Nitin Gadkari to FM: ‘ఇన్సూరెన్స్‌పై 18శాతం జీఎస్టీ తొలగించండి’- ఆర్థిక మంత్రికి గడ్కరీ విజ్ఞప్తి..
31 July 2024, 13:14 IST
జీవితంలోని అనిశ్చితులపై ట్యాక్స్ వేస్తున్నారని, ఆరోగ్య- జీవిత భీమాలపై ఉన్న జీఎస్టీని తొలగించాలని నిర్మలా సీతారామన్‌కి నితిన్ గడ్కరీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆర్థికమంత్రికి లేఖ రాశారు.
నితిన్ గడ్కరీ..
జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను ఉపసంహరించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆర్థిక మంత్రికి లేఖ రాశారు. ఈ తరహా బీమాలపై జీఎస్టీ విధించడం అనేది జీవితంలోని అనిశ్చితులపై పన్ను విధించడంతో సమానమని లేఖలో గడ్కరీ పేర్కొన్నారు. అంతేకాకుండా జీఎస్టీ ఈ రంగం వృద్ధిని పరిమితం చేస్తుందని అన్నారు.
భారత దేశంలో అత్యంత కీలకమైన లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ ఉంటుంది.
"సీనియర్ సిటిజన్లకు ఇబ్బందికరంగా మారుతున్నందున జీవిత, వైద్య బీమా ప్రీమియంపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలనే సూచనను ప్రాధాన్య క్రమంలో పరిగణించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము," అని నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
ఆరోగ్య ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ఐటీ డిడక్షన్స్ని మళ్లీ ప్రవేశపెట్టడం, ప్రభుత్వం- సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ఏకీకరణకు సంబంధించిన అంశాలను తనను కలిసిన యూనియన్ సభ్యులు లేవనెత్తినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు.
అదేవిధంగా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ విధించడంతో సామాజికంగా అవసరమైన ఈ విభాగ వ్యాపార వృద్ధికి అడ్డంకిగా మారిందని అన్నారు.
“ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ట్యాక్స్ అనేది జీవితంలో ఎదురయ్యే అనిశ్చితులపై వేసే పన్నుగా అనిపిస్తుంది. తనకు ఏదైనా జరిగితే, తన కుటుంబానకి అండగా ఉంటుందని ఇన్సూరెన్స్ తీసుకునే వ్యక్తిపై ట్యాక్స్ భారం మోపడం సరైనది కాదని యూనియన్ సైతం అభిప్రాపడుతోంది,” అని నితిన్ గడ్కరీ తెలిపారు.
ఇదీ చూడండి:- iPhone news: ఎట్టకేలకు ఐఫోన్ లో కాల్ రికార్డింగ్ ఫెసిలిటీ; కాల్ సమ్మరీ, కాల్ ట్రాన్స్ స్క్రిప్షన్ ఫీచర్స్ కూడా..
కొన్ని రోజుల క్రితం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మోదీ 3.0 తొలి బడ్జెట్‌పై అన్ని వర్గాల వారి నుంచి విమర్శలు ఎదురువుతున్న తరుణంలో నితిన్ గడ్కరీ లేఖ రాయడం సర్వత్రా చర్చకు దారితీసింది. ఎన్డీఏ పక్ష పార్టీల రాష్ట్రానికే బడ్జెట్ల ప్రాధాన్యత ఇచ్చారని విపక్ష నేతలు ఆరోపిస్తుంటే, మధ్యతరగతి ప్రజలపై మరింత పన్ను భారం మోపారని నిర్మలా సీతారామన్‌ని ఉద్దేశించి సామాజిక మాధ్యమల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ దఫా బడ్జెట్లో దీర్ఘకాల పెట్టుబడులు, స్వల్పకాల పెట్టుబడులపై పన్నులను పెంచుతున్నట్టు నిర్మల ప్రకటించారు. ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ యాక్టివిటీని నియంత్రించేందుకు ఎస్టీటీ ట్యాక్స్‌ని పెంచారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్‌కి అత్యంత కీలకమైన ఇండెక్సేషన్ని తొలగించి మరో భారీ షాక్ ఇచ్చారు. వీటిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది.
కానీ నిర్మలా సీతారామన్ మాత్రం తాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌ని వెనకేసుకొచ్చారు. విపక్షాల ఆరోపణలను కొట్టిపారేశారు. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రాల పేర్లు తీయనంత మాత్రన డబ్బులు కేటాయించలేదని కాదని వ్యాఖ్యానించారు.