RCB Captain: విరాట్ కోహ్లీ చేతికి మళ్లీ ఆర్సీబీ పగ్గాలు? 3 ఏళ్ల తర్వాత మనసు మార్చుకున్న మాజీ కెప్టెన్
30 October 2024, 12:00 IST
Virat Kohli RCB Captain: ఐపీఎల్ 2013 నుంచి వరుసగా 9 ఏళ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ని కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నడిపించాడు. కానీ.. ఇందులో ఒక్క ఏడాది మాత్రమే ఆర్సీబీ ఫైనల్‌కి చేరింది.
విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 2025 మెగా వేలం ముంగిట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకి ఉత్సాహానిచ్చే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో విరాట్ కోహ్లీ చేతికి మళ్లీ టీమ్ పగ్గాల్ని ఆర్సీబీ ఇవ్వబోతున్నట్లు వార్త లీకైంది. 2021లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబరు ద్వితీయార్థంలో జరగనుంది. దాంతో అక్టోబరు 31లోపు టోర్నీలోని 10 ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాని బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. దాంతో ఇప్పటికే అన్ని జట్లూ రిటెన్షన్ జాబితాని సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి కెప్టెన్సీ మార్పుపై ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.
9 ఏళ్లు.. నెరవేరని టైటిల్ కల
ఐపీఎల్‌లో 9 ఏళ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్ 2013లో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న కోహ్లీ.. 2021 వరకు టీమ్‌ను నడిపించాడు. కానీ.. ఈ క్రమంలో ఒక్కసారి కూడా ఆ జట్టుకి టైటిల్‌ను మాత్రం అందించలేకపోయాడు. అతని కెప్టెన్సీలో ఆర్సీబీ టీమ్ 2016లో ఫైనల్‌కి చేరినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది.
2021లో కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోగా.. డుప్లెసిస్ చేతికి ఆర్సీబీ పగ్గాలు వెళ్లాయి. డుప్లెసిస్ కెప్టెన్సీలో ఆర్సీబీ టీమ్ ఐపీఎల్ 2022, 2024లో ప్లేఆఫ్స్‌కి చేరింది. కానీ.. టైటిల్ గెలవలేకపోయింది. అయితే.. ఇటీవల టీ20 వరల్డ్‌కప్-2024ని భారత్ జట్టు గెలవగా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కి కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు.
డుప్లెసిస్ ఔట్.. ఆర్సీబీకి నో ఆప్షన్స్
ప్రస్తుతం కోహ్లీ వన్డే, టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. దానికి తోడు ఇప్పుడు టీమిండియా కెప్టెన్ కూడా కాదు. కాబట్టి కోహ్లీపై 2021తో పోలిస్తే ఒత్తిడి చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో.. ఆర్సీబీ పగ్గాలు తన చేతికి ఇవ్వాల్సిందిగా ఫ్రాంఛైజీని విరాట్ కోహ్లీ కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంటర్నేషనల్ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న డుప్లెసిస్.. ప్రైవేట్ లీగ్స్ ఆడుతున్నాడు. కానీ.. అతను చెప్పుకోదగ్గ ఫామ్‌లో కనిపించడం లేదు. దాంతో ఐపీఎల్ 2025 సీజన్‌లో డుప్లెసిస్‌ను రిటెన్ చేసుకోవడంపై ఆర్సీబీ ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. దాంతో జట్టు పగ్గాలు విరాట్ కోహ్లీ చేతికి ఇవ్వడానికి ఆర్సీబీ వద్ద ఎలాంటి అభ్యంతరాలు లేనట్లు కనిపిస్తున్నాయి.
కోహ్లీకి ఇవ్వకపోతే.. కోట్లు కుమ్మరించాల్సించే
వాస్తవానికి ఒకవేళ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తీసుకోకపోతే.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో కెప్టెన్సీ అనుభవం ఉన్న రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లేదా కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ల కోసం కోట్లలో కుమ్మరించాల్సి వస్తుంది. దాంతో ఏ విధంగా చూసుకున్నా ఆర్సీబీకి విరాట్ కోహ్లీ చేతికి కెప్టెన్సీ ఇవ్వడం లాభాదాయకమే. పైపెచ్చు కోహ్లీ క్రేజ్‌తో ఆర్సీబీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మరింత పెరుగుతుంది.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 143 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఇందులో జట్టు కేవలం 66 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ గెలిచింది. మిగిలిన 77 మ్యాచ్‌ల్లో 70 మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. 7 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.