Post office schemes: ఇన్‍కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చే 5 పోస్టాఫీస్ స్కీమ్స్ ఇవే.. రాబడితో పాటు పన్ను మినహాయింపు
Post office schemes for Tax Benefits: ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని అందించే ఐదు బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్‍లు ఇవే.
Post office schemes for Tax Benefits: ప్రభుత్వం చాలా రకాల పోస్టాఫీస్ పథకాలను ప్రజలకు అందుబాటులో ఉంచింది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక పెట్టుబడుల కోసం పోస్టాఫీస్ స్కీమ్స్ అత్యుత్తమంగా ఉంటాయి. కాగా, పెట్టుబడిపై రాబడితో పాటు కొన్ని స్కీమ్‍లతో సెషన్ 80సీ కింద ఆదాయపు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అలాగే ఇన్‍కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అందించే 5 పోస్టాఫీస్ స్కీమ్స్ ఏవో ఇక్కడ చూడండి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
తాజా సవరణ తర్వాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వార్షిక వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. పీపీఎఫ్ మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలుగా ఉంటుంది. పీపీఎఫ్ తీసుకుంటే EEE (ఎక్సెమ్ట్(మినహాయింపు), ఎక్సెమ్ట్, ఎక్సెమ్ట్) స్టేటస్ ఉంటుంది. ఓ ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్‍లో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1.5లక్షల వరకు జమ చేయవచ్చు. దీంతో సెక్షన్ 80సీ కింద రూ.1.5లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. పీపీఎఫ్‍పై పొందే రాబడి మీద కూడా ఎలాంటి పన్ను ఉండదు.
సుకన్య సమృద్ధి యోజన
బాలికల ఉన్నత చదువులు, వివాహం కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‍లో పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ అకౌంట్ వార్షిక వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. SSY అకౌంట్‍లో ఇన్వెస్ట్‌మెంట్‍పై కూడా సెక్షన్ 80సీ కింద మినహాయింపు పొందవచ్చు. ఈ స్కీమ్‍లో 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఓ ఆర్థిక సంత్సరంలో కనీసం రూ.250.. గరిష్టంగా రూ.1.5లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.
5-సంవత్సరాల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్
ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదే ఈ టైమ్ డిపాజిట్ స్కీమ్. 5-సంవత్సరాల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా కూడా ప్రతీ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ స్కీమ్‍లో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం 5-సంవత్సరాల డిపాజిట్ స్కీమ్ వడ్డీ 7.5శాతంగా ఉంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
ప్రస్తుతం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీ రేటు 7.7 శాతంగా ఉంది. కనీసం రూ.100 నుంచి ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఓ ఆర్థిక సంవత్సరంలో ఎన్ఎస్‍సీ స్కీమ్ ద్వారా సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
60 సంవత్సరాలు అంత కన్నా ఎక్కువ వయసు ఉన్న వారు ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‍లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ వార్షిక వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు. దీంట్లో ఇన్వెస్ట్ చేసినా సెక్షన్ 80సీ కింద పన్ను డిడక్షన్ ప్రయోజనం పొందవచ్చు.
ఎన్ని పథకాల్లో పెట్టుబటి పెట్టినా ఓ వ్యక్తి ఓ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5లక్షల పన్ను మినహాయింపు మాత్రమే పొందగలరు. అందుకే కేవలం 80సీ పన్ను మినహాయింపు కోసమే అయితే.. ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా ఈ స్కీమ్‍ల్లో రూ.1.5లక్షలను ఇన్వెస్ట్ చేసుకునేలా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే, సెక్షన్ 80సీ ప్రయోజనం పాత పన్ను విధానానికే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి.
పోస్టాఫీస్ పథకాల వార్షిక వడ్డీ రేటును ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకు ఓసారి సమీక్షిస్తుంటుంది.