Women’s T20 Asia Cup: వచ్చే నెలలో మరో ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్.. ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ ఇదే
Women’s T20 Asia Cup: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వచ్చే నెలలో మరో ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ వార్ జరగబోతోంది. ఈసారి వుమెన్స్ ఏషియా కప్ లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది.
Women’s T20 Asia Cup: ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ ఏ ఆటలో అయినా, ఎక్కడైనా తలపడుతుంటే దానిపై ఉండే ఆసక్తే వేరు. అందులోనూ క్రికెట్ అంటే దాన్నో యుద్ధంలాగే చూస్తారు. ఈ మధ్యే టీ20 వరల్డ్ కప్ లో భాగంగా దాయాదుల పోరు జరిగింది. ఇక ఇప్పుడు వచ్చే నెలలో వుమెన్స్ ఆసియా కప్ లో భాగంగా ఇండోపాక్ వార్ జరగబోతోంది.
వుమెన్స్ ఏషియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం (జూన్ 25) రాత్రి వుమెన్స్ టీ20 ఏషియా కప్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ మెగా టోర్నీ జులై 19న శ్రీలంకలోని డంబుల్లా స్టేడియంలో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో యూఏఈ, నేపాల్ తలపడనున్నాయి. అయితే తొలి రోజే అంటే జులై 19నే మరో మ్యాచ్ లో ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ ఫైట్ చేయబోతున్నాయి.
ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఇండియన్ వుమెన్స్ టీమ్.. తొలి మ్యాచ్ లోనే దాయాది పాకిస్థాన్ తో ఆడనుండటం గమనార్హం. టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడతుండగా.. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు. ఇండియన్ టీమ్ గ్రూప్ బిలో ఉంది. ఇందులో పాకిస్థాన్, యూఏఈ, నేపాల్ కూడా ఉన్నాయి. ఇక గ్రూప్ ఎలో శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మలేషియా ఉన్నాయి.
ఈ రెండు గ్రూపుల నుంచి టాప్ 2 టీమ్స్ సెమీఫైనల్ వెళ్తాయి. ఫైనల్ జులై 28న జరగనుంది. మొత్తం పది రోజుల్లోనే టోర్నీ ముగుస్తుంది. చివరిసారి 2022లో జరిగిన వుమెన్స్ ఏషియా కప్ లో ఇండియా విజేతగా నిలిచింది. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి ఏడో టైటిల్ గెలిచింది. ఇప్పటి వరకూ అత్యధిక ఏషియా కప్ టైటిల్స్ రికార్డు ఇండియా పేరిటే ఉంది.
ఈ ఏడాది అక్టోబర్ లో వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ జరగనుంది. దీంతో అన్ని జట్లకు ఈ ఆసియా కప్ మంచి సంసిద్ధతగా ఉండనుంది. ఈ ఏడాది మహిళల టీ20 వరల్డ్ కప్ కు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తోంది. ఇక ఆసియా కప్ శ్రీలంకలో జరగబోతోంది.
వుమెన్స్ ఆసియా కప్ 2024 ఇండియా షెడ్యూల్ ఇదే
వుమెన్స్ ఆసియా కప్ 2024లో టీమిండియా గ్రూప్ బిలో ఉంది. లీగ్ స్టేజ్ లో తన గ్రూపులోని మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. తొలి మ్యాచ్ జులై 19న పాకిస్థాన్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక రెండో మ్యాచ్ జులై 21న యూఏఈతో జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. మూడో మ్యాచ్ లో జులై 23న నేపాల్ తో జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇక ఇండియన్ వుమెన్స్ టీమ్ ఈ మధ్యే సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధానా రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన ఈ సిరీస్ ను 3-0తో ఎగరేసుకుపోయింది.