Karthik on Virat Kohli: విరాట్ కోహ్లీకి సలహా ఇచ్చిన దినేశ్ కార్తిక్.. ఏం చేయాలో చెప్పిన మాజీ స్టార్
Dinesh Karthik on Virat Kohli: న్యూజిలాండ్‍తో సిరీస్‍లో విరాట్ కోహ్లీ విఫలమవుతున్నాడు. కొన్నేళ్లుగా స్పిన్ ఆడేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. ఈ తరుణంలో కోహ్లీకి ఓ సలహా ఇచ్చాడు మాజీ స్టార్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐదేళ్లుగా టెస్టుల్లో పెద్దగా ఫామ్‍లో లేడు. ఐదేళ్లలో కేవలం రెండు టెస్టు సెంచరీలే చేశాడు. 2012 నుంచి 2019 మధ్య అద్భుతంగా ఆడి అదరగొట్టిన కోహ్లీ.. ఆ తర్వాత టెస్టుల్లో డౌన్ అయ్యాడు. న్యూజిలాండ్‍తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‍లోనూ కోహ్లీ విఫలమవుతున్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‍లో ఆడేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్‍లోనూ కోహ్లీ ఔటయ్యాడు.
న్యూజిలాండ్‍తో మూడు టెస్టుల సిరీస్‍లో తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడి సిరీస్ కోల్పోయింది భారత్. 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఓడిపోయింది. కోహ్లీ ఫామ్‍లో లేకపోవడం భారత జట్టుకు ఇప్పుడు ఆందోళనగా మారింది. ఈ తరుణంలో భారత మాజీ స్టార్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.. విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోవడంపై స్పందించాడు. స్పిన్‍కు ఇబ్బందులు పడుతుండడంపై మాట్లాడాడు. ఓ సలహా ఇచ్చాడు.
దేశవాళీ క్రికెట్ ఆడాలి
గత మూడేళ్లలో స్పిన్ బౌలింగ్‍లో ఆడేందుకు కోహ్లీ ఇబ్బందులు పడుతున్నాడని, స్పిన్‍పై అతడి రికార్డు గొప్పగా లేదని దినేశ్ కార్తిక్ అన్నాడు.“విరాట్ కోహ్లీ ఏం చేయగలడో మనకు తెలుసు. చాలాకాలం కోహ్లీ సరిగా ఆడడం లేదని ఫ్యాన్స్ ఉంటున్నారు. మనం కూడా ఆ విషయాన్ని పక్కకు నెట్టలేం. దాన్ని దాచిపెట్టలేం. ఎందుకంటే మనం ఓ ప్లేయర్ ఆటను విశ్లేషించాలి. గత రెండు, మూడేళ్లలో విరాట్ కోహ్లీ టెస్టు రికార్డు స్పిన్నర్లపై అంత గొప్పగా లేదు” అని క్రిక్‍బజ్ ఇంటర్వ్యూలో కార్తిక్ చెప్పాడు.
విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‍లోకి వచ్చేందుకు, స్పిన్ ఆడడంలో మెరుగయ్యేందుకు దేశవాళీ క్రికెట్ మళ్లీ ఆడాలని దినేశ్ కార్తిక్ సలహా ఇచ్చాడు. “ఇప్పుడు ఏం చేయాలి. విరాట్ కోహ్లీ మళ్లీ దేశవాళీ క్రికెట్ ఆడాలి. ఏం చేయాలో ఆ అంశాలపై ఫోకస్ చేయాలి. కోహ్లీకి లెఫ్టార్మ్ స్పిన్నర్లు పెద్దగా ముప్పుగా ఉన్నారు” అని కార్తిక్ చెప్పాడు.
సమాధానాల కోసం వెతుకుతున్నాడు
విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‍తో రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడని దినేశ్ కార్తిక్ అన్నాడు. ఏం చేయాలనే విషయాన్ని కోహ్లీ ఇప్పుడు ఆలోచిస్తుంటాడని తెలిపాడు. విరాట్ ఎప్పుడు సమాధానాల కోసం వెతుకుతుంటాడని అన్నాడు. స్పిన్ పిచ్‍లపైనే ఆడాలని భారత్ అనుకుంటుందని, విరాట్ ఎలాంటి గేమ్‍ప్లాన్‍తో వస్తాడో చూడాలని కార్తిక్ చెప్పాడు.
న్యూజిలాండ్‍తో ఈ రెండు టెస్టుల్లో కోహ్లీ 88 పరుగులే చేశాడు. అందులోనూ బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనే 70 రన్స్ చేశాడు. మిగిలిన మూడు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడు. మూడో టెస్టులో కోహ్లీ ఫామ్‍లోకి వస్తాడని భారత్ ఆశలు పెట్టుకుంది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగడనుండటంతో కోహ్లీ ఫామ్‍లోకి రావడం అత్యంత కీలకంగా మారింది.
భారత్, న్యూజిలాండ్ మధ్య ముంబై వేదికగా సిరీస్‍లో ఆఖరిదైన మూడో టెస్టు నవంబర్ 1వ తేదీన మొదలుకానుంది. ఇప్పటికే సిరీస్‍ను 0-2తో కోల్పోయిన రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. చివరి మ్యాచ్‍లో గెలిచి పరువు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది.