DC vs SRH: హైదరాబాద్ మరో గ్రాండ్ విక్టరీ.. రికార్డుల మోతతో ఢిల్లీని చిత్తుచేసిన సన్‍రైజర్స్.. వరుసగా నాలుగో గెలుపు
20 April 2024, 23:51 IST
- DC vs SRH IPL 2024: సన్‍రైజర్స్ హైదరాబాద్ మరోసారి ధనాధన్ ఆటతో అద్భుత విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును చిత్తుచేసింది. వరుసగా నాలుగో విజయంతో తొడకొట్టింది ఎస్ఆర్‌హెచ్.
DC vs SRH: హైదరాబాద్ మరో గ్రాండ్ విక్టరీ.. రికార్డుల మోతతో ఢిల్లీని చిత్తుచేసిన సన్‍రైజర్స్.. వరుసగా నాలుగో గెలుపు
IPL 2024 DC vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ డ్రీమ్ రన్ కొనసాగింది. అద్భుతమైన హిట్టింగ్‍తో.. దూకుడైన ఆటతో మరోసారి రికార్డుల మోత మోగించడంతో పాటు భారీ విజయాన్ని సాధించింది ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఎస్ఆర్‌హెచ్. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నేడు (ఏప్రిల్ 20) జరిగిన మ్యాచ్‍లో హైదరాబాద్ 67 పరుగుల భారీ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఏడు మ్యాచ్‍ల్లో ఐదో గెలుపుతో వారెవా అనిపించింది. వరుసగా నాలుగో విజయాన్ని దక్కించుకుంది.
రికార్డుల మోతతో భారీ స్కోరు
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగుల భారీ స్కోరు చేసింది. ట్రావిస్ హెడ్ (32 బంతుల్లో 89 పరుగులు; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు అర్ధ శకతంతో సునామీ సృష్టిస్తే.. అభిషేక్ శర్మ (12 బంతుల్లో 46 పరుగులు; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరంగం చేశాడు. చివర్లో షహబాజ్ అహ్మద్ (29 బంతుల్లో 59 పరుగులు నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్ద శతకంతో రెచ్చిపోయాడు. ఐపీఎల్‍లో అత్యంత వేగంగా 100 పరుగులు (5 ఓవర్లలో 103 రన్స్), టీ20 చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక రన్స్ (125 పరుగులు), ఐపీఎల్‍లో తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోరు (158) సహా మరిన్ని రికార్డులను హైదరాబాద్ ఈ మ్యాచ్‍లో సృష్టించింది. ఐపీఎల్‍లో మూడుసార్లు 250 పరుగులకుపైగా స్కోర్లు చేసిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది.
ఢిల్లీ బౌలర్లలో కుల్‍దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో అదరగొట్టి.. హైదరాబాద్ జోరుకు కాస్త బ్రేక్ వేశాడు. హెడ్, అభిషేక్ దూకుడుతో ఓ దశలో 300 పరుగులను హైదరాబాద్ చేరుతుందేమో అనిపించింది. ఆరు ఓవర్లలోనే 125 పరుగులను హైదరాబాద్ సాధించింది. అయితే ఆ తర్వాత అభిషేక్, హెడ్‍ను ఔట్ చేసి దెబ్బకొట్టాడు కుల్దీప్. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఫ్రేజర్ మెరిపించినా..
భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆస్థాయిలో ఆడలేకపోయింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (1), పృథ్వి షా (16) రాణించలేకపోయారు. అయితే, ఢిల్లీ బ్యాటర్, ఆస్ట్రేలియా యంగ్ స్టార్ జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ 18 బంతుల్లోనే 65 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 5 ఫోర్లు, 7 సిక్సర్లతో అదరగొట్టాడు. అద్భుతమైన అర్ధ శకతంతో మెప్పించాడు. కాసేపు హైదరాబాద్ శిబిరంలో టెన్షన్ రేపాడు. అయితే, అతడిని ఏడో ఓవర్లో హైదరాబాద్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఔట్ చేశాడు. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ (22 బంతుల్లో 42 పరుగులు), రిషబ్ పంత్ (35 బంతుల్లో 44 పరుగులు) రాణించినా.. ఫలితం లేకపోయింది. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్ నటరాజన్ వరుస వికెట్లతో మెప్పించాడు. దీంతో 19.1 ఓవర్లలోనే 199 పరుగులకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆలౌటైంది.
నన్‍రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. తెలుగు బౌలర్ నితీశ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్ మయాంక్ మార్కండే.. ఫ్రేజర్, పోరెల్ వికెట్లను తీసి మెప్పించాడు. వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
రెండో స్థానానికి హైదరాబాద్
ఈ సీజన్‍లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‍ల్లో ఐదు విజయాలతో 10 పాయింట్లను దక్కించుకుంది సన్‍రైజర్స్ హైదరాబాద్. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఎనిమిది మ్యాచ్‍ల్లో 3 గెలుపులు, ఐదు పరాజయాలతో ఢిల్లీ ఏడో స్థానంలో ఉంది.
టాపిక్