Maruti Suzuki e Vitara : సింగిల్ ఛార్జ్‌తో 400కి.మీ రేంజ్- మారుతీ సుజుకీ తొలి ఈవీపై కీలక అప్డేట్..
20 December 2024, 13:10 IST
- మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్ కారుపై కీలక అప్డేట్! సంస్థ నుంచి వస్తున్న తొలి ఈవీని 2025 జనవరిలో జరగనున్న ఓ ప్రముఖ ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. ఆ వివరాలు..
మారుతీ సుజుకీ తొలి ఈవీపై కీలక అప్డేట్..
మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు అయిన ఈ విటారాకు సంబంధించిన కీలక అప్డేట్! ఈ ఈవీ ప్రొడక్షన్ వర్షెన్‌ని.. జనవరిలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రదర్శించనున్నారు. సుజుకీ ఈ విటారా మిలాన్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ ఈవెంట్లో మొట్టమొదటిసారి గ్లోబల్ అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు ఈవీఎక్స్గా పిలిచిన ఈ మారుతీ సుజుకీ ఈ విటారాను 2025 మధ్య నాటికి భారత మార్కెట్లో సంస్థ విడుదల చేస్తుందని తెలుస్తోంది.
మరోవైపు కొత్త ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. ఇందులో హోమ్ ఛార్జింగ్ సొల్యూషన్స్‌తో పాటు మారుతీ సుజుకీ డీలర్షిప్ లు, సర్వీస్ టచ్ పాయింట్ల వద్ద లభించే ఫాస్ట్ ఛార్జర్ల దేశవ్యాప్త నెట్వర్క్ కూడా ఉంటుంది.
మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. “ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులో, సౌకర్యవంతంగా, విస్తృత వినియోగదారులను ఆకర్షించడమే మా లక్ష్యం. ఈ విటారాతో మేము ఇదే సాధించాలని నిర్ణయించుకున్నాము,” అని అన్నారు.
మారుతీ సుజుకీ ఈ విటారా- ప్లాట్‌ఫామ్..
మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్ వాహనాన్ని హార్ట్‌టెక్-ఈ అని పిలిచే ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇది బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా తయారైంది. ఈ ప్లాట్‌ఫామ్ అధిక-వోల్టేజ్ రక్షణ, కాంపాక్ట్ ఓవర్ హాంగ్‌ను ఉన్న తేలికపాటి ఫ్రేమ్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది ఇంటీరియర్‌ను సులభతరం చేస్తుంది.
మారుతీ సుజుకీ ఈ విటారా- డైమెన్షన్స్..
మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్యూవీ పొడవు 4,275 ఎంఎం. వెడల్పు 1,800 ఎంఎం, ఎత్తు 1,635 ఎంఎం. ఇది 2,700 ఎంఎం పొడవైన వీల్‌బేస్‌ని కలిగి ఉంది. ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి 18-ఇంచ్ లేదా 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌పై ఈ ఈవీ ప్రయాణిస్తుంది. ఇది 180 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 5.2 మీటర్ల టర్నింగ్ రేడియస్ కలిగి ఉంది.
మారుతీ సుజుకీ ఈ విటారా- ఇంజిన్, బ్యాటరీ..
ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. ప్రపంచవ్యాప్తంగా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. అవి.. 49 కిలోవాట్, 61 కిలోవాట్. భారతీయ వినియోగదారులకు ఈ రెండు ఆప్షన్స్ లభిస్తాయో లేదో చూడాలి. ఇక ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు రేంజ్‌ని అందిస్తుందని తెలుస్తోంది. 49 కిలోవాట్ల బ్యాటరీ 142బీహెచ్పీ పవర్, 189ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2 డబ్ల్యూడీ మోడల్లో 61 కిలోవాట్ల బ్యాటరీ 172 బీహెచ్పీ పవర్, 189 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లిథియం ఐరన్-ఫాస్ఫేట్ బ్యాటరీలతో పాటు మోటారు. ఇన్వర్టర్లను అనుసంధానించే అత్యంత సమర్థవంతమైన ఈయాక్సిల్తో ఇంజిన్ తయారైందని సుజుకీ తెలిపింది.