Small Savings Schemes: ఏప్రిల్ 1 నుంచి ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేటు ఎంతో తెలుసా?
30 March 2024, 17:47 IST
Small Savings Schemes: సురక్షితమైన, క్రమబద్దమైన ఆదాయం ఇచ్చే పెట్టుబడి సాధనాల్లో చిన్న మొత్తాల పొదుపు పథకాలు ముఖ్యమైనవి. భారత్ దేశంలో ఇవి చాలా పాపులర్. వీటిలో పీపీఎఫ్, ఎన్ఎస్సీ, కేవీపీ, ఎస్ఎస్వై మొదలైనవి ఉన్నాయి. వీటి వడ్డీ రేట్లు ఈ ఏప్రిల్ 1 నుంచి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.
ప్రతీకాత్మక చిత్రం
Small Savings Schemes: 2024 ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ 50 లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు 30 శాతం వరకు అధిక రాబడులు వచ్చాయి. అయినప్పటికీ, భారత్ లో రిస్క్ ఎక్కువ ఉన్న పెట్టుబడుల్లో ఇన్వెస్ట్ చేయడానికి అత్యధికులు ఇష్టపడరు. సురక్షితమైన, క్రమబద్దమైన ఆదాయం ఇచ్చే పెట్టుబడి సాధనాలకే మొగ్గు చూపుతారు. మరోవైపు, కొందరు తమ పోర్ట్ ఫోలియోను డైవర్సిఫై చేస్తారు. తమ పెట్టుబడులను రిస్క్ ఉన్న, రిస్క్ లేని ఇన్వెస్ట్ మెంట్స్ గా బాలెన్స్ చేస్తారు.
చిన్న మొత్తాల పొదుపు పథకాలు
ఏప్రిల్ 1, 2024 నుంచి ప్రారంభమయ్యే జూన్ త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉండనున్నాయి. ఈ విషయాన్ని 2024 మార్చి 8న ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఇటీవల రెండు చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు 2024 జనవరి 1 నుంచి పెరిగాయి.
సుకన్య సమృద్ధి యోజన కు అత్యధిక వడ్డీ రేటు
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ కు, సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi yojana) ఖాతాలకు అత్యధిక వడ్డీ రేటు లభిస్తోంది. అంటే ఈ రెండు పథకాలకు 8.2 శాతం వార్షిక వడ్డీ రేటు లభిస్తోంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (National Savings Certificate) కు 7.7 శాతం, కిసాన్ వికాస్ పత్ర (KVP) కు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అదనంగా, కాంపౌండింగ్ రేటు కూడా పరిగణించవలసిన ముఖ్యమైన అంశం. కాంపౌండింగ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ రాబడి వస్తుంది.
ఈ పొదుపు పథకాలు భేష్
- పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ (Post Office Savings Account): ఇది బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ను పోలి ఉంటుంది. కనీస మొత్తంగా రూ.500 చెల్లించడం ద్వారా ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతాలో డిపాజిట్లకు గరిష్ట పరిమితి లేదు. ఈ అకౌంట్ నుంచి విత్ డ్రా చేయగల కనీస మొత్తం రూ.50. కానీ, దీనిపై 4% మాత్రమే వార్షిక వడ్డీ లభిస్తుంది.
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (National Savings Certificate): పెట్టుబడిదారులు కనీసం రూ .1,000 పెట్టుబడి పెట్టడం ద్వారా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఖాతా తెరవవచ్చు. ఇందులో కూడా డిపాజిట్లకు గరిష్ట పరిమితి లేదు. ఈ పథకం ద్వారా వార్షికంగా 7.7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. దీనిని అసలు మొత్తంతో వార్షికంగా కలిపినప్పటికీ మెచ్యూరిటీ సమయంలో మాత్రమే చెల్లిస్తారు.
- పీపీఎఫ్ (PPF): డిపాజిటర్లు ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్ఠంగా రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది.
- కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra- KVP): పెట్టుబడిదారులు కనీసం రూ .1,000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి లేదు. వార్షికంగా 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.
- సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi yojana): ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250, గరిష్టంగా రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. జనవరి 1, 2024 నుంచి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.