Kohli: విరాట్ కోహ్లీని లండన్‌లోనే వదిలేసి.. ముంబయికి ఒంటరిగా వచ్చేసిన అనుష్క శర్మ-team india cricketer virat kohli spotted in london first time since anushka sharma return to mumbai ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kohli: విరాట్ కోహ్లీని లండన్‌లోనే వదిలేసి.. ముంబయికి ఒంటరిగా వచ్చేసిన అనుష్క శర్మ

Kohli: విరాట్ కోహ్లీని లండన్‌లోనే వదిలేసి.. ముంబయికి ఒంటరిగా వచ్చేసిన అనుష్క శర్మ

Galeti Rajendra HT Telugu
Sep 08, 2024 11:29 AM IST

Anushka Sharma: విరాట్ కోహ్లీ లండన్‌లో ఒంటరిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆగస్టులో భార్య అనుష్క శర్మతో కలిసి అక్కడికి వెళ్లిన కోహ్లీ.. ఇటీవల ముంబయికి అనుష్క వచ్చేసినా అక్కడే ఉంటున్నాడు.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ (Instagram)

Virat Kohli in London: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ముంగిట భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆగస్టులో శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ లండన్‌కి వెకేషన్‌కి వెళ్లాడు. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోల్ని కూడా ఈ జంట షేర్ చేసింది.

కానీ.. యాడ్ షూట్ కారణంగా విరాట్ కోహ్లీని అక్కడే వదిలేసిన అనుష్క శర్మ ఒంటరిగా ముంబయికి వచ్చేసింది. ఈ మేరకు ఈ బాలీవుడ్ హీరోయిన్ కొన్ని ప్రచార కార్యక్రమాల్లో కనిపించింది. అయితే కోహ్లీ మాత్రం ఇంకా ముంబయికి రాలేదు. లండన్‌లో ఒక అభిమాని విరాట్ కోహ్లీతో ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. కోహ్లీ ఇంకా అక్కడే ఉన్నట్లు క్లారిటీ వచ్చింది.

త్వరలోనే భారత్ జట్టు ఎంపిక

బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. మరో రెండు రోజుల్లోనే ఈ సిరీస్‌లో ఆడే భారత్ జట్టుని సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. ఈ టీమ్ ఎంపికకి ప్రస్తుతం బెంగళూరు, అనంతపురం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ- 2024లో ఆటగాళ్ల ప్రదర్శనని పరిగణలోకి తీసుకోనున్నారు. కానీ విరాట్ కోహ్లీకి మాత్రం ఈ ట్రోఫీ నుంచి మినహాయింపు ఇచ్చారు.

పాకిస్థాన్ జట్టుని దాని సొంతగడ్డపైనే టెస్టు సిరీస్‌లో చిత్తు చేసిన బంగ్లాదేశ్ టీమ్ ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. దాంతో రెండు టెస్టు సిరీస్‌లో ఆ జట్టుని ఓడించడం టీమిండియాకి కూడా అంత సులువు కాదు. ఆ జట్టులోని సీనియర్లకి ఐపీఎల్‌ రూపంలో భారత్ పిచ్‌లపై మంచి అవగాహన ఉంది. మరీ ముఖ్యంగా.. స్పిన్నర్లతో టీమిండియా బ్యాటర్లకి ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్‌కి కనీసం వారం రోజుల ముందే ఆటగాళ్లు చెన్నైలోని క్యాంప్‌కి హాజరుకానున్నారు.

లాస్ట్ సిరీస్‌లో విఫలం

వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ.. గత జనవరి నుంచి రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు. అలానే ఇటీవల శ్రీలంక పర్యటనలోనూ కోహ్లీ నిరాశపరిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ కోహ్లీ కేవలం 24, 14, 20 పరుగులే చేయగలిగాడు. దాంతో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కి ముందు తగినంత విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ.. సత్తాచాటే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు 113 టెస్టు మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 8,848 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో ఆఖరిగా టెస్టు మ్యాచ్ ఆడిన కోహ్లీ ఆశించిన మేర సత్తాచాటలేకపోయాడు.

టాప్‌లో విరాట్ కోహ్లీ

ఫార్చ్యూన్ ఇండియా ఇటీవల విడుదల చేసిన జాబితా ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధిక పన్ను చెల్లించే క్రీడాకారుడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ స్టార్ క్రికెటర్ రూ.66 కోట్లు పన్ను చెల్లించాడు.