Moeen Ali Retirement: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అనూహ్యరీతిలో రిటైర్మెంట్, ఆ బాధలో గుడ్ బై చెప్పేశాడా?
08 September 2024, 12:58 IST
Allrounder Moeen Ali Retirement: ఇంగ్లాండ్ టీమ్‌లో నమ్మదగిన ఆల్‌రౌండర్లలో ఒకడిగా ఉన్న మొయిన్ అలీ అనూహ్యరీతిలో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు. 37 ఏళ్ల మొయిన్ అలీ పేరున అరుదైన టీ20 రికార్డ్ కూడా ఉంది.
మొయిన్ అలీ రిటైర్మెంట్
Moeen Ali Records: ఇంగ్లాండ్ టీమ్ సీనియర్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అనూహ్యరీతిలో ఈరోజు అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు. 2014 నుంచి ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్న 37 ఏళ్ల మొయిన్ అలీ.. ఇప్పటి వరకు 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
బర్మింగ్‌హామ్‌లో జన్మించిన మొయిన్ అలీ ఎడమచేతి వాటం బ్యాటర్, కుడిచేతి వాటం స్పిన్నర్. గత కొన్ని రోజులుగా ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న మొయిన్ అలీని ఈ నెల 12 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న సిరీస్‌కి ఎంపిక చేయలేదు. దాంతో మొయిన్ అలీ బాధలోనే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించేసినట్లు తెలుస్తోంది.
టైమ్ వచ్చింది.. గుడ్ బై
‘‘నేను ఇంగ్లాండ్ తరఫున సుదీర్ఘకాలంగా చాలా క్రికెట్ ఆడాను. ఇక నెక్ట్స్ జనరేషన్ వారికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. నాకు కూడా ఈ మేరకు సూచనలు వచ్చాయి. అందుకే వీడ్కోలు చెప్పడానికి ఇదే మంచి సమయమని భావించి.. నా బాధ్యత నేను నిర్వర్తించా’’ అని మొయిన్ అలీ చెప్పుకొచ్చాడు.
2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొయిన్ అలీ.. టెస్టుల్లో 5 సెంచరీలు, వన్డేల్లో 3 సెంచరీలు సాధించాడు. 2019లో ఇంగ్లాండ్ గెలిచిన వన్డే ప్రపంచకప్, 2022లో గెలిచిన టీ20 వరల్డ్‌కప్ జట్టులోనూ మొయిన్ అలీ సభ్యుడిగా ఉన్నాడు.
టీ20ల్లో అరుదైన రికార్డ్
2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన మొయిన్ అలీ.. ఇంగ్లాండ్ తరఫున టీ20ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.
‘‘ఇంగ్లాండ్ తరఫున తొలిసారి ఆడినప్పుడు ఎన్ని మ్యాచ్‌లు ఆడతానో అనిపించింది. కానీ.. సుదీర్ఘ కెరీర్‌లో దాదాపు 300 మ్యాచ్‌లు ఆడగలిగాను. నా జీవితంలో అవి బెస్ట్ డేస్ అని నాకు తెలుసు’’ అని మొయిన్ అలీ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికినా.. ఐపీఎల్ లాంటి ప్రైవేట్ లీగ్‌లో ఆడుతూ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ క్రికెట్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తానని మొయిన్ అలీ వెల్లడించాడు.
"ఇంగ్లాండ్ టీమ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను అర్థం చేసుకున్నాను. కాలక్రమంలో జట్టు మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందని. అందుకే ప్రాక్టికల్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను’’ అని మొయిన్ అలీ వెల్లడించాడు.