Ind W vs Pak W: పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన ఇండియన్ వుమెన్స్ టీమ్.. ఆసియా కప్‌లో బోణీ
Ind W vs Pak W: వుమెన్స్ ఆసియా కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా బోణీ చేసింది. పాకిస్థాన్ వుమెన్స్ టీమ్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్లతో సులువుగా విజయం సాధించింది.
Ind W vs Pak W: ఇండియన్ వుమెన్స్ టీమ్ మరోసారి సత్తా చాటింది. ఆసియా కప్ 2024లో భాగంగా పాకిస్థాన్ వుమెన్స్ టీమ్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్లతో గెలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన మన టీమ్.. సరిగ్గా ఆ హోదాకు తగిన ఆటతీరుతోనే దాయాదిని చిత్తు చేసింది. 109 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది.
ఇండియన్ టీమ్ బోణీ
వుమెన్స్ ఆసియా కప్ ను చివరిసారి టీమిండియానే గెలిచింది. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగి తొలి మ్యాచ్ లోనే పాకిస్థాన్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ టీమ్.. 19.2 ఓవర్లలో కేవలం 108 పరుగులకే ఆలౌటైంది. స్పిన్నర్ దీప్తి శర్మతోపాటు మిగిలిన బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు ఎదురు నిలవలేకపోయారు.
దీప్తి శర్మ 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం విశేషం. ఇక రేణుకా సింగ్ 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా.. పూజా వస్త్రకర్, శ్రేయాంకా పాటిల్ కూడా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. పాకిస్థాన్ బ్యాటర్లో సిద్రా అమిన్ మాత్రమే 25 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. తూబా హసన్ 22, ఫాతిమా సనా 22 పరుగులు చేశారు.
చెలరేగిన ఓపెనర్లు
109 పరుగుల లక్ష్యాన్ని ఇండియన్ టీమ్ సులువుగా చేజ్ చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధానా చెలరేగిపోయారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 9.3 ఓవర్లలోనే 85 పరుగులు జోడించడంతో టీమిండియా విజయం ఖాయమైంది. షెఫాలీ 29 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్స్ తో 40 పరుగులు చేసింది. ఇక మరో ఓపెనర్ స్మృతి మంధానా 31 బంతుల్లో 9 ఫోర్లతో 45 పరుగులు చేసింది.
ఈ ఇద్దరితోపాటు హేమలత (14) కూడా వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో 85 పరుగులకు వికెట్ నష్టపోకుండా ఉన్న టీమ్.. 102 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్ మరో వికెట్ పడకుండా టీమ్ ను గెలిపించారు. 14.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఇండియన్ టీమ్ 109 పరుగులు చేసింది.