తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India All Out: న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకి ఫస్ట్ టెస్టులో భారత్ 46కే ఆలౌట్.. ఐదుగురు బ్యాటర్లు డకౌట్

India All Out: న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకి ఫస్ట్ టెస్టులో భారత్ 46కే ఆలౌట్.. ఐదుగురు బ్యాటర్లు డకౌట్

Galeti Rajendra HT Telugu

17 October 2024, 13:26 IST

google News
  • Team India All Out in 1st Test:  న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ల దెబ్బకి భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టీమ్‌లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేకపోయారు. 

డకౌట్‌గా వెనుదిరుగుతున్న జడేజా
డకౌట్‌గా వెనుదిరుగుతున్న జడేజా (AFP)

డకౌట్‌గా వెనుదిరుగుతున్న జడేజా

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూలిపోయింది. మ్యాచ్‌లో తొలిరోజైన బుధవారం వర్షం కారణంగా కనీసం టాస్ కూడా సాధ్యం కాలేదు. దాంతో రెండో రోజైన గురువారం టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఆరంభం నుంచే న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. కేవలం 31.2 ఓవర్లలోనే 46 పరుగులకే టీమిండియా ఆలౌటవగా.. టీమ్‌లోని ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం.

రోహిత్ శర్మతో మొదలు

ఈరోజు తొలి సెషన్ ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ (2) టిమ్ సౌథీ బౌలింగ్‌లో బౌల్డవగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లీ 9 బంతులు ఆడినా కనీసం ఖాతా కూడా తెరవకుండానే విలియమ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (0), కేఎల్ రాహుల్ (0) కూడా అదే పరిస్థితి. ఈ దశలో కాసేపు క్రీజులో నిలిచిన యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (13: 63 బంతుల్లో 1x4), రిషబ్ పంత్ (20: 49 బంతుల్లో 2x4) కాసేపు సహనంతో ఆడి భారత్ పరువు నిలిపే ప్రయత్నం చేశారు. 

కానీ.. ఇద్దరూ పరుగులు మాత్రం చేయలేకపోయారు.  రవీంద్రజడేజా (0), రవిచంద్రన్ అశ్విన్ (0) కూడా కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు. వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ఒక్క పరుగే చేయగా.. ఆఖర్లో కుల్దీప్ యాదవ్ (2), మహ్మద్ సిరాజ్ (4) కాసేపు క్రీజులో నిలిచారంతే. 

బౌలింగ్ చేస్తే వికెట్

న్యూజిలాండ్ బౌలర్లు ఓవర్ వేస్తే వికెట్ అనేలా వరుసగా భారత్ బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు. పిచ్ పేసర్లకి అనుకూలించడంతో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తెలివిగా టిమ్ సౌథీ, మాట్ హెన్రీ, విలియమ్‌తో మాత్రమే వరుసగా బౌలింగ్ చేయిస్తూ భారత్ బ్యాటర్లకి కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. న్యూజిలాండ్ టీమ్‌లో టిమ్ సౌథీ ఒక వికెట్ తీయగా.. మాట్ హెన్రీ 5 వికెట్లు, విలియమ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ మొత్తం ఈ ముగ్గురూ తప్ప ఎవరూ బౌలింగ్ చేయలేదు.

ఆ కివీస్ జట్టేనా ఇది?

వాస్తవానికి ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో, అంతక ముందు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోనూ న్యూజిలాండ్ అత్యంత చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. కానీ బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో ఈ జట్టేనా శ్రీలంక చేతిలో ఓడిపోయింది? అనిపించేలా కివీస్ బౌలర్లు బౌలింగ్ చేశారు. మరోవైపు భారత్ జట్టు ఇటీవల బంగ్లాదేశ్‌పై రెండు టెస్టుల సిరీస్‌లో దుమ్ముదులిపేశారు. కానీ రెండు వారాల వ్యవధిలో ఇంత చెత్తగా ఆడుతున్నారేంటి? అనిపించేలా బ్యాటింగ్ చేశారు.

ఛాన్స్ వేస్ట్ చేసుకున్న సర్ఫరాజ్

భారత్ జట్టు ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రాగా.. శుభమన్ గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు. కానీ.. మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ 3 బంతులే ఆడి పేలవ షాట్‌తో డకౌట్‌గా వెనుదిరిగాడు. శుభమన్ గిల్‌కి మెడ నొప్పి ఉండటంతో చాలా రోజుల తర్వాత మళ్లీ సర్ఫరాజ్ ఖాన్‌కి అవకాశం దక్కింది. కానీ ఆ ఛాన్స్‌ను వేస్ట్ చేసుకున్నాడు.

తదుపరి వ్యాసం