Ind vs NZ 1st Test Day 1: ఒక్క బాల్ కూడా పడకుండానే.. ఇండియా, న్యూజిలాండ్ తొలి టెస్టు తొలి రోజు ఆట రద్దు
Ind vs NZ 1st Test Day 1: ఇండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు తొలి రోజు ఆట ఒక్క బాల్ కూడా పడకుండానే రద్దయింది. బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షం కారణంగా బుధవారం (అక్టోబర్ 16) తొలి రోజు ఆట కాదు కదా కనీసం టాస్ కూడా సాధ్యం కాలేదు.
Ind vs NZ 1st Test Day 1: అనుకున్నదే జరిగింది. బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాలు ఇండియా, న్యూజిలాండ్ తొలి టెస్టుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తొలి రోజు కనీసం టాస్ కూడా పడకుండానే ఆటను రద్దు చేశారు. ఉదయం నుంచీ ఆగకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తొలి రోజు ఆట రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
వదలని వర్షం..
ఇండియా, న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా బెంగళూరులో బుధవారం (అక్టోబర్ 16) నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తుఫాను కారణంగా కొన్ని రోజులుగా ఇక్కడ కురుస్తున్న భారీ వర్షాలు ఈ టెస్టుకు అడ్డంకిగా మారొచ్చని ముందే అంచనా వేశారు. ఊహించినట్లే తొలి రోజే కనీసం టాస్ కూడా పడకుండానే ఆట రద్దయింది.
బుధవారం ఉదయం నుంచి వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. దీంతో గ్రౌండ్లో నుంచి కవర్లను తొలగించనే లేదు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పరిస్థితి కాస్త మెరుగువుతుందని భావించినా.. వర్షం తగ్గనే లేదు. దీంతో 2.30 గంటల సమయంలో అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ కాసేపటికే మరోసారి కుండపోతగా వర్షం కురిసింది.
రెండో రోజూ కష్టమేనా?
తొలి రోజు కనీసం టాస్ కూడా పడకుండానే ఆటను రద్దు చేయడంతో రెండో రోజు 15 నిమిషాల ముందుగానే అంటే 9.15 గంటలకే మ్యాచ్ ప్రారంభించాలని అంపైర్లు నిర్ణయించారు. రెండో రోజు మొత్తం 98 ఓవర్లు వేయనున్నారు.
అయితే గురువారం (అక్టోబర్ 17) కూడా వాతావరణ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. రెండో రోజు కూడా ఆటకు వర్షం అడ్డు తగిలేలా ఉంది. దీంతో ఈ మ్యాచ్ రెండో రోజు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు.
బంగ్లాదేశ్ తో రెండు టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన తర్వాత న్యూజిలాండ్ సిరీస్ కు టీమిండియా కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతోంది. ఈ మూడు టెస్టుల సిరీస్ ను కూడా స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన ఉండటంతో కీలకంగా మారింది.
టీమిండియా ఇదే
రోహిత్ శర్మ, బుమ్రా, ఆకాశ్ దీప్, అశ్విన్, జడేజా, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లి, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్
న్యూజిలాండ్ టీమ్ ఇదే
టామ్ లేథమ్, టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవోన్ కాన్వే, జాకబ్ డఫ్ఫీ, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విలియం ఒరౌర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్