Josh Inglis Record: 43 బంతుల్లోనే సెంచరీ.. ఆస్ట్రేలియా బ్యాటర్ సరికొత్త రికార్డు
Josh Inglis Record: ఆస్ట్రేలియా బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ రికార్డు క్రియేట్ చేశాడు. ఆ టీమ్ తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. స్కాట్లాండ్ తో మ్యాచ్ లో ఇంగ్లిస్ కేవలం 43 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం.
Josh Inglis Record: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్కాట్లాండ్ తో శుక్రవారం (సెప్టెంబర్ 6) జరిగిన మ్యాచ్ లో అతడు కేవలం 43 బంతుల్లోనే సెంచరీ బాదాడు. బౌండరీలు, సిక్స్‌ల వర్షం కురిపించిన ఇంగ్లిస్.. ఆస్ట్రేలియా తరఫున టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును నమోదు చేశాడు.
జోష్ ఇంగ్లిస్ రికార్డు
స్కాట్లాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో జోష్ ఇంగ్లిస్ దుమ్ము రేపాడు. ఆస్ట్రేలియా తరఫున ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ రికార్డు క్రియేట్ చేశాడు. ఎడిన్‌బర్గ్ లో స్కాట్లాండ్ పై చెలరేగిన ఇంగ్లిస్.. కేవలం 49 బంతుల్లోనే 7 సిక్స్‌లు, 7 ఫోర్లతో 103 రన్స్ చేశాడు. అయితే 43 బంతుల్లోనే సెంచరీతో చరిత్ర సృష్టించాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను తొలి బంతికే డకౌట్ చేసిన ఆనందంలో ఉన్న ఆ టీమ్ బౌలర్లకు ఇంగ్లిస్ చుక్కలు చూపించాడు. వికెట్ నష్టానికి ఆస్ట్రేలియా 11 పరుగులు చేసిన సమయంలో క్రీజులోకి అడుగుపెట్టిన ఇంగ్లిస్.. ఇక వెనుదిరిగి చూడలేదు.
కామెరాన్ గ్రీన్ తో కలిసి మూడో వికెట్ కు 92 రన్స్ జోడించాడు. ఆసీస్ 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా.. ఇంగ్లిస్ మాత్రం ఎదురు దాడికి దిగాడు. మొదటి నుంచి ఔటయ్యేంత వరకు అతడు చాలా దూకుడుగా కనిపించాడు.
ఫించ్ రికార్డు బ్రేక్
జోష్ ఇంగ్లిస్ కు టీ20ల్లో ఇది రెండో సెంచరీ. మొదటి సెంచరీని 47 బంతుల్లోనే చేసిన ఆరోన్ ఫించ్ రికార్డును సమం చేసిన అతడు.. ఇప్పుడు ఫించ్ పేరిట 47 బంతులతో ఉన్న రికార్డును తుడిచి పెట్టేశాడు. ఇంగ్లిస్ దూకుడుతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది.
జోష్ ఇంగ్లిస్ - 43 బంతులు
ఆరోన్ ఫించ్ - 47 బంతులు
జోష్ ఇంగ్లిస్ - 47 బంతులు
గ్లెన్ మ్యాక్స్‌వెల్ - 47 బంతులు
గ్లెన్ మ్యాక్స్‌వెల్ - 49 బంతులు
జోష్ ఇంగ్లిస్ గతేడాది ఇండియాతో మ్యాచ్ లోనే 47 బంతుల్లోనే టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇప్పుడు రెండో సెంచరీతో ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ చేశాడు. ఈ ఫార్మాట్లో ఇస్తోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేసిన వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.