Kohli: కప్పు గెలవాలంటే కోహ్లి ఆర్‌సీబీని వదిలిపెట్టాలి - ఆ టీమ్ విరాట్‌కు బెస్ట్ - ఇంగ్లండ్ క్రికెటర్ కామెంట్స్
Virat Kohli: ఆర్‌సీబీ టీమ్‌ను వీడితేనే ఐపీఎల్ టైటిల్ గెలవాలనే కోహ్లి కల తీరుతుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కోహ్లి కరెక్ట్ టీమ్ అని పీటర్సన్ అన్నాడు. కోహ్లిని ఉద్దేశించి అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
Virat Kohli: ఆర్‌సీబీ కప్పుకొడితే చూడాలని చాలా ఏళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. పదిహేడో సారి కూడా వారి ఆశలు తీరలేదు. వరుస పరాజయాలతో ఐపీఎల్ 2024ను ఆరంభించింది ఆర్‌సీబీ. ఈ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ తీరును చూసి అందరి కంటే ముందుగానే ఐపీఎల్ నుంచి ఆర్‌సీబీ ఇంటిముఖం పడుతుందని అనుకున్నారు. కానీ వరుసగా ఆరు విజయాలతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టి క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకిచ్చింది.
రాజస్థాన్ రాయల్స్ బ్రేకులు...
ఇదే జోరుతో ఫైనల్‌లో అడుగుపెట్టాలని అనుకున్నది. కానీ సెకండ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ దూకుడుకు రాజస్థాన్ రాయల్స్ బ్రేకులు వేసింది. రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో రాజస్థాన్ చేతిలో ఓటమిపాలైన బెంగళూరు ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది.
కోహ్లి ఆరెంజ్ క్యాప్...
కాగా ఈ ఐపీఎల్‌లో కోహ్లి బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. 741 రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో 33 రన్స్‌తో కోహ్లి రాణించాడు. ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఓటమిని కోహ్లి జీర్ణించుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం నిరాశగా కనిపించాడు. తమ జట్టుకు ట్రోఫీ అందించేందుకు చివరి వరకు పోరాడిన కోహ్లిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తోన్నారు. మాజీ క్రికెటర్లు కూడా కోహ్లికి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మద్దుతుగా నిలుస్తోన్నారు.
ఆర్‌సీబీని వదిలిపెట్టాలి...
విరాట్ కోహ్లిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ టైటిల్ గెలవాలనే కోహ్లి కల తీరాలంటే అతడు ఆర్‌సీబీని వదిలిపెట్టాలని అన్నాడు. ఐపీఎల్ టైటిల్ గెలవడానికి కోహ్లికి అన్ని అర్హతలు ఉన్నాయని అన్నాడు. ఆర్‌సీబీ ఇప్పటివరకు కప్పు గెలవకపోయినా ఆ టీమ్‌కు కమర్షియల్ వాల్యూ ఉందంటే అది కోహ్లి వల్లే. టీమ్‌కు ఓ బ్రాండ్‌గా కోహ్లి నిలిచాడు. ఈ సీజన్‌లో బ్యాట్‌తో అదరగొట్టి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని పీటర్సన్ అన్నాడు.
సరైన సహకారం లేదు...
ఏ టీమ్ తరఫున ఆడిన ఆ జట్టుకు కప్పు అందించే శక్తి సామర్థ్యాలు కోహ్లికి ఉన్నాయి. అయినా కోహ్లికి ఆర్‌సీబీ నుంచి సరైన సహకారం అందడం లేదని, అందువల్లే ఈ సీజన్‌లో ఆర్‌సీబీ కప్పు గెలవలేకపోయిందని పీటర్సన్ చెప్పాడు.
ఫుట్‌బాల్‌లో...
ఆర్‌సీబీని వీడితేనే కోహ్లికి కలిసివచ్చే అవకాశం ఉందని పీటర్సన్ అన్నాడు. ఫుట్‌బాల్‌లో బెక్‌హమ్, రోనాల్డో, మెస్సీలాంటి ప్లేయర్లు కెరీర్‌లో కోహ్లి లాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొన్నారని, తాము ఆడే క్లబ్‌లను మార్చడం వల్లే ఫుట్‌బాల్‌లో వారు గొప్ప విజయాల్ని అందుకున్నారని పీటర్సన్ పేర్కొన్నాడు. ఆర్‌సీబీని వదిలిపెడితేనే ఐపీఎల్ టైటిల్ గెలవాలనే కోహ్లి కల తీరుతుందని పీటర్సన్ అన్నాడు.
కోహ్లికి ఢిల్లీ ఫ్రాంచైజ్‌లోకి వెళితే బాగుంటుందని కెవిన్ పీటర్సన్ అన్నాడు. ఢిల్లీలోనే అతడు పుట్టిపెరిగాడు. ఇక్కడే క్రికెట్ ఆడాడు కాబట్టి ఢిల్లీ టీమ్ అయితేనే కోహ్లి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలడని కెవిన్ పీటర్సన్ అన్నాడు.
ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ 34, కోహ్లి 33 రన్స్ చేశారు. బెంగళూరు విధించిన టార్గెట్‌ను రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలోనే ఛేదించింది. యశస్వి జైస్వాల్ 45, రియాన్ పరాగ్ 36 రన్స్‌తో రాజస్థాన్‌ను గెలిపించారు.