Bangladesh Test Squad: భారత్‌తో సిరీస్‌కి బంగ్లాదేశ్ టెస్టు టీమ్ ప్రకటన, గాయంతో దూరమైన పేసర్
12 September 2024, 14:57 IST
IND vs BAN Test Series 2024: పాకిస్థాన్ జట్టుని దాని సొంతగడ్డపైనే ఓడించిన బంగ్లాదేశ్ టీమ్‌నే దాదాపుగా భారత్‌తో సిరీస్‌కి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. సెప్టెంబరు 19 నుంచి చెన్నై, కాన్పూర్ వేదికగా రెండు టెస్టుల్లో టీమిండియాతో బంగ్లాదేశ్ తలపడనుంది.
బంగ్లాదేశ్ టెస్టు టీమ్
India vs Bangladesh Test 2024: భారత్‌తో టెస్టు సిరీస్‌కి బంగ్లాదేశ్ టీమ్‌ను గురువారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ప్రకటించింది. పాకిస్థాన్‌తో ఇటీవల తొలి టెస్టులో సత్తాచాటిన ఫాస్ట్ బౌలర్ షోరిఫుల్ ఇస్లాం గాయం కారణంగా ఈ సిరీస్‌కి దూరమయ్యాడు. పాకిస్థాన్ జట్టుని రెండు టెస్టుల సిరీస్‌లో దాని సొంతగడ్డపైనే బంగ్లాదేశ్ ఓడించిన విషయం తెలిసిందే. భారత్‌తో సెప్టెంబరు 19 నుంచి రెండు టెస్టులను బంగ్లాదేశ్ టీమ్ ఆడనుంది.
పాకిస్థాన్‌తో రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో మూడు వికెట్లు పడగొట్టిన 23 ఏళ్ల షోరిఫుల్.. పాక్ బ్యాటర్లకి సవాల్ విసురుతూ కనిపించాడు. కానీ.. గాయంతో రెండో టెస్టుకి అతను దూరమయ్యాడు.
భారత్ పర్యటన కోసం 16 మంది సభ్యులతో కూడిన బంగ్లాదేశ్ టెస్టు జట్టును ప్రకటించిన అనంతరం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పేసర్ షోరిఫుల్ ఇస్లాం గాయంపై కూడా క్లారిటీ ఇచ్చింది. అతను గజ్జలో గాయం నుంచి ఇంకా కోలుకుంటున్నాడని.. అందుకే సిరీస్‌కి ఎంపిక చేయలేదని ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.
పాకిస్థాన్‌పై రెండో టెస్టులో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించిన లిట్టన్ దాస్ రెగ్యులర్ వికెట్ కీపర్‌గా టీమ్‌లో ఉన్నప్పటికీ.. రెండో వికెట్ కీపర్‌గా జకర్ అలీ అనిక్‌ను బంగ్లాదేశ్ టీమ్‌లోకి తీసుకుంది.
సెప్టెంబర్ 19న భారత్, బంగ్లాదేశ్ మధ్య చెన్నై వేదికగా తొలి టెస్టు, 27న కాన్పూర్‌లో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌లో కూడా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
బంగ్లాదేశ్ టెస్టు జట్టు
నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్లా హసన్ జాయ్, జాకీర్ హసన్, షాద్మన్ ఇస్లాం, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహీద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్, జాకర్ అలీ అనిక్ (వికెట్ కీపర్)
నాలుగు రోజుల క్రితమే 16 మందితో కూడిన భారత టెస్టు జట్టుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. టీమ్‌లోకి రిషబ్ పంత్ రీఎంట్రీ ఇవ్వగా.. సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
భారత టెస్టు జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), ఆర్.అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాళ్