India Squad For 1st Test: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆ ఇద్దరు ఆడటం డౌటే.. భారత్ తుది జట్టుపై బ్రాడ్ హగ్ జోస్యం-kl rahul dropped from india vs bangladesh by brad hogg ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Squad For 1st Test: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆ ఇద్దరు ఆడటం డౌటే.. భారత్ తుది జట్టుపై బ్రాడ్ హగ్ జోస్యం

India Squad For 1st Test: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆ ఇద్దరు ఆడటం డౌటే.. భారత్ తుది జట్టుపై బ్రాడ్ హగ్ జోస్యం

Galeti Rajendra HT Telugu
Sep 11, 2024 12:36 PM IST

India Squad For 1st Test vs Bangladesh: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకి భారత్ తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రిషబ్ పంత్ రీఎంట్రీ, సర్ఫరాజ్ ఖాన్ ఫామ్‌లో ఉండటంతో ఈ ఇద్దరి కోసం ఎవరిని జట్టు నుంచి తప్పిస్తారో చూడాలి.

భారత టెస్టు జట్టు
భారత టెస్టు జట్టు (PTI)

IND vs BAN 1st Test: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే 16 మందితో కూడిన భారత్ జట్టును ప్రకటించింది. కానీ 16 మంది నుంచి తుది జట్టుని ఎంపిక చేయడం ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మకి పెద్ద టాస్క్‌లా కనిపిస్తోంది. సెప్టెంబర్ 19న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.

వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదం తర్వాత తొలిసారి టెస్టుల్లో పునరాగమనం చేయనుండగా.. 2024 టీ20 వరల్డ్‌కప్‌లో ఆశించిన మేర సత్తాచాటలేకపోయాడు. వాస్తవానికి కారు ప్రమాదానికి ముందు రిషబ్ పంత్ టెస్టుల్లో మెరుగైన ఫామ్‌లో కనిపించాడు.

ఇటీవల దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రిషబ్ పంత్.. మరోసారి రెడ్ బాల్ క్రికెట్‌లో తన రీఎంట్రీని ఘనంగా చాటాలని ఆశిస్తున్నాడు. మరోవైపు వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరమైన విరాట్ కోహ్లీ కూడా టెస్టు జట్టులోకి తిరిగొస్తున్నాడు. దాంతో అతను ఆటోమేటిక్‌గా తుది జట్టులోకి రానున్నాడు. కానీ.. చెన్నై టెస్టుకు మిడిలార్డర్, బౌలింగ్ అటాక్‌ను ఎంపిక చేయడానికి టీమ్ మేనేజ్‌మెంట్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

తుది జట్టులో ఆ ఇద్దరికి నో ప్లేస్

ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ తొలి టెస్టు కోసం భారత్ తుది జట్టుని ఎంపిక చేశాడు. అయితే అతను ఎంపిక చేసిన జట్టులో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌కి చోటు దక్కలేదు. కేఎల్ రాహుల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను బ్రాడ్ హగ్ ఎంపిక చేశాడు.

‘‘తొలి టెస్టులో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ భారత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత శుభమన్ గిల్ నెం.3, విరాట్ కోహ్లీ 4, రవీంద్ర జడేజా 5లో ఆడతారు. ఇక ఇక్కడి నుంచి రిషబ్ పంత్ బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి నెట్టి.. సర్ఫరాజ్ ఖాన్‌ను నెం.6లో, రిషబ్ పంత్‌ను నెం.7లో ఆడించాలి. దీని వల్ల లెప్ట్, రైట్ కాంబినేషన్ కుదురుతుంది. ఆ తర్వాత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా ఉంటారు' అని హగ్ తన యూట్యూబ్ ఛానల్‌లో తుది జట్టు ఎంపిక గురించి చెప్పుకొచ్చాడు.

బంగ్లాదేశ్‌తో సిరీస్ మాత్రమే కాదు.. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌కి తుది జట్టులో చోటివ్వవనని బ్రాడ్ హగ్ చెప్పుకొచ్చాడు.

అక్షర్‌కి మెరుగైన టెస్టు రికార్డ్

వాస్తవానికి అక్షర్ పటేల్‌కి టెస్ట్ క్రికెట్‌లో మెరుగైన రికార్డ్ ఉంది. 14 మ్యాచ్‌ల్లో 55 వికెట్లు పడగొట్టాడు. అలానే లోయర్ మిడిలార్డర్‌లో అతను నిలకడగా బ్యాటింగ్ కూడా చేయగలడు. దాంతో భారత్ బ్యాటింగ్ కూడా బలపడుతుంది. మరోవైపు కేఎల్ రాహుల్ గత కొన్నేళ్లుగా భారత టెస్టు జట్టులో అంతర్భాగంగా ఉన్నాడు. సెప్టెంబర్ 19న తొలి టెస్టు.. ఆ తర్వాత సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో రెండో టెస్టు జరగనుంది. ఇటీవల పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపైనే ఓడించిన బంగ్లాదేశ్ టీమ్.. భారత్‌లోనూ సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది.