Top 5 B-Schools: జీమ్యాట్ అవసరం లేని అంతర్జాతీయ మేనేజ్మెంట్ కాలేజీలు
17 December 2024, 20:42 IST
Top 5 B-Schools: జీమ్యాట్ స్కోర్ తో సంబంధం లేకుండా అడ్మిషన్ ఇచ్చే పాపులర్ బిజినెస్ స్కూల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ జీమ్యాట్ లేదా వేరే ఏదైనా సంబంధిత పరీక్ష స్కోర్‌లకు బదులుగా, వారు వృత్తిపరమైన విజయాలు, నాయకత్వ నైపుణ్యాలు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను చూస్తారు.
జీమ్యాట్ అవసరం లేని మేనేజ్మెంట్ కాలేజీలు
Top 5 B-Schools: ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఎంబీఏ ఒకటి. అయితే, అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్స్ తమ కాలేజీల్లో ఎంబీఏ అడ్మిషన్లకు జీ మ్యాట్ (GMAT) స్కోర్ ను ప్రామాణికంగా తీసుకుంటాయి. జీమ్యాట్ స్కోర్ తో సంబంధం లేకుండా అడ్మిషన్ ఇచ్చే పాపులర్ బిజినెస్ స్కూల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ జీమ్యాట్ లేదా వేరే ఏదైనా సంబంధిత పరీక్ష స్కోర్‌లకు బదులుగా, వారు వృత్తిపరమైన విజయాలు, నాయకత్వ నైపుణ్యాలు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను చూస్తారు. ప్రాడిజీ ఫైనాన్స్‌లో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సోనాల్ కపూర్, అంతర్జాతీయ విద్యార్థులు జీమ్యాట్ లేకుండా ఎంబీఏ చేసే వీలు కల్పించే ఐదు అత్యంత ప్రసిద్ధ కాలేజీలను వెల్లడించారు. అవేంటో ఇక్కడ చూద్దాం
ఎంఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అమెరికా
ఎంఐటీ స్లోన్ ఫెలోస్ ఎంబీఏ అనేది మిడ్-కెరీర్ నిపుణుల కోసం వారి నాయకత్వ, నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి రూపొందించిన ఒక ఫుల్ టైమ్, ఒక సంవత్సర ప్రొగ్రామ్. ఇందులో చేరాలనుకునేవారికి కనీసం 10 సంవత్సరాల సంబంధిత పని అనుభవం అవసరం. అంతర్జాతీయ విద్యార్థులకు GMAT (ఫోకస్ ఎడిషన్ లేదా 10వ ఎడిషన్) తప్పనిసరి కాదు. మీరు ఈ పరీక్షల్లో దేనినైనా తీసుకున్నట్లయితే, మీరు మీ స్కోర్‌లను అదనపు డేటా పాయింట్‌గా సమర్పించవచ్చు. ఎంఐటీ స్లోన్ ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 బిజినెస్ స్కూల్స్ లో ఒకటి. ఇందులో అడ్మిషన్ల కోసం ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున అప్లికేషన్‌లు వస్తాయి. 2025 క్లాస్ కు సంబంధించి సుమారు 5,317 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడి నుండి కోర్సు పూర్తయినవారికి మంచి ప్లేస్ మెంట్స్ లభించాయి.
ఆండర్సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, లాస్ ఏంజిల్స్, అమెరికా
ప్రధాన వ్యాపార కేంద్రమైన లాస్ ఏంజిల్స్‌లో ఉన్న ఆండర్సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి వ్యాపార పాఠశాలల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఇక్కడ ఫైనాన్స్, మార్కెటింగ్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌తో సహా అనేక MBA స్పెషలైజేషన్ కోర్సులు ఉన్నాయి. ఇందులో కూడా అడ్మిషన్ పొందడానికి జీమ్యాట్ అవసరం లేదు. బదులుగా, జీఆర్ఈ (GRE) లేదా ఎగ్జిక్యూటివ్ అసెస్‌మెంట్ (EA) పరీక్ష స్కోర్‌లను సమర్పించవచ్చు. జీమ్యాట్ స్కోర్ కు బదులుగా తమ విశ్లేషణాత్మక నైపుణ్యాల సాక్ష్యాలను సమర్పించవచ్చు.
ఈఎస్ఎస్ఈసీ బిజినెస్ స్కూల్ (ఆసియా-పసిఫిక్ క్యాంపస్), సింగపూర్
బిజినెస్ స్కూల్స్ లో ESSEC బిజినెస్ స్కూల్ (ఆసియా-పసిఫిక్ క్యాంపస్)లో సింగపూర్ అత్యంత గుర్తింపు పొందింది. ఇక్కడి విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఆరు నెలల్లోనే 91% ప్లేస్‌మెంట్ రేటు, ప్రపంచవ్యాప్తంగా 71,000 మంది పూర్వ విద్యార్ధులకు యాక్సెస్ లభిస్తుంది. ఇది గ్లోబల్ ఎంబీఏ, కొన్ని ఎగ్జిక్యూటివ్ MBA ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్స్ లో ఒకటిగా ర్యాంక్ పొందింది, ESSEC విద్యార్థులను లగ్జరీ, ఫైనాన్స్, కన్సల్టింగ్ రంగాలలో రాణించడానికి నైపుణ్యాలను సమకూర్చుతుంది. జీ మ్యాట్ స్కోర్ లేని విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వారు తమ వృత్తిపరమైన అనుభవం లేదా విద్యాపరమైన ఆధారాలను చూపాలి.
వార్విక్ బిజినెస్ స్కూల్ - యూనివర్శిటీ ఆఫ్ వార్విక్, UK
వార్విక్ విశ్వవిద్యాలయంలోని MBA ప్రోగ్రామ్‌లు ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ఇక్కడి ఫుల్ టైమ్ ఎంబీఏ ప్రొగ్రామ్ తరచుగా UKలోని టాప్ 10, ప్రపంచవ్యాప్తంగా టాప్ 50లో స్థానం పొందుతుంది. ఇక్కడి MBA ప్రోగ్రామ్‌లకు దరఖాస్తుదారులు GMAT, GRE లేదా వార్విక్ టెస్ట్ ల్లో ఏదైనా ఒక ప్రామాణిక పరీక్షలలో ఒకదాని నుండి చెల్లుబాటు అయ్యే స్కోర్‌ను సమర్పించాలి. కనీస స్కోర్ అవసరం లేనప్పటికీ పాఠశాలలో MBA ప్రోగ్రామ్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. క్లాసిక్ GMATకి ప్రస్తుత తరగతి సగటు 670 మరియు GMAT ఫోకస్ ఎడిషన్‌కు 615. GRE కోసం, వెర్బల్ రీజనింగ్ మరియు క్వాంటిటేటివ్ రీజనింగ్ రెండింటిలోనూ 160 స్కోర్ పోటీగా పరిగణించబడుతుంది.
ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ - కాలేజ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్, ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో ఉన్న ANU ఆస్ట్రేలియాలో 1వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 30వ స్థానంలో ఉంది (QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025). ANU MBA ప్రోగ్రామ్‌కు సాంప్రదాయకంగా GMAT స్కోర్ (కనిష్టంగా 600) అవసరం అయితే, ఇది నిర్దిష్ట పరిస్థితులలో GMAT లేకుండా అభ్యర్థులను అంగీకరించవచ్చు.