R Ashwin: ధోనీని అన్‍క్యాప్డ్ ప్లేయర్‌గా తీసుకునే అంశంపై స్పందించిన స్టార్ స్పిన్నర్ అశ్విన్
R Ashwin: ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోనీ ఆడడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే, అతడిని వచ్చే సీజన్ కోసం అన్‍క్యాప్డ్ ప్లేయర్‌గా తీసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ విషయంపై స్టార్ స్పిన్నర్ అశ్విన్ తాజాగా స్పందించాడు.
వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున మహేంద్ర సింగ్ ధోనీ ఆడతాడా లేదా అనేదే ఉత్కంఠగా ఉంది. ఈ ఏడాది సీజన్‍కు ముందే రుతురాజ్ గైక్వాడ్‍కు కెప్టెన్సీ అప్పగించాడు ధోనీ. అలాగే అతడి ఫిట్‍నెస్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. బ్యాటింగ్‍కు కూడా చివర్లో వచ్చాడు. దీంతో ఐపీఎల్‍కు కూడా ధోనీ గుడ్‍బై చెప్పేస్తాడనే రూమర్లు వస్తున్నాయి. అయితే, మెగా వేలం ఉండటంతో ఈ సందిగ్ధత ఉంకా కొనసాగుతోంది.
అయితే, బీసీసీఐతో ఇటీవల జరిగిన ఫ్రాంచైజీల సమావేశంలో సీఎస్‍కే ఓ కీలక ప్రతిపాదన చేసింది. ఎంఎస్ ధోనీని అన్‍క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించాలని కోరింది. ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడని వారిని కూడా 2021 వరకు అన్‍క్యాప్డ్ ప్లేయర్‌గా బీసీసీఐ పరిగణించేది. అయితే, ఆ తర్వాత దాన్ని పదేళ్లకు పెంచింది. అయితే, మళ్లీ పాతరూల్ తీసుకురావాలని సీఎస్‍కే కోరింది. ఈ రూల్ మళ్లీ సవరిస్తే ధోనీని అన్‍క్యాప్డ్ ప్లేయర్‌గా తీసుకునే ఛాన్స్ సీఎస్‍కేకు ఉంటుంది. దీనిపై కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. భారత స్టార్ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ ఆర్.అశ్విన్ కూడా తాజాగా స్పందించాడు.
పాయింట్ కరెక్టే
ధోనీ చాలా ఏళ్ల క్రితమే (2020లో) అంతర్జాతీయ క్రికెట్‍కు వీడ్కోలు పలికాడని, అతడిని అన్‍క్యాప్ట్ ప్లేయర్‌గా తీసుకోవాలనుకునే పాయింట్ సరైనదేనని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‍లో అన్నారు. “ధోనీ అన్‍క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడతాడా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. అయితే, ఈ పాయింట్ కరెక్టే. చాలా ఏళ్లుగా అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడడం లేదు. అతడు రిటైర్ అయ్యాడు. అందుకే ఇప్పుడు అతడు అన్‍క్యాప్డ్ ప్లేయరే. అతడు ప్రస్తుతం క్యాప్డ్ ప్లేయర్ కాదు” అని అశ్విన్ చెప్పాడు.
ధోనీ లాంటి దిగ్గజ ఆటగాడు అన్‍క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడతాడా అనేది వేరే అంశమని అశ్విన్ చెప్పాడు. ధోనీ గురించి ఎవరైనా మాట్లాడితే సాధారణంగా అందరూ చర్చిస్తారని అతడు అన్నాడు.
అలా జరిగితే రాజస్థాన్‍కే మేలు
ఐపీఎల్ 2025 సీజన్ కోసం రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్య పెంచితే రాజస్థాన్ రాయల్స్ జట్టుకే మేలు జరుగుతుందని అశ్విన్ చెప్పాడు. ఇతర జట్ల కంటే రాజస్థాన్ సంతోషిస్తుందని అన్నారు. “ఒకవేళ 7-8 రిటెన్షన్స్ ఇస్తే రాజస్థాన్ రాయల్స్ అన్ని జట్లను చూసి నవ్వుతుంది. ఎందుకంటే రాజస్థాన్‍లో యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, సంజూ శాంసన్, జాస్ బట్లర్, యజువేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెండ్ బౌల్ట్, షిమ్రన్ హిట్మైర్ సహా మరికొందరు ముఖ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. వారిని రిటెన్షన్‍కు ఎంపిక చేసుకుంటే.. ఆ జట్టు కోర్ సెట్ అయినట్టే. వేలంలో ఇద్దరు, ముగ్గురిని తీసుకుంటే సరిపోతుంది” అని అశ్విన్ చెప్పాడు.
ఐపీఎల్ 2025 మెగావేలం నిర్వహించనున్న తరుణంలో ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఎనిమిది మంది వరకు రిటైన్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలని కొన్ని ఫ్రాంచైజీలు కోరుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.