ENG vs PAK T20: టీ20 వరల్డ్ కప్ ముందు పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్ - ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్
31 May 2024, 9:03 IST
ENG vs PAK T20: టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ వైట్ వాష్‌కు గురైంది. నాలుగో టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లండ్ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్నది.
ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్ టీ20
ENG vs PAK T20: టీ20 వరల్డ్ కప్ ముందు పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఐర్లాండ్ చేతిలో టీ20 మ్యాచ్‌లో ఓటమి పాలై విమర్శలు మూటగట్టుకున్న పాకిస్థాన్‌కు మరో దారుణ పరాభవం ఎదురైంది. ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. వరల్డ్ కప్ కోసం సన్నద్ధమయ్యేందుకు ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్థాన్ తలపడింది. ఈ సిరీస్‌ను 2 -0 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకున్నది. మొత్తం నాలుగు మ్యాచుల్లో రెండు మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి. మిగిలిన రెండింటిలో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ సిరీస్‌ను సొంతం చేసుకున్నది.
మెరుపు ఆరంభం దక్కినా...
గురువారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజాం 22 బాల్స్‌లో ఐదు ఫోర్లు ఓ సిక్సర్‌తో 36 పరుగులు, ఉస్మాన్ ఖాన్ 21 బాల్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 రన్స్‌తో పాకిస్థాన్‌కు మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరి జోరుతో పాకిస్థాన్ ఎనిమిది ఓవర్లలోనే 80 రన్స్ చేసింది. కానీ బాబర్ ఆజాం, ఉస్మాన్ ఖాన్ ఔట్ కావడంతో పాకిస్థాన్ పతనం మొదలైంది.
సింగిల్ డిజిట్‌కే...
ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇఫ్తికార్ అహ్మద్, నసీమ్ షా మినహా మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితవ్వడంతో పాకిస్థాన్ 157 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్‌వుడ్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
పాకిస్థాన్ విధించిన 158 పరుగుల సింపుల్ టార్గెట్‌ను ఇంగ్లండ్ మరో 4.3 ఓవర్లు మిగిలుండగానే చేధించింది. 15. 3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్, బట్లర్ పాకిస్థాన్ బౌలర్లపై చితక్కొట్టారు.
సిక్సర్ల వర్షం...
సాల్ట్ 24 బాల్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 45 రన్స్ చేశాడు. బట్లర్ 21 బాల్స్‌లో ఏడు ఫోర్లు ఓ సిక్సర్‌తో 39 రన్స్ తో రాణించాడు. వీరిద్దరి మెరుపులతో ఆరు ఓవర్లలోనే ఇంగ్లండ్ 80 పరుగులు చేసింది. బట్లర్, సాల్ట్‌తో పాటు విల్ జాక్స్ ఔటైనా ...బెయిర్ స్టో, హ్యారీ బ్రూక్ కలిసి ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించారు. బెయిర్ స్టో పదహారు బాల్స్‌లో మూడు సిక్సర్లు ఓ ఫోర్‌తో 28 రన్స్, హ్యారీ బ్రూక్ 17 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లండ్ కోల్పోయిన ఈ మూడు వికెట్లు పాక్ పేసర్ హరీస్ రౌఫ్‌కు దక్కాయి. అతడు మినహా మిగిలిన బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.
టీ20 వరల్డ్ కప్ కోసం ఇటీవలే బాబర్ ఆజాం సారథ్యం పాకిస్థాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. బాబర్ ఆజాంను కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ మరోసారి బాబర్ ఆజాంపై నమ్మకం ఉంచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ టీ20 కెప్టెన్సీ బాధ్యతలను అతడికే అప్పగించింది.