Australia Cricket: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. భీకర హిట్టింగ్‍తో హెడ్ విధ్వంసం.. 9.2 ఓవర్లలోనే గెలుపు
Australia - Travis Head: ఆస్ట్రేలియా ధనాధన్ బ్యాటింగ్‍తో అలవోకగా గెలిచింది. లక్ష్యాన్ని 9.2 ఓవర్లలోనే ఛేదించింది. పవర్‌ప్లేలో విధ్వంసం సృష్టించింది. దీంతో ఓ చరిత్ర సృష్టించింది.
మరోసారి బ్యాటింగ్‍లో హిట్టింగ్ సునామీ సృష్టించింది ఆస్ట్రేలియా. ధనాధన్ ఆటతో దుమ్మురేపింది. స్కాట్‍లాండ్‍తో తొలి అద్భుత విజయం సాధించింది ఆసీస్. మూడు టీ20ల సిరీస్‍లో ఆధిక్యంలోకి వచ్చింది. ఎడిన్‍బర్క్ వేదికగా నేడు (సెప్టెంబర్ 4) జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో స్కాట్‍లాండ్‍పై విజయం సాధించింది. లక్ష్యఛేదనలో పవర్‌ప్లేలోనే వీరవిహారం చేశాడు ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్. మొత్తంగా 10 ఓవర్లోగానే విజయం సాధించింది. ఈ క్రమంలో ఓ వరల్డ్ రికార్డును కూడా నెలకొల్పింది.
చరిత్ర సృష్టించిన ఆసీస్
155 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. పవర్ ప్లే (6 ఓవర్లు)లోనే ఏకంగా 113 పరుగులు చేసింది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో పవర్ ప్లేలో అత్యధిక స్కోరు చేసిన జట్టుకు చరిత్ర సృష్టించింది. గతేడాది పవర్ ప్లేలో 102 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా పేరిట ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు స్కాట్‍లాండ్‍పై ఆరు ఓవర్లలోనే 113 పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో పవర్ ప్లేలో హయ్యెస్ట్ స్కోర్ రికార్డును ఆసీస్ కైవసం చేసుకుంది.
హెడ్ వీరకుమ్ముడు
లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (25 బంతుల్లో 80 పరుగులు; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) భీకర హిట్టింగ్‍తో చెలరేగాడు. ఆరంభం నుంచి బౌండరీలు మోత మోగించాడు. స్కాట్‍లాండ్ బౌలర్లను తన మార్క్ దూకుడుతో బెంబేలెత్తించాడు. ఈ మ్యాచ్‍తోనే అరంగేట్రం చేసిన ఆసీస్ యంగ్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ (0) తొలి ఓవర్ మూడో బంతికే డకౌట్ అయ్యాడు. అయితే, ట్రావిస్ హెడ్ మాత్రం వీర కుమ్ముడు కుమ్మేశాడు. మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 39 పరుగులు; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదరగొట్టాడు.
హెడ్, మార్ష్ హిట్టింగ్ విధ్వంసంతో ఆస్ట్రేలియా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 17 బంతుల్లోనే హెడ్ హాఫ్ సెంచరీ చేశాడు. 5.3 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును ఆసీస్ చేరింది. పవర్ ప్లే ముగిసే సరికి 113 రన్స్ చేసింది. ఆరు ఓవర్లు ముగియక ముందే హెడ్ 73 పరుగుల వ్యక్తిగత స్కోరు చేశాడు. మార్ష్ కూడా సునామీ సృష్టించాడు.
ఏడో ఓవర్లో మార్ష్, హెడ్ ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఆ తర్వాత జోస్ ఇంగ్లిస్ (13 బంతుల్లో 27 పరుగులు), మార్కస్ స్టొయినిస్ (5 బంతుల్లో 8 నాటౌట్) మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించారు. మొత్తంగా హెడ్ సునామీతో ఆసీస్ అలవోకగా విజయం సాధించింది. 9.2 ఓవర్లలోనే 3 వికెట్లకు 156 పరుగులు చేసింది ఆసీస్. 62 బంతులను మిగిల్చి గెలిచింది.
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్‍లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు చేసింది. జార్జ్ మున్సే (28), మాథ్యూ క్రాస్ (27), కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (23) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సీన్ అబాట్ మూడు వికెట్లు పడగొట్టాడు. గ్జేవియర్ బార్ట్లెట్, ఆజం జంపా రెండు వికెట్లు దక్కించుకోగా.. రిలే మెరిడిత్, కామెరూన్ గ్రీన్ తలా ఓ వికెట్ తీశారు.