LIC: హెల్త్ ఇన్సూరెన్స్ రంగం లోకి ఎల్ఐసీ?.. సంకేతాలిచ్చిన ఎల్ఐసీ చైర్మన్
LIC to enter health insurance?: వృద్ధి దిశలో దూసుకుపోతున్న రంగాల్లో ఆరోగ్య బీమా ఒకటి. ప్రజల్లో ఆరోగ్య బీమా పట్ల అవగాహన పెరుగుతుండడంతో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం గణనీయ వృద్ధిని చూస్తోంది. ఈ నేపథ్యంలో.. భారత్ లోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తోంది.
LIC to enter health insurance?: ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ రంగంలో అభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశాలపై ఎల్ఐసీ సమగ్ర అధ్యయనం నిర్వహించినట్లు తెలిసింది. ఈ రంగంలో కాంపోజిట్ ఇన్సూరెన్స్ కంపెనీలను అనుమతించాలనే ప్రతిపాదన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీమా కంపెనీలకు ఇతర ఖర్చులు, కంప్లయన్స్ భారాన్ని తగ్గించడానికి కాంపోజిట్ ఇన్సూరెన్స్ లైసెన్సులను ప్రవేశపెట్టాలని ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. ప్రస్తుతం, జీవిత కంపెనీలు ఆరోగ్య బీమా కింద దీర్ఘకాలిక బెనిఫిట్ కవర్ లను మాత్రమే అందించగలవు. ఆసుపత్రి ఖర్చులు, నష్టపరిహార కవరేజీని అందించడానికి బీమా చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఉంది.
దీనిపై ఎల్ఐసీ చైర్మన్ ఏమన్నారంటే..?
‘‘కొత్త ప్రభుత్వం కాంపోజిట్ లైసెన్సులను అనుమతించవచ్చనే అంచనా ఉంది. మేము అంతర్గతంగా కొంత గ్రౌండ్ వర్క్ చేశాం. జనరల్ ఇన్సూరెన్స్ లో మాకు ప్రావీణ్యం, అనుభవం లేకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్ పై ఆసక్తి ఉంది. అందువల్ల ఈ రంగం వృద్ధి అవకాశాలను పరిశీలిస్తున్నాం’’ అని ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతీ వెల్లడించారు.
ఎల్ఐసీ క్యూ 4 ఫలితాలు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ 2024 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.13,781.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.10 చొప్పున ఈక్విటీ షేరుకు రూ.6 తుది డివిడెండ్ (Dividend) ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. త్వరలో జరగబోయే వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారుల ఆమోదానికి లోబడి డివిడెండ్ చెల్లింపు ఉంటుంది. పెట్టుబడుల ద్వారా ఎల్ఐసీ నికర ఆదాయం 24.43 శాతం పెరిగి రూ.84,425.45 కోట్లకు చేరుకుంది. అలాగే, 2024 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.40,676 కోట్లుగా నమోదైంది. ఉద్యోగుల వేతన సవరణ కారణంగా సంస్థపై అదనపు పెన్షన్ భారం రూ .6,306.29 కోట్లు పడనుంది.