Ind vs Aus 1st T20: ఇంగ్లిస్ మెరుపు సెంచరీ.. టీమిండియా ముందు ఆస్ట్రేలియా భారీ లక్ష్యం
Ind vs Aus 1st T20: జోష్ ఇంగ్లిస్ మెరుపు సెంచరీ.. స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీతో టీమిండియా ముందు ఆస్ట్రేలియా భారీ లక్ష్యం ఉంచింది. ఈ ఇద్దరి జోరుతో ఇండియన్ బౌలర్లంతా చేతులెత్తేశారు.
Ind vs Aus 1st T20: టీమిండియాతో విశాఖపట్నంలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. జోష్ ఇంగ్లిస్ మెరుపు సెంచరీకి తోడు స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ చేయడంతో ఆ టీమ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 రన్స్ చేసింది. ఈ ఇద్దరూ చితగ్గొట్టడంతో టీమిండియాలోని ప్రతి బౌలర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ముకేశ్ కుమార్ మాత్రమే 4 ఓవర్లలో 29 రన్స్ ఇచ్చాడు. అతడు చివరి ఓవర్లో కేవలం 5 రన్స్ మాత్రమే ఇవ్వడంతో ఆస్ట్రేలియా కాస్త తక్కువ స్కోరుకే పరిమితమైంది.
ఈ మ్యాచ్ లో జోష్ ఇంగ్లిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడు కేవలం 47 బంతుల్లోనే అంతర్జాతీయ క్రికెట్ లో తన తొలి సెంచరీ నమోదు చేయడం విశేషం. చివరికి 50 బంతుల్లోనే ఏకంగా 110 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇంగ్లిస్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 8 సిక్స్ లు ఉన్నాయి. ఐదో ఓవర్లో 31 పరుగుల దగ్గర షార్ట్ (13) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇంగ్లిస్.. భారత బౌలర్లను చితకబాదాడు.
గ్రౌండ్ నలుమూలలా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. మరోవైపు ఓపెనర్ గా వచ్చిన స్మిత్ కూడా అడపాదడపా బౌండరీలు బాదాడు. అతడు 41 బంతుల్లోనే 8 ఫోర్లతో 52 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 67 బంతుల్లోనే 130 పరుగులు జోడించారు. చివరికి స్మిత్ రనౌట్ కావడంతో వీళ్ల భాగస్వామ్యానికి తెరపడింది. నిజానికి 36 పరుగుల దగ్గరే ఇంగ్లిస్ ను రనౌట్ చేసే అవకాశాన్ని రవి బిష్ణోయ్ జారవిడవడం టీమిండియా కొంప ముంచింది.
ఇంగ్లిస్, స్మిత్ దెబ్బకి ఇండియా బౌలర్లు రవి బిష్ణోయ్ 4 ఓవర్లలోనే 54, ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలోనే 50 పరుగులు సమర్పించుకున్నారు. చివర్లో టిమ్ డేవిడ్ 13 బంతుల్లో 19, స్టాయినిస్ 6 బంతుల్లో 7 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.