Renault Kardian : రెనాల్ట్ నుంచి సరికొత్త ఎస్యూవీ.. ‘కార్డియన్’ వచ్చేస్తోంది!
16 October 2023, 17:30 IST
- Renault Kardian : కార్డియన్ ఎస్‌యూవీని.. త్వరలోనే అంతర్జాతీయంగా ఆవిష్కరించనుంది రెనాల్ట్ సంస్థ. ఈ ఎస్యూవీ వివరాల్లోకి వెళితే..
రెనాల్ట్ నుంచి సరికొత్త ఎస్యూవీ..
Renault Kardian : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రెనాల్ట్ నుంచి ఓ కొత్త ఎస్యూవీ రాబోతోంది. దీని పేరు రెనాల్ట్ కార్డియన్. ఇదొక ఎంట్రీ లెవల్ ఎస్యూవీ. ఈ నెల 25న.. ఈ మోడల్ని అంతర్జాతీయంగా ఆవిష్కరించనుంది రెనాల్ట్ సంస్థ. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
రెనాల్ట్ కొత్త ఎస్యూవీ ఎలా ఉంటుంది..?
ఈ కార్డియన్ ఎస్‌యూవీకి సంబంధించి.. ఇప్పటికే కొన్ని టీజర్స్‌ని విడుదల చేసింది రెనాల్ట్. వీటి ద్వారా పలు కీలక ఫీచర్స్ బయటపడ్డాయి. ఈ రెనాల్ట్ కార్డియన్ సైజు.. రెనాల్ట్ ఖైగర్ను పోలి ఉంది. అయితే.. సౌత్ అమెరికా మార్కెట్‌ను ఉద్దేశించి ఈ కొత్త మోడల్‌ను సంస్థ రూపొందించిందట. అక్కడ మార్కెట్ షేరును పెంచుకునేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందని భావిస్తోంది.
రెనాల్ట్కు డాసియా అనే బ్రాండ్ ఉంది. ఈ డాసియా నుంచి సాండెరో స్టెప్‌వే అనే వెహికిల్ ఉండేది. ఇక కొత్తగా తయారవుతున్న కార్డియన్.. ఈ సాండెరో స్టెప్వేతో పోలి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఎస్‌యూవీలో స్ల్పిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డబుల్ లేయర్డ్ గ్రిల్, రూఫ్ రెయిల్స్ వంటివి వస్తున్నాయి. ఎక్స్టీరియర్లో బ్లాక్ క్లాండింగ్ని చూడవచ్చు. వీల్ ఆర్చీస్, బంపర్స్ చుట్టు ఇది ఉంటుంది.
Renault Kardian launch date : ఇక ఈ రెనాల్ట్ కార్డియన్ ఇంటీరియర్ విషయానికొస్తే.. ఇందులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, డ్రైవ్ మోడ్ సెలక్టర్, 4 స్పోక్ స్టీరింగ్ వీల్, యాంబియెంట్ లైటింగ్ వంటివి ఉంటాయని సంస్థ రిలీజ్ చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది.
అయితే.. ఈ కారులో ఉపయోగించే ఇంజిన్‌పై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. కాకపోతే.. ఇందులో 1.0 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మరి ఇది రెనాల్ట్ ఖైగర్లో ఉన్న 1.0 లీటర్ టర్పోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్యేనా? లేక కొత్తదా? అన్నది చూడాలి.
Renault Kardian features : ఈ కార్డియన్ ఎస్యూవీ ఇండియాలో అడుగుపెట్టడం దాదాపు అసాధ్యమే అని తెలుస్తోంది. ఎందుకంటే.. ఇండియా మార్కెట్లో ఇప్పటికే ఖైగర్ మోడల్‌కు మంచి డిమాండ్ ఉంది. పైగా ఈ కార్డియన్ను సీఎంఎఫ్-బీ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తోంది సంస్థ. ఇండియాలో ఉన్న ఖైగర్, ట్రైబర్, నిస్సాన్ మాగ్నైట్‌లను సీఎంఎఫ్- ఏ+ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తోంది. సీఎంఎఫ్-బీ అనేది కాస్త అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే దీనిని ఇండియాలోకి తీసుకురాకపోవచ్చు.
కార్డియన్ను తీసుకురాకపోయినా.. ఇండియా కోసం పక్కా ప్లాన్‌ను తయారు చేసుకుంది రెనాల్ట్. సరికొత్త డస్టర్ ఎస్‌యూవీని సంస్థ సిద్ధం చేస్తోందట. రానున్న 2ఏళ్లల్లోపు ఇది మార్కెట్లోకి అడుగుపెడుతుందని సమాచారం. ఈవీ పోర్ట్‌ఫోలియోని కూడా ఇండియాలో దింపేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.