Babar Azam: పాకిస్థాన్ టీమ్‌లో కెప్టెన్సీ కోసం మళ్లీ కుర్చీలాట.. బాబర్ అజామ్‌పై వేలాడుతున్న వేటు కత్తి?-pakistan skipper babar azam likely to be sacked as captain again ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Babar Azam: పాకిస్థాన్ టీమ్‌లో కెప్టెన్సీ కోసం మళ్లీ కుర్చీలాట.. బాబర్ అజామ్‌పై వేలాడుతున్న వేటు కత్తి?

Babar Azam: పాకిస్థాన్ టీమ్‌లో కెప్టెన్సీ కోసం మళ్లీ కుర్చీలాట.. బాబర్ అజామ్‌పై వేలాడుతున్న వేటు కత్తి?

Galeti Rajendra HT Telugu
Sep 07, 2024 12:10 PM IST

Pakistan Captain: పాకిస్థాన్ టీమ్‌‌కి మళ్లీ కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. గత ఏడాది బాబర్ అజామ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. షాహిన్ షా అఫ్రిది, షాన్ మసూద్ చేతికి పగ్గాలు వెళ్లాయి. కానీ ఈ ఏడాది మళ్లీ కెప్టెన్‌ని పాక్ మార్చింది.

బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్
బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ (AFP)

పాకిస్థాన్‌ క్రికెట్ టీమ్‌లో కెప్టెన్సీ కోసం మళ్లీ కుర్చీలాట మొదలైంది. గత ఏడాది వన్డే వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ అజామ్ తప్పుకోవడంతో ఫాస్ట్ బౌలర్ షహీన్‌ షా అఫ్రిది చేతికి పగ్గాలు వచ్చాయి. కానీ ఒక్క సిరీస్ ముగియగానే మళ్లీ కెప్టెన్సీ చేతులు మారిపోయింది.

టీ20 వరల్డ్‌కప్ ముంగిట బాబర్ అజామ్ చేతికి మళ్లీ పాక్ టీమ్ పగ్గాలు రాగా.. ఇప్పుడు టెస్టు టీమ్‌కి షాన్ మసూద్‌ను సారథ్యం వహిస్తున్నాడు. అయితే ఆస్ట్రేలియాతో ఈ ఏడాది జరగనున్న సిరీస్‌కి ఈ ఇద్దరినీ కూడా తప్పించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది పాక్ వేదికగానే ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనుంది.

బాబర్‌ని వెంటాడుతున్న బ్యాడ్ లక్

పాకిస్థాన్ హెడ్ కోచ్ గ్యారీ కెరిస్టెన్ ఇప్పటికే జూలైలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారులతో రిజ్వాన్‌ చేతికి పగ్గాలు ఇవ్వడం గురించి చర్చలు జరిపారనే వార్త లీకైంది. అయితే టెస్టుల్లో మహ్మద్ రిజ్వాన్‌కి మెరుగైన రికార్డ్ లేకపోవడం, అతను ఇప్పుడు ఫామ్‌ కూడా కోల్పోవడంతో కెప్టెన్సీ ప్రకటనని తాత్కాలికంగా వాయిదా వేశారట.

బాబర్ అజామ్ కూడా ఇప్పుడు కెరీర్‌లోనే అత్యంత పేలవ ఫామ్‌తో తంటాలు పడుతున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో అతని అత్యధిక స్కోరు 31 పరుగులు మాత్రమే. తొలి టెస్టులో 0, 22 పరుగులు, రెండో టెస్టులో 31, 11 పరుగులు మాత్రమే బాబర్ చేశాడు. దాంతో పాకిస్థాన్ టెస్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న సౌద్ షకీల్‌తో పాటు షాదాబ్ ఖాన్, మహ్మద్ హారిస్, మహ్మద్ రిజ్వాన్‌లో ఒకరిని ఛాంపియన్స్‌ ట్రోఫీ సమయానికి కెప్టెన్‌గా ఎంపిక చేయాలని హెడ్ కోచ్ చెప్పినట్లు తెలుస్తోంది.

డ్రెస్సింగ్ రూములో గొడవ

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్ రెండుగా చీలిపోయిందనే ఆరోపణలు వచ్చాయి. టీ20 కెప్టెన్‌గా ఉన్న బాబర్ అజామ్‌, ఒక్క సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాస్ట్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది మధ్య సఖ్యత కుదరడం లేదట. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బంగ్లాతో రెండో టెస్టులో షాహిన్ షా అఫ్రిదిని తుది జట్టు నుంచి తప్పించగా.. తెరవెనుక బాబర్ అజామ్ ఉన్నాడనే ఆరోపణలూ వినిపించాయి. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోవడంతో బాబర్ అజామ్‌పై విమర్శలు పతాక స్థాయికి చేరాయి.

ఒక్క సిరీస్‌కే ఛాన్స్

వాస్తవానికి గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనకి బాధ్యత వహిస్తూ మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ నుంచి బాబర్ అజామ్ వైదొలిగాడు. దాంతో అప్పట్లో మహ్మద్ రిజ్వాన్‌ను కెప్టెన్‌గా నియమించాలని పాక్ మాజీ క్రికెటర్లు సూచించారు.

కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఫాస్ట్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది చేతికి పగ్గాలు ఇచ్చింది.అయితే ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో పాకిస్థాన్ 1-4 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దాంతో పునరాలోచనలో పడిన పాక్ బోర్డు టీ20 వరల్డ్‌కప్‌కి సరిగ్గా రెండు నెలల ముందు బాబర్ అజామ్ చేతికి మళ్లీ వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలను ఇచ్చింది.

మారని పాక్ ఆట

బాబర్ మళ్లీ పగ్గాలు అందుకున్నా పాక్ జట్టు ఆట తీరు మారలేదు. దానికితోడు టీమ్‌లో బాబర్, షాహిన్ అఫ్రిది రెండు వర్గాలుగా విడిపోయి జట్టులో చీలిక తెచ్చారు. దాంతో పాకిస్థాన్ టీమ్ బంగ్లాదేశ్ లాంటి టీమ్ చేతిలో అది కూడా సొంతగడ్డపై చిత్తుగా ఓడింది.

పాకిస్థాన్ జట్టుని ఇప్పుడు గాడిలో పెట్టాలంటే బాబర్ అజామ్, షాహిన్ షా అఫ్రిదికి కాకుండా మూడో క్రికెటర్‌ చేతికి పగ్గాలు ఇవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు యోచిస్తోంది. అయితే రేసులో దాదాపు 4-5 మంది క్రికెటర్లు ఉన్నారు. మరి చూడాలి ఈ కెప్టెన్సీ కుర్చీలాటలో ఎవరు గెలుస్తారో.

Whats_app_banner