DC vs SRH IPL 2024: మళ్లీ సన్‍రైజర్స్ హైదరాబాద్ వీర విధ్వంసం.. మరిన్ని రికార్డులు బద్దలు
DC vs SRH IPL 2024: ఐపీఎల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ మరోసారి రికార్డుల మోత మెగించింది. పవర్ ప్లేలోనే చరిత్ర సృష్టించింది. ట్రావిస్ హెడ్ వీరకుమ్ముడు కుమ్మితే.. అభిషేక్ శర్మ కూడా అదరగొట్టారు. మరోసారి భారీ స్కోరు చేసింది హైదరాబాద్.
Delhi Capitals vs Sunrisers Hyderabad IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో నమ్మశక్యం కాని బ్యాటింగ్‍తో సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) దుమ్మురేపుతోంది. ఇప్పటికే ఈ సీజన్‍లో రెండుసార్లు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును బద్దలుకొట్టిన హైదరాబాద్.. మరోసారి రికార్డుల మోత మెగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో నేటి (ఏప్రిల్ 20) మ్యాచ్‍లో పవర్ ప్లేలోనే సన్‍రైజర్స్ హైదరాబాద్ మరిన్ని రికార్డులను సృష్టించింది. ఢిల్లీ స్టేడియంలో మోతమోగించింది.
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తొలి ఆరు ఓవర్లలోనే ఏకంగా 125 పరుగులు చేసింది. సన్‍రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మెరుపు హిట్టింగ్‍తో అదరగొట్టారు. ఢిల్లీ బౌలర్లను వీరబాదుడు బాదేశారు. సిక్స్‌లు, బౌండరీలతో హోరెత్తించారు. దీంతో ఆరు ఓవర్లలోనే 11 సిక్స్‌లు, 13 ఫోర్లు వచ్చాయి. ఈ క్రమంలో హైదరాబాద్ రెండు రికార్డులను సృష్టించింది. అందులో ఓ ప్రపంచ రికార్డు ఉంది.
అత్యంత వేగంగా 100 రన్స్
ఈ మ్యాచ్‍లో 5 ఓవర్లలోనే 103 పరుగులు చేసింది సన్‍రైజర్స్ హైదరాబాద్. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. 2014లో పంజాబ్‍పై చెన్నై ఆరు ఓవర్లలో 100 రన్స్ చేయగా.. దాన్ని ఇప్పడు బద్దలుకొట్టేసింది ఎస్ఆర్‌హెచ్.
పవర్ ప్లేలో అత్యధిక స్కోరు
ఈ మ్యాచ్‍లో పవర్ ప్లే ముగిసే ఆరు ఓవర్లకే 125 పరుగులు చేసింది సన్‍రైజర్స్ హైదరాబాద్. దీంతో ఐపీఎల్‍లో మాత్రమే కాకుండా ప్రపంచ టీ20 చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక స్కోరు రికార్డును సన్‍రైజర్స్ హైదరాబాద్ తన పేరిట లిఖించుకుంది.
ఆరు ఓవర్లు ముగిసే సరికి సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 26 బంతుల్లో 84 పరుగులు చేసేశాడు. 11 ఫోర్లు, 6 సిక్స్‌లు బాదేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 10 బంతుల్లోనే 40 రన్స్ చేశాడు. 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో మెరుపులు మెరిపించాడు. ఆరు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 125 రన్స్ చేసింది హైదరాబాద్.
ట్రావిస్ హెడ్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో అభిషేక్ శర్మ పేరిట ఉన్న హైదరాబాద్ తరఫున ఫాస్టెస్ట్ ఫీఫ్టీ రికార్డును హెడ్ సమం చేశాడు.
కాగా, ఏడో ఓవర్ రెండో బంతికి అభిషేక్ శర్మ (12 బంతుల్లో 46 పరుగులు) ఔట్ అయ్యాడు. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. అభిషేక్‍ను ఔట్ చేసి ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు. దీంతో 131 పరుగుల విధ్వంస భాగస్వామ్యానికి తెర పడింది. ట్రావిస్ హెడ్ (32 బంతుల్లో 89 పరుగులు) తొమ్మిదో ఓవర్లో ఔటయ్యాడు. అతడిని కూడా కుల్దీప్ పెవిలియన్‍కు పంపాడు.
ఐడెన్ మార్క్‌రమ్ (1), హెన్రిచ్ క్లాసెన్ (15) త్వరగానే ఔటయ్యారు. అయితే, తెలుగు బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి (27 బంతుల్లో 37 పరుగులు) మోస్తరుగా ఆడగా.. షెహబాజ్ అహ్మద్ (29 బంతుల్లో 59 పరుగులు) అజేయ అర్ధ శకతం చేశాడు. చివరి వరకు దూకుడుగా ఆడాడు. మొత్తంగా 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగుల భారీ స్కోరు చేసింది హైదరాబాద్.
ఐపీఎల్‍లో ఇలా చేసిన తొలి టీమ్
ఐపీఎల్‍లో 250కు పైగా పరుగులు మూడుసార్లు చేసిన ఏకైక ఐపీఎల్ జట్టుగా సన్‍రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. మూడుసార్లు ఇదే సీజన్‍లో ఆ ఫీట్ సాధించింది. ఈ సీజన్‍లో ముంబై ఇండియన్స్ జట్టుపై 277 రన్స్ చేసిన హైదరాబాద్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)పై 287 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును 20 రోజుల వ్యవధిలో రెండుసార్లు చేసింది. నేటి మ్యాచ్‍లో 266 రన్స్ చేసింది ఎస్ఆర్‌హెచ్.
10 ఓవర్లలో అత్యధికం
ఈ మ్యాచ్‍లో తొలి పది ఓవర్లలోనే హైదరాబాద్ 158 పరుగులు చేసింది. దీంతో తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోరు చేసిన రికార్డును ఎస్‍ఆర్‍హెచ్ తన పేరిట లిఖించుకుంది.
తొలి ఆరు ఓవర్ల విధ్వంసం ఇలా..
టాస్ ఓడి సన్‍రైజర్స్ బ్యాటింగ్‍కు దిగగా.. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీరబాదుడు బాదేశారు. ఢిల్లీ బౌలర్ ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లో 19 రన్స్ వచ్చాయి. లలిత్ యాదవ్ వేసిన రెండో ఓవర్లో ట్రావిస్ హెడ్.. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదేశాడు. దీంతో 21 రన్స్ వచ్చాయి. ఎన్రిచ్ నార్జే వేసిన మూడో ఓవర్లో హెడ్ ఏకంగా నాలుగు, ఫోర్లు ఓ సిక్స్ బాదేశాడు. నాలుగో ఓవర్లో అభిషేక్ శర్మ రెండు, హెచ్ ఓ సిక్స్ కుమ్మేశాడు. కుల్దీప్ వేసిన ఐదో ఓవర్లో మూడు సిక్స్‌లు కొట్టాడు అభిషేక్. ముకేశ్ కుమార్ వేసిన ఆరో ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు హెడ్. ఓ బాల్ గ్యాప్ ఇచ్చి చివరి బంతికి సిక్స్ కొట్టాడు.