Virat Kohli: విరాట్ కోహ్లీకి పాకిస్థాన్ నుంచి పెరిగిపోతున్న రిక్వెస్ట్‌లు.. మాట సాయం చేయాలట
Babar Azam: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. రెండేళ్ల నుంచి ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న బాబర్ అజామ్.. కెప్టెన్సీని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అతనికి విరాట్ కోహ్లీ సపోర్ట్ ఇవ్వాలని పాక్ అభిమానులు కోరుతున్నారు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి పాకిస్థాన్ నుంచి రోజురోజుకీ రిక్వెస్ట్‌లు పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ఫామ్ కోల్పోగా.. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో 0-2తో పాకిస్థాన్ వైట్‌వాష్‌కి గురైంది. దాంతో పాకిస్థాన్ అభిమానులు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీని ట్యాగ్ చేస్తూ.. కష్టాల్లో ఉన్న మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌కి మోరల్ సపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నారు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం హాలిడే ట్రిప్‌లో ఉన్నాడు. కుటుంబంతో కలిసి లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. దాంతో త్వరలోనే భారత్‌కి రానున్న విరాట్ కోహ్లీ.. సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నాడు. అయితే ఇదే సమయంలో దాయాది దేశ అభిమానులు.. తమ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌కి మద్దతుగా నిలవాలని కోరుతున్నారు.
కోహ్లీకి అప్పట్లో బాబర్ సపోర్ట్
వాస్తవానికి విరాట్ కోహ్లీ రెండేళ్ల క్రితం ఇలానే ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడ్డాడు. ఆ దశలో బాబర్ మద్దతుగా నిలిచాడు. ‘‘కష్టం కాలం గడిచిపోతుంది.. ధైర్యంగా ఉండు విరాట్ కోహ్లీ’’ అని ఎక్స్‌లో బాబర్ అజామ్ అప్పట్లో మద్దతుగా నిలిచాడు. దానికి కోహ్లీ కూడా ‘‘థ్యాంక్యూ’’ అని రిప్లై ఇచ్చాడు. ఫామ్ కోల్పోవడంతో విరాట్ కోహ్లీ అప్పట్లో మానసికంగా పూర్తిగా అలసిపోయినట్లు కనిపించాడు. తక్కువ స్కోరుకే వరుసగా ఔట్ అవుతున్నప్పుడు.. తన నిస్సహాయతని గ్రౌండ్‌లోనే కొన్నిమ్యాచ్‌ల్లో చూపించాడు. అయితే.. 2022 ఆసియా కప్‌కి ముందు కొన్ని రోజులు క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్న విరాట్ కోహ్లీ.. రీఎంట్రీ తర్వాత అదరగొట్టేశాడు.
ఆసియా కప్ ఆరంభానికి ముందు బాబర్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అలానే పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదితో కూడా సరదాగా మాట్లాడాడు. ఆ టోర్నమెంట్‌నే తన తొలి టీ20 సెంచరీ నమోదు చేసిన కోహ్లీ.. పాకిస్తాన్‌పై కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి దాయాదిపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఇక అక్కడి నుంచి కోహ్లీ జోరు మొన్నటి టీ20 వరల్డ్‌కప్ వరకూ కొనసాగుతూనే ఉంది.
గాడి తప్పిన బాబర్ కెరీర్
బాబర్ అజామ్ గత రెండేళ్లుగా పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్నాడు. టెస్టుల్లో చివరిగా అతను 2022 డిసెంబర్‌లో శ్రీలంకపై సెంచరీ సాధించాడు. ఆ తర్వాత బాబర్ టెస్టుల్లో అర్ధశతకం సాధించి 616 రోజులు కావస్తోంది. ఫామ్ కోల్పోవడంతో బాబర్ కెప్టెన్సీని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా అతను టచ్‌లోకి రాలేకపోయాడు. బంగ్లాదేశ్ చేతిలో వైట్‌వాష్ బాబర్ అజామ్‌పై ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఈ దశలో బాబర్‌కి కోహ్లీ మద్దతు ఇవ్వాలని పాకిస్థాన్ అభిమానులు కోరుతున్నారు.
నిజానికి ఇదే పాక్ అభిమానులు విరాట్ కోహ్లీతో బాబర్‌ను పోలుస్తూ రెండేళ్ల క్రితం వరకు సోషల్ మీడియాలో వెటకారం చేశారు. కోహ్లీ కంటే తమ బాబర్ బెస్ట్ బ్యాటర్ అంటూ కవ్వింపులకి దిగారు. కానీ ఇప్పుడు అదే బాబర్ కోసం కోహ్లీ సపోర్ట్‌ని కోరుతున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య చాలా ఏళ్లుగా ఎలాంటి సిరీస్ జరగడం లేదు. కేవలం ఆసియా, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు దాయాది దేశాలు తలపడుతున్నాయి. మరి చూడాలి.. బాబర్‌కి సపోర్ట్‌గా విరాట్ కోహ్లీ స్పందిస్తాడో లేదా మౌనంగా ఉండిపోతాడో..!