Virat Kohli Bowled: విరాట్ కోహ్లీని పుల్ టాస్‌తో ఊరించి.. క్లీన్‌బౌల్డ్ చేసిన కివీస్ స్పిన్నర్-embarrassing dismissal for virat kohli in india vs new zealand 2nd test day 2 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli Bowled: విరాట్ కోహ్లీని పుల్ టాస్‌తో ఊరించి.. క్లీన్‌బౌల్డ్ చేసిన కివీస్ స్పిన్నర్

Virat Kohli Bowled: విరాట్ కోహ్లీని పుల్ టాస్‌తో ఊరించి.. క్లీన్‌బౌల్డ్ చేసిన కివీస్ స్పిన్నర్

Galeti Rajendra HT Telugu
Oct 25, 2024 11:07 AM IST

IND vs NZ 2nd Test Live Updates: విరాట్ కోహ్లీని ఊరిస్తూ న్యూజిలాండ్ స్పిన్నర్ పుల్ టాస్ విసిరాడు. దాంతో ఊహించని ఆ బంతిని హిట్ చేయబోయిన విరాట్ కోహ్లీ.. మిస్ అవడంతో క్లీన్ బౌల్డయ్యాడు.

విరాట్ కోహ్లీ వికెట్ తీసిన మిచెల్ శాంట్నర్
విరాట్ కోహ్లీ వికెట్ తీసిన మిచెల్ శాంట్నర్ (PTI)

న్యూజిలాండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎవరూ ఊహించనిరీతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం 16/1తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ జట్టు గంట వ్యవధిలోనే 66/3తో ఒత్తిడిలో పడిపోయింది. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైశ్వాల్ (28), రిషబ్ పంత్ (7) ఉండగా.. విరాట్ కోహ్లీ (1), శుభమన్ గిల్ (30) ఈరోజు పెవిలియన్‌‌కి వెళ్లిపోయారు. గురువారం సాయంత్రమే రోహిత్ శర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేయడంతో.. భారత్ జట్టు ఇంకా 193 పరుగులు వెనకబడి ఉంది.

పుణె పిచ్ స్పిన్‌కి బాగా అనుకూలిస్తోంది. దాంతో మ్యాచ్‌లో తొలి రోజైన గురువారం భారత్ స్పిన్నర్లలో వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లు పడగొట్టగా.. మిగిలిన 3 వికెట్లు అశ్విన్ ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం కూడా పిచ్ నుంచి సహకారం లభిస్తుండటంతో న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ వరుసగా వికెట్లు తీస్తున్నాడు.

 

ఈరోజు తొలి సెషన్ ఆరంభంలోనే వ్యక్తిగత స్కోరు 16 వద్దే వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా గిల్ దొరికిపోయాడు. కానీ.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో జీవనదానం లభించింది. కానీ.. 30 పరుగుల వద్ద అదే తరహాలో ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే అప్పుడే క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీని శాంట్నర్ బోల్తా కొట్టించాడు.

శుభమన్ గిల్ ఔట్ తర్వాత అప్పుడే క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీకి లో-పుల్ టాస్ బంతిని శాంట్నర్ విసిరాడు. మిడిల్ స్టంప్ లైన్‌పై పడిన ఆ బంతిని సాధారణంగా విరాట్ కోహ్లీ సులువుగా బౌండరీకి తరలించగలడు. కానీ.. ఆ బంతిని అస్సలు ఊహించని కోహ్లీ.. రాంగ్ లైన్‌లో బ్యాట్‌ని అడ్డంగా ఊపేశాడు. దాంతో బ్యాట్‌కి దొరకని బంతి నేరుగా వెళ్లి వికెట్లని గీరాటేసింది. కోహ్లీ ఔటైన తీరుతో పుణె స్టేడియం కొన్ని క్షణాలు నిశబ్ధ వాతావరణంలో ఉండిపోయింది.

Whats_app_banner