్‌ని ఆడటంలో అత్యుత్తమ బ్యాటర్‌గా పేరొందిన కోహ్లీ ఇప్పుడు వరుసగా స్పిన్నర్ల బౌలింగ్‌లోనే వికెట్ చేజార్చుకుంటుండటం టీమిండియాలో కంగారు పెంచుతోంది. ఎంతలా అంటే ఆసియా పిచ్‌లపై చెలరేగిపోయే కోహ్లీ 2021 నుంచి ఆసియాలో 21 సార్లు స్పిన్నర్ల బౌలింగ్‌నే వికెట్ కోల్పోయాడు.
విరాట్ కోహ్లీ 2021 నుంచి ఆసియా పిచ్‌లపై 28.85 సగటుతో మాత్రమే పరుగులు చేయగా.. అతని స్ట్రైక్ రేట్ 50 కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఈ మూడేళ్లలో ఆసియాలో కోహ్లీ చేసిన పరుగులు 606 మాత్రమే. ఇటీవల న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా ముగిసిన తొలి టెస్టులోనూ విరాట్ కోహ్లీ 0, 70 పరుగులు చేసి పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు.
కోహ్లీ కెరీర్ రికార్డులు
ఓవరాల్‌గా కెరీర్‌లో ఇప్పటి వరకు 117 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ 48.48 సగటుతో 9,018 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ.. ఇదంతా గతం. గత కొన్ని నెలలుగా టెస్టుల్లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించలేకపోతున్నాడు.అలానే వన్డే, టీ20ల్లోనూ అతని ప్రదర్శన గత కొన్ని సిరీస్‌ల నుంచి తీసికట్టుగా మారింది. ఈ ఏడాదే ఆస్ట్రేలియా పర్యటన కూడా ఉండటంతో విరాట్ కోహ్లీకి ఏమైంది? అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
పుణెలో కివీస్ గెలుపునకి బాటలు
పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శుక్రవారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ టీమ్ 198/5తో రెండో ఇన్నింగ్స్‌లో నిలవగా.. ఆ జట్టు ఇప్పటికే 301 పరుగుల ఆధిక్యంలో ఉంది. దాంతో భారత్ జట్టు ఎంత త్వరగా ఆ జట్టుని ఆలౌట్ చేస్తే అంత మంచిది. ఒకవేళ శనివారం తొలి సెషన్ మొత్తం కివీస్ బ్యాటర్లు క్రీజులో నిలుస్తే.. భారత్ ముందు 350 పైచిలుకు టార్గెట్ నిలిచే అవకాశం ఉంటుంది. అప్పుడు స్పిన్నర్లకి అనుకూలిస్తున్న పుణె పిచ్‌పై అంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం టీమిండియాకి కష్టం అవుతుంది.