Trolls on Ambanis: ‘‘నీ కొడుకు పెళ్లి ఖర్చును మా మీద వేస్తున్నావా..?’’ - అంబానీపై నెటిజన్ల ట్రోలింగ్
29 June 2024, 16:40 IST
Trolls on Ambanis: రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంపై నెటిజన్లు మండి పడుతున్నారు. ఒక వైపు నెట్ వర్క్ సర్వీస్ ను మెరుగుపర్చకుండా, మరోవైపు, టారిఫ్ లను భారీగా పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కోపాన్ని సోషల్ మీడియాలో ట్రోల్స్ రూపంలో వైరల్ చేస్తున్నారు.
అంబానీపై నెటిజన్ల ట్రోలింగ్
Trolls on Ambanis: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. కోట్లాది రూపాయల ఖర్చుతో, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అతిరథ మహారథుల సమక్షంలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహం జరగనుంది. అయితే, ఈ పెళ్లి ఖర్చుపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
నీ కొడుకు పెళ్లి ఖర్చు మాపైనా?
ఇటీవల అన్ని టెలీకాం కంపెనీలు తమ మొబైల్ రీచార్జ్ టారిఫ్ లను భారీగా పెంచాయి. ఈ టారిఫ్ ల పెంపుపై మొదట జియో నిర్ణయం తీసుకోగా, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఆ తరువాత అదే బాటన నడిచాయి. ఈ నేపథ్యంలో.. మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంపై రిలయన్స్ జియోపై నెటిజన్లు మండిపడ్తున్నారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లితో ఈ పెంపును ముడి పెడుతూ.. ‘‘నీ కొడుకు పెళ్లి ఖర్చును మా మీద వేస్తున్నావా..?’’ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ‘‘కొడుకు పెళ్లి ఖర్చు మొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీ మావా’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఎన్నికలు అయిపోయాయి కదా ఇక బాదుడే బాదుడు’’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య జియో సిగ్నల్ కూడా సరిగా రావట్లేదని, ఆ సర్వీస్ ను మెరుగుపర్చకుండా, చార్జాలను మాత్రం పెంచుతున్నారని ఫైరవుతున్నారు.
జూలై 3 నుంచి..
జూలై 3 నుంచి మొబైల్ సేవల రేట్లను పెంచుతున్నట్లు రిలయన్స్ జియో గురువారం ప్రకటించింది. దాదాపు అన్ని ప్లాన్లలో మొబైల్ సేవల రేట్లను కంపెనీ పెంచింది. దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత జియో మొబైల్ సేవల రేట్లను పెంచడం ఇదే తొలిసారి. ఇందులో 1 జీబీ డేటా యాడ్-ఆన్-ప్యాక్ కోసం రూ .15 ను రూ .19 కు పెంచారు. 75 జీబీ పోస్ట్ పెయిడ్ డేటా ప్లాన్ వినియోగదారులకు రూ .399 నుండి రూ. 449 కు పెరిగింది. 84 రోజుల వ్యాలిడిటీతో పాపులర్ రూ .666 అన్ లిమిటెడ్ ప్లాన్ ధరను జియో రూ .799 కు పెంచింది .
అత్యంత సరసమైన ధరలని ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన ధరలకు అత్యుత్తమ-నాణ్యమైన సేవలను అందిస్తామన్న తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నట్లు కొత్త ప్లాన్లను ప్రకటించినప్పుడు జియో తెలిపింది. "జియో ట్రూ 5జీతో - ప్రపంచంలో ఎక్కడా లేనంత వేగంగా 5 జీ రోల్ అవుట్ చేశాం. భారతదేశం ఇప్పుడు 5 జీలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో పనిచేస్తున్న మొత్తం 5 జీ సెల్స్ లో దాదాపు 85% జియో నెట్ వర్క్ లోనే ఉన్నాయి. భారతదేశపు ఏకైక స్టాండ్-అలోన్ ట్రూ 5 జీ నెట్వర్క్ తో జియో తన వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అపరిమిత 5 జి డేటాను అందిస్తూనే ఉంది’’ అని రిలయన్స్ జియో ప్రకటించింది.